విజేత హామిల్టన్‌

2 Nov, 2020 06:01 IST|Sakshi

ఎమిలియా గ్రాండ్‌ప్రి

ఇమోలా: మెర్సిడెస్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ తాజా ఎఫ్‌1 సీజన్‌లో మరో రేసు విజయాన్ని నమోదు చేశాడు. ఆదివారం జరిగిన 63 ల్యాప్‌ల ఎమిలియా రొమానో గ్రాండ్‌ప్రి ప్రధాన రేసును రెండో స్థానం నుంచి ఆరంభించిన హామిల్టన్‌... గంటా 28 నిమిషాల 32.430 సెకన్లలో అందరికంటే ముందుగా పూర్తి చేసి విజేతగా నిలిచాడు. సీజన్‌లో హామిల్టన్‌కిది తొమ్మిదో విజయం కాగా... ఓవరాల్‌గా 93వది. రేసును ఆరంభించడంలో విఫలమైన హామిల్టన్‌ తొలి ల్యాప్‌లో ఒక స్థానం దిగజారి మూడో స్థానానికి పడిపోయాడు. అయితే 21వ ల్యాప్‌లో సహచర మెర్సిడెస్‌ డ్రైవర్‌ వాల్తెరి బొటాస్‌ టైర్లు మార్చుకోవడానికి పిట్స్‌లోకి రావడంతో లీడ్‌లోకి వచ్చిన హామిల్టన్‌... తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ వెళ్లాడు. అదే సమయంలో హామిల్టన్‌కు ‘వర్చువల్‌ సేఫ్టీ కారు’ రూపంలో అదృష్టం కూడా తోడవ్వడంతో ఇక వెనుదిరిగి చూడలేదు.

33వ ల్యాపులో ఒకాన్‌ (రెనౌ) కారులో సమస్య తలెత్తడంతో... అతడు తన కారును ట్రాక్‌ పక్కన నిలిపేశాడు. దాంతో ఆ కారును తొలగించే వరకు ఎటువంటి ప్రమాదం జరగకుండా... ఎఫ్‌1 స్టీవర్డ్స్‌ ‘వర్చువల్‌ సేఫ్టీ కారు’ను డెప్లాయ్‌ చేశారు. అదే సమయంలో తన కారు టైర్లను మార్చుకున్న హామిల్టన్‌ తొలి స్థానాన్ని తిరిగి దక్కించుకున్నాడు. ఈ ఆధిక్యాన్ని చివరి వరకు కాపాడుకున్న అతడు విజేతగా నిలిచాడు. బొటాస్‌ రెండో స్థానంలో... రికియార్డో (రెనౌ) మూడో స్థానంలో నిలిచారు. 51వ ల్యాప్‌లో టైరు పంక్చర్‌ కావడంతో మ్యాక్స్‌ వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌) రేసు నుంచి వైదొలిగాడు. సీజన్‌లో 13 రేసులు ముగిశాక హామిల్టన్‌ 282 పాయింట్లతో డ్రైవర్‌ చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో ఉండగా... బొటాస్‌ 197 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. తాజా విజయంతో వరుసగా ఏడో ఏడాది (2014, 15, 16, 17, 18, 19, 20) కన్‌స్ట్రక్టర్‌ (జట్టు) చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను నెగ్గి ఈ రికార్డును సాధించిన తొలి ఎఫ్‌1 టీమ్‌గా నిలిచింది.

మరిన్ని వార్తలు