హై హై హామిల్టన్‌...

16 Nov, 2020 05:14 IST|Sakshi

ఏడోసారి ఎఫ్‌1 ప్రపంచ చాంపియన్‌గా బ్రిటన్‌ డ్రైవర్‌

షుమాకర్‌ రికార్డు సమం

టర్కీ గ్రాండ్‌ప్రిలో విజయంతో ఈ సీజన్‌లో పదో గెలుపు  

ఇస్తాంబుల్‌: ఫార్ములావన్‌ (ఎఫ్‌1) క్రీడలో తన ఆధిపత్యాన్ని మరోసారి నిరూపించుకున్న బ్రిటన్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ తన కెరీర్‌లో మరో మైలురాయి అందుకున్నాడు. ఎఫ్‌1 దిగ్గజం మైకేల్‌ షుమాకర్‌ పేరిట ఉన్న మరో రికార్డును ఈ మెర్సిడెస్‌ డ్రైవర్‌ సమం చేశాడు. ఆదివారం జరిగిన టర్కీ గ్రాండ్‌ప్రి రేసులో హామిల్టన్‌ విజేతగా నిలిచాడు. నిర్ణీత 58 ల్యాప్‌ల ఈ రేసును ఆరో స్థానం నుంచి ప్రారంభించిన హామిల్టన్‌ అందరికంటే వేగంగా గంటా 42 నిమిషాల 19.313 సెకన్లలో ముగించి అగ్రస్థానాన్ని పొందాడు.

ఈ సీజన్‌లో హామిల్టన్‌కిది పదో విజయంకాగా... కెరీర్‌లో 94వ విజయం. తాజా గెలుపుతో ఈ సీజన్‌లో మరో మూడు రేసులు మిగిలి ఉండగానే 35 ఏళ్ల హామిల్టన్‌ డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌ టైటిల్‌నూ సొంతం చేసుకున్నాడు. హామిల్టన్‌ కెరీర్‌లో ఇది ఏడో ప్రపంచ టైటిల్‌. తద్వారా ఏడు ప్రపంచ టైటిల్స్‌తో మైకేల్‌ షుమాకర్‌ (జర్మనీ) పేరిట ఉన్న ప్రపంచ రికార్డును హామిల్టన్‌ సమం చేశాడు.

2013లో మెర్సిడెస్‌ జట్టులో షుమాకర్‌ స్థానాన్ని భర్తీ చేసిన హామిల్టన్‌ అదే జట్టు తరఫున ప్రాతినిధ్యం వహిస్తూ ఆరుసార్లు ప్రపంచ టైటిల్‌ను దక్కించుకోగా... 2008లో మెక్‌లారెన్‌ తరఫున పోటీపడి హామిల్టన్‌ తొలిసారి ప్రపంచ చాంపియన్‌షిప్‌ టైటిల్‌ను అందుకున్నాడు. ఇటీవలే అత్యధికసార్లు ఎఫ్‌1 రేసుల్లో విజేతగా నిలిచిన షుమాకర్‌ (91 సార్లు) రికార్డును హామిల్టన్‌ బద్దలు కొట్టిన సంగతి తెలిసిందే.   
 
మెర్సిడెస్‌కే చెందిన తన సహచరుడు వాల్తెరి బొటాస్‌ కంటే ముందుగా నిలిస్తే ప్రపంచ టైటిల్‌ను ఖాయం చేసుకునే పరిస్థితిలో ఆరో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన హామిల్టన్‌కు ఇతర డ్రైవర్ల వ్యూహాత్మక తప్పిదాలు కలిసొచ్చాయి. ఆరంభంలో దూకుడు కనబర్చని హామిల్టన్‌ సగం ల్యాప్‌లు పూర్తయ్యాక జోరు పెంచాడు. 35వ ల్యాప్‌లో తొలిసారి ఆధిక్యంలోకి వచ్చిన హామిల్టన్‌ చివరి ల్యాప్‌ వరకు కాపాడుకొని ఏకంగా 31 సెకన్ల తేడాతో విజయాన్ని అందుకున్నాడు. సెర్గియో పెరెజ్‌ (రేసింగ్‌ పాయింట్‌) రెండో స్థానంలో... సెబాస్టియన్‌ వెటెల్‌ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు.

‘పోల్‌పొజిషన్‌’తో రేసును మొదలుపెట్టిన లాన్స్‌ స్ట్రాల్‌ (రేసింగ్‌ పాయింట్‌) తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు. హామిల్టన్‌ సహచరుడు బొటాస్‌ 14వ స్థానంలో నిలిచాడు. మొత్తం 20 మంది డ్రైవర్లలో ముగ్గురు రేసును ముగించలేకపోయారు. మొత్తం 17 రేసుల ఈ సీజన్‌లో 14 రేసులు పూర్తయ్యాక... హామిల్టన్‌ 307 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో ఉన్నాడు. 197 పాయింట్లతో బొటాస్‌ (మెర్సిడెస్‌) రెండో స్థానంలో... 170 పాయింట్లతో వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌) మూడో స్థానంలో ఉన్నారు. సీజన్‌లోని తదుపరి రేసు బహ్రెయిన్‌ గ్రాండ్‌ప్రి ఈనెల 29న జరుగుతుంది.  

అత్యధిక ఎఫ్‌1 ప్రపంచ టైటిల్స్‌ నెగ్గిన డ్రైవర్లు
హామిల్టన్‌ (బ్రిటన్‌–7): 2008, 2014, 2015, 2017, 2018, 2019, 2020
షుమాకర్‌ (జర్మనీ–7) : 1994, 1995, 2000, 2001, 2002, 2003, 2004
ఫాంగియో (అర్జెంటీనా–5): 1951, 1954, 1955, 1956, 1957
అలైన్‌ ప్రాస్ట్‌ (ఫ్రాన్స్‌–4) : 1985, 1986, 1989, 1993
సెబాస్టియన్‌ వెటెల్‌ (జర్మనీ–4): 2010, 2011, 2012, 2013

ఏదీ అసాధ్యం కాదు. మీ కలలను సాకారం చేసుకునేందుకు నిత్యం శ్రమిస్తూ ఉండాలి. ఏడుసార్లు ప్రపంచ చాంపియన్‌ కాగలనని నేను అన్నప్పుడు అందరూ అసాధ్యమని అన్నారు. కానీ నేను సాధించి చూపించాను. రంగం ఏదైనా ఓటమి ఎదురైతే బాధపడకూడదు. అనుక్షణం పోరాడుతూనే ఉండాలి. చివరికి విజయం తప్పకుండా సిద్ధిస్తుంది. మైకేల్‌ షుమాకర్‌ ప్రపంచ రికార్డును సమం చేయడంతో అందరి దృష్టి నాపై పడింది. అయితే ఎల్లప్పుడూ నేను ఈ క్రీడలో ఉండనని గమనించాలి. ఈ క్షణంలో అందరితో నేను కోరేది ఒక్కటే... ప్రపంచంలో సమానత్వం కోసం మీ వంతుగా కృషి చేయండి. వర్ణం, హోదా, నేపథ్యం చూడకుండా అందరికీ సమాన అవకాశాలు కల్పించండి.
–హామిల్టన్‌  


 

>
మరిన్ని వార్తలు