క్రికెట్ చరిత్రలో అతి భారీ సిక్స్.. కొడితే కనుచూపు మేరలో కనపడలేదు 

19 Jul, 2021 21:37 IST|Sakshi

Liam Livingstone Six: ఇంగ్లండ్‌, పాకిస్తాన్ మధ్య జరిగిన రెండో టీ20లో క్రికెట్ చరిత్రలోనే అతి భారీ సిక్స్ నమోదైంది. లీడ్స్‌లోని హెడింగ్లే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ విధ్వంసకర యోధుడు లియామ్ లివింగ్‌స్టోన్ 122 మీటర్ల కంటే పొడవైన అతి భారీ సిక్సర్‌ను నమోదు చేశాడు. ఈ సిక్సర్‌ ఏకంగా మైదానాన్ని దాటి పక్కనే ఉన్న రగ్బీ పిచ్‌పై పడింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌ 16 వ ఓవర్లో పాక్‌ బౌలర్‌ హరీస్‌ రవూఫ్‌ వేసిన బంతిని లాంగాన్‌ మీదుగా గట్టిగా బాదడంతో అది కనుచూపు మేరలో కనబడలేదు. ఈ సిక్స్‌ను ప్రపంచంలోనే అత్యంత పొడవైన అతి భారీ సిక్సర్‌ అని వ్యాఖ్యాతలతోపాటు నెటిజన్లు అంటున్నారు. 

అయితే, ఈ సిక్స్‌ యొక్క అధికారిక పొడవును కొలవడం మాత్రం సాధ్యపడలేదు. కాగా, ఇలాంటి సిక్స్‌ను తాము ఇంతవరకు చూడలేదని స్కై స్పోర్ట్స్‌ కామెంట్రేటర్లుగా ఉన్న ఇయాన్‌ వార్డ్‌, కుమార సంగక్కర మ్యాచ్‌ అనంతరం వెల్లడించారు. ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ (ఈసీబీ) తమ అధికారిక ట్విట్టర్‌లో ఈ సిక్సర్‌ వీడియోని షేర్ చేసి 'ఇదేనా అతి భారీ సిక్స్?' అంటూ ప్రశ్నించింది.

కాగా, ఈ మ్యాచ్‌లో బట్లర్ (59), మొయిన్ అలీ (36), లియామ్ లివింగ్‌స్టోన్ (38) చెలరేగడంతో ఆతిధ్య జట్టు 19.5 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. అనంతరం 201 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 155 పరుగులు మాత్రమే చేయగలిగింది. షకీబ్ మహ్మద్, ఆదిల్ రషీద్, మొయిన్ అలీ తమ బౌలింగ్‌తో పాకిస్తాన్ కట్టడి చేశారు. ఈ విజయంతో 3 టీ20ల సిరీస్‌ను ఇంగ్లండ్‌ 1-1తో సమం చేసుకుంది. ఇదిలా ఉంటే, ఇరు జట్ల మధ్య జరిగిన తొలి టీ20లోనూ లివింగ్‌స్టోన్ 42 బంతుల్లోనే శతకొట్టడం విశేషం. 

మరిన్ని వార్తలు