Formula 1: హామిల్టన్‌ ‘విక్టరీల సెంచరీ’....

27 Sep, 2021 11:09 IST|Sakshi

సోచీ (రష్యా): ఫార్ములావన్‌ (ఎఫ్‌1) స్టార్, ప్రస్తుత ప్రపంచ చాంపియన్‌ లూయిస్‌ హామిల్టన్‌ తన కెరీర్‌లో 100వ రేసు విజయాన్ని అందుకున్నాడు. గత కొంత కాలంగా ఊరిస్తూ వస్తోన్న ‘విక్టరీల సెంచరీ’ని హామిల్టన్‌ రష్యా గ్రాండ్‌ప్రితో పూర్తి చేశాడు. ఆదివారం జరిగిన 53 ల్యాప్‌ల ప్రధాన రేసును అతడు గంటా 30 నిమిషాల 41.001 సెకన్లలో పూర్తి చేశాడు. రెండో స్థానంలో వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌)... మూడో స్థానంలో కార్లోస్‌ సెయింజ్‌ (ఫెరారీ) నిలిచారు. పోల్‌ పొజిషన్‌ నుంచి రేసును ఆరంభించిన లాండో నోరిస్‌ (మెక్‌లారెన్‌) ఏడో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

రన్నరప్‌ గాయత్రి జంట
జకోపేన్‌ (పోలాండ్‌): పోలిష్‌ ఓపెన్‌ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న తెలంగాణ క్రీడాకారిణులు గాయత్రి గోపీచంద్‌ పుల్లెల, సామియా ఇమాద్‌ ఫారూఖీ రన్నరప్‌గా నిలిచారు. మహిళల డబుల్స్‌ విభాగం ఫైనల్లో గాయత్రి–త్రిషా జాలీ (భారత్‌) ద్వయం 10–21, 18–21తో మార్గోట్‌ లాంబర్ట్‌–యాన్‌ ట్రాన్‌ (ఫ్రాన్స్‌) జోడీ చేతిలో ఓడిపోయింది. మహిళల సింగిల్స్‌ ఫైనల్లో సామియా 11–21, 9–21తో మూడో సీడ్‌ యు యాన్‌ జస్లిన్‌ హుయ్‌ (సింగపూర్‌) చేతిలో ఓటమి చవిచూసింది.

చదవండి: సానియా మీర్జా ఖాతాలో 43వ డబుల్స్‌ టైటిల్‌ 

మరిన్ని వార్తలు