డేంజరస్‌ త్రో.. బ్యాట్స్‌మన్‌ షాక్‌!

3 Aug, 2020 16:29 IST|Sakshi

ప్రెస్టన్‌(నార్‌ ఇంగ్లండ్‌):  బ్యాట్‌మన్‌పైకి బంతిని బలంగా విసరడంతో పెనాల్టీ చెల్లించుకోవాల్సిన ఘటన ఓ కౌంటీ మ్యాచ్‌లో జరిగింది. బాబ్ విల్లీస్ ట్రోఫీలో భాగంగా లాంక‌షైర్, లీసెస్టర్‌షైర్ జట్ల మధ్య మ్యాచ్ ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా లీసెస్టర్‌షైర్ జట్టు సభ్యుడు డీటర్ క్లెయిన్ బౌలింగ్ చేస్తున్నాడు. తనవైపు వచ్చిన బంతిని బ్యాట్స్‌మెన్ వైపు బలంగా విసిరాడు. వేగంగా దూసుకెళ్లిన ఆ బంతి బ్యాట్స్‌మెన్‌కు తగిలింది. దీన్ని తప్పుబట్టిన అంపైర్ బ్యాటింగ్ చేస్తున్న జట్టుకు ఐదు పరుగులు అదనంగా జతచేశాడు.

బ్యాటింగ్ చేస్తున్న డ్యానీ లాంబ్ స్ట్రయిట్ షాట్ ఆడాడు. తనవైపే వచ్చిన బంతిని వెంటనే అందుకున్న డీటర్.. డ్యానీ వైపు బలంగా బంతిని విసిరాడు . అది డ్యానీకి తగిలింది. దీన్ని చూసిన అంపైర్ అది ప్రమాదకరమైన త్రో అని, నేరుగా బ్యాట్స్‌మెన్‌కు తగిలిందని డీటర్‌ను మందలించాడు. ఆ తర్వాత లాంకన్‌షైర్ జట్టుకు అదనంగా 5 పెనాల్టీ పరుగులు జతచేస్తున్నట్లు ప్రకటించాడు. క్రికెట్‌ చట్టంలో 42 నిబంధన ప్రకారం బ్యాట్స్‌మన్‌పైకి ఉద్దేశపూర్వకంగా కానీ, ప్రమాదకరంగా కానీ త్రో విసరడం లెవెల్‌-2 నేరం కిందకు వస్తుంది. దాంతోనే ఆ మ్యాచ్‌కు అంపైర్లగా ఉన్న నిక్‌ కుక్‌, రాబ్‌ వైట్‌లు బౌలర్‌కు వార్నింగ్‌ ఇవ్వడంతో ఐదు పరుగులు అదనంగా ఇచ్చారు.

మరిన్ని వార్తలు