హామిల్టన్‌ ‘హ్యాట్రిక్‌’

3 Aug, 2020 02:21 IST|Sakshi

ఎఫ్‌1 సీజన్‌లో వరుసగా మూడో విజయం

ఏడోసారి బ్రిటిష్‌ గ్రాండ్‌ప్రి టైటిల్‌ సొంతం

సిల్వర్‌స్టోన్‌ (ఇంగ్లండ్‌): సొంతగడ్డపై దుమ్మురేపిన బ్రిటన్‌ డ్రైవర్‌ లూయిస్‌ హామిల్టన్‌ ఈ ఏడాది ఫార్ములావన్‌ (ఎఫ్‌1) సీజన్‌లో ‘హ్యాట్రిక్‌’ నమోదు చేశాడు. ఆదివారం జరిగిన సీజన్‌లోని నాలుగో రేసు బ్రిటిష్‌ గ్రాండ్‌ప్రిలో హామిల్టన్‌ విజేతగా నిలిచాడు. ‘పోల్‌ పొజిషన్‌’తో రేసును ఆరంభించిన ఈ మెర్సిడెస్‌ జట్టు డ్రైవర్‌ నిర్ణీత 52 ల్యాప్‌లను అందరికంటే వేగంగా, ముందుగా గంటా 28 నిమిషాల 01.283 సెకన్లలో ముగించాడు.

తద్వారా రికార్డుస్థాయిలో ఏడోసారి (2008, 2014, 2015, 2016, 2017, 2019, 2020) బ్రిటిష్‌ టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. రేసు మరో ల్యాప్‌లో ముగుస్తుందనగా హామిల్టన్‌ కారు టైరు పంక్చర్‌ కావడం గమనార్హం. పంక్చర్‌ టైరుతోనే హామిల్టన్‌ రేసును పూర్తి చేశాడు. మాక్స్‌ వెర్‌స్టాపెన్‌ (రెడ్‌బుల్‌) రెండో స్థానంలో, చార్లెస్‌ లెక్‌లెర్క్‌ (ఫెరారీ) మూడో స్థానంలో నిలిచారు. కారులో సాంకేతిక సమస్య తలెత్తడంతో రేసింగ్‌ పాయింట్‌ డ్రైవర్‌ నికో హుల్కెన్‌బర్గ్‌ రేసును ప్రారంభించలేదు. క్వియాట్‌ (అల్ఫా టౌరి) 11వ ల్యాప్‌లో, మాగ్నుసెన్‌ (హాస్‌) తొలి ల్యాప్‌లో వైదొలిగారు.

ఈ గెలుపుతో సొంతగడ్డపై అత్యధిక ఎఫ్‌1 టైటిల్స్‌ గెలిచిన తొలి డ్రైవర్‌గా హామిల్టన్‌ రికార్డు సృష్టించాడు. ఈ రేసుకంటే ముందు ఫ్రాన్స్‌ డ్రైవర్‌ అలైన్‌ ప్రాస్ట్‌ (ఫ్రెంచ్‌ గ్రాండ్‌ప్రి–6 సార్లు)తో హామిల్టన్‌ సమఉజ్జీగా ఉన్నాడు. ఓవరాల్‌గా హామిల్టన్‌ కెరీర్‌లో ఇది 87వ ఎఫ్‌1 టైటిల్‌. మరో నాలుగు టైటిల్స్‌ గెలిస్తే అత్యధిక ఎఫ్‌1 టైటిల్స్‌ నెగ్గిన మైకేల్‌ షుమాకర్‌ (91 విజయాలు) పేరిట ఉన్న రికార్డును హామిల్టన్‌ సమం చేస్తాడు. సీజన్‌లోని ఐదో రేసు బ్రిటిష్‌ గ్రాండ్‌ప్రి వేదికపైనే ఈనెల 9న జరుగుతుంది. ఆస్ట్రియా, హంగేరి, బ్రిటిష్‌ గ్రాండ్‌ప్రి విజయాలతో హామిల్టన్‌ 88 పాయింట్లతో డ్రైవర్స్‌ చాంపియన్‌షిప్‌లో అగ్రస్థానంలో ఉన్నాడు.

మరిన్ని వార్తలు