రికార్డుపై హామిల్టన్‌ గురి

2 Aug, 2020 02:49 IST|Sakshi

నేటి బ్రిటిష్‌ గ్రాండ్‌ప్రి రేసులో పోల్‌ పొజిషన్‌తో బరిలోకి

సిల్వర్‌స్టోన్‌ (ఇంగ్లండ్‌): సొంతగడ్డపై అత్యధిక టైటిల్స్‌ గెలిచిన ఫార్ములావన్‌ (ఎఫ్‌1) తొలి డ్రైవర్‌గా గుర్తింపు పొందేందుకు మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ మరో విజయం దూరంలో ఉన్నాడు. ఆదివారం జరిగే బ్రిటిష్‌ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసులో ఈ బ్రిటన్‌ డ్రైవర్‌ ‘పోల్‌ పొజిషన్‌’తో బరిలోకి దిగనున్నాడు. శనివారం జరిగిన క్వాలిఫయింగ్‌ సెషన్‌లో హామిల్టన్‌ అందరికంటే వేగంగా ఒక నిమిషం 24.303 సెకన్లలో ల్యాప్‌ను పూర్తి చేసి కెరీర్‌లో 91వసారి పోల్‌ పొజిషన్‌ దక్కించుకున్నాడు.

నేడు జరిగే ప్రధాన రేసులో హామిల్టన్‌ విజేతగా గెలిస్తే బ్రిటిష్‌ గ్రాండ్‌ప్రిని ఏడోసారి సొంతం చేసుకున్న డ్రైవర్‌గా రికార్డు నెలకొల్పుతాడు. ప్రస్తుతం సొంతగడ్డపై అత్యధిక టైటిల్స్‌ నెగ్గిన రికార్డు విషయంలో హామిల్టన్, అలైన్‌ ప్రాస్ట్‌ (ఫ్రాన్స్‌–ఫ్రెంచ్‌ గ్రాండ్‌ప్రి; ఆరుసార్లు) సమఉజ్జీగా ఉన్నారు. రెండువారాల క్రితం హంగేరి గ్రాండ్‌ప్రిలో టైటిల్‌ నెగ్గిన హామిల్టన్‌ ఒకే రేసును అత్యధికంగా ఎనిమిదిసార్లు గెలిచిన డ్రైవర్‌గా మైకేల్‌ షుమాకర్‌ (ఫ్రెంచ్‌ గ్రాండ్‌ప్రి–8 సార్లు) పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు.  

బ్రిటిష్‌ గ్రాండ్‌ప్రి ప్రధాన రేసు గ్రిడ్‌ పొజిషన్స్‌: 1. హామిల్టన్‌ (మెర్సిడెస్‌), 2. బొటాస్‌ (మెర్సిడెస్‌), 3. వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌), 4. లెక్‌లెర్క్‌ (ఫెరారీ), 5. లాండో నోరిస్‌ (మెక్‌లారెన్‌), 6. లాన్స్‌ స్ట్రోల్‌ (రేసింగ్‌ పాయింట్‌), 7. కార్లోస్‌ సెయింజ్‌ (మెక్‌లారెన్‌), 8. రికియార్డో (రెనౌ), 9. ఎస్తెబన్‌ ఒకాన్‌ (రెనౌ), 10. వెటెల్‌ (ఫెరారీ), 11. పియరీ గాస్లీ (అల్ఫా టౌరి), 12. ఆల్బోన్‌ (రెడ్‌బుల్‌), 13. హుల్కెన్‌బర్గ్‌ (రేసింగ్‌ పాయింట్‌), 14. జార్జి రసెల్‌ (విలియమ్స్‌), 15. మాగ్నుసెన్‌ (హాస్‌), 16. గియోవినాజి (అల్ఫా రోమియో), 17. రైకోనెన్‌ (అల్ఫా రోమియో), 18. గ్రోస్యెన్‌ (హాస్‌), 19. క్వియాట్‌ (అల్ఫా టౌరి), 20. నికోలస్‌ లటీఫి (విలియమ్స్‌).

మరిన్ని వార్తలు