SreeShankar Won Silver CWG 2022: మేజర్‌ సర్జరీ.. లాంగ్‌ జంప్‌ చేయొద్దన్నారు; ఎవరీ మురళీ శ్రీశంకర్‌?

5 Aug, 2022 13:24 IST|Sakshi

ఒక ఇంట్లో  తండ్రి మంచి క్రీడాకారుడైనంత మాత్రాన అతడి వారసులు(కొడుకు లేదా కూతురు) అలాగే అవ్వాలని ఎక్కడా రాసిపెట్టి ఉండదు. అయితే,  కొంతమంది తల్లిదండ్రులు మాత్రం తమ వారసులు కూడా క్రీడాకారులు అవ్వాలని.. రాణించాలని ఆశపడుతుంటారు. మరికొంత మంది మాత్రం తాము ఏం కావాలనుకుంటున్నామో అన్న నిర్ణయాన్ని పిల్లలకే వదిలేస్తారు. 

ఆ ప్రయత్నంలో కొంతమంది పిల్లలు విఫలమైతే.. మరికొందరు మాత్రం వారసత్వాన్ని కొనసాగిస్తూ దూసుకుపోతారు. ఆ కోవకు చెందినవాడే భారత్‌ హై జంప్‌ స్టార్‌ అథ్లెట్‌ మురళీ శ్రీశంకర్‌. తన అపూర్వ విజయంతో తల్లిదండ్రులతో పాటు యావత్‌ భారతావనిని గర్వపడేలా చేశాడు.

బర్మింగ్‌హమ్‌ వేదికగా జరుగుతున్న కామన్‌వెల్త్‌ గేమ్స్‌ 2022లో హై జంప్‌ విభాగంలో జరిగిన ఫైనల్స్‌లో ఐదో ప్రయత్నంలో 8.08 మీటర్లు దూకి రజతం ఒడిసిపట్టాడు. ఇక శ్రీశంకర్‌ ఆర్థికంగా ఏనాడు ఇబ్బంది పడనప్పటికి.. ఈరోజు పతకం సాధించాడంటే అందులో తన పాత్ర ఎంత ఎందో.. కుటుంబానికి అంతే ప్రాధాన్యత ఉంటుంది. 

23 ఏళ్ల మురళీ శ్రీ శంకర్‌ కేరళలోని పాలక్కడ్‌ ప్రాంతంలో పుట్టి పెరిగాడు. తల్లిదండ్రులిద్దరు క్రీడాకారులే కావడం శ్రీశంకర్‌కు కలిసి వచ్చింది. తల్లి కెఎస్‌ బిజ్మోల్‌ 800 మీటర్ల క్రీడాకారిణి.. తండ్రి ఎకోస్‌ బిజ్మోల్‌ అథ్లెటిక్స్‌ కోచ్‌గా పని చేస్తున్నాడు. ఇంకేముంది తల్లిదం‍డ్రులిద్దరు క్రీడా విభాగంతో పరిచయం ఉంటే శ్రీశంకర్‌ క్రీడాకారుడు కాకుండా ఇంకేం అవుతాడు.


కుటుంబంతో మురళీ శ్రీశంకర్‌

2018 కామన్‌వెల్త్‌ క్రీడలకు చివరి నిమిషంలో దూరమయ్యాడు మురళీ శ్రీశంకర్‌. అపెండిస్‌ రూపంలో అతనికి సమస్య వచ్చి పడింది. నొప్పిని భరించలేక కామన్‌వెల్త్‌ గేమ్స్‌కు దూరమయ్యాడు. లాంగ్‌ జంప్‌ చేస్తే సమస్యలు చుట్టుముడుతాయన్నారు వైద్యులు. కానీ అపెండిస్‌ ఆపరేషన్‌ విజయవంతం కావడం.. ఆ తర్వాత కఠోర సాధన ద్వారా శ్రీశంకర్‌ లాంగ్‌జంప్‌లో ఈ నాలుగేళ్లలో తనను తాను చాలా మెరుగు పరుచుకున్నాడు. తాజాగా కామన్‌వెల్త్‌ గేమ్స్‌లో రజతంతో మెరిసిన మురళీ శ్రీశంకర్‌ ఔరా అనిపించాడు. 

మురళీ శ్రీశంకర్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
శ్రీశంకర్‌ తాను సాధన చేసే సమయంలో ఎలాంటి డిస్టర్బన్స్‌ లేకుండా చూసుకోవడం అలవాటు. తాను ఇంట్లో ప్రాక్టీస్‌ చేస్తున్న సమయంలోనూ అంతేనంట. ఒక సందర్బంలో శ్రీశంకర్‌ తం‍డ్రి మొబైల్‌కు హెడ్‌ఫోన్స్‌ పెట్టుకొని పాటలు వింటున్నాడు. ఆ పాట సౌండ్‌ శంకర్‌కు వినిపించింది. వెంటనే తండ్రి దగ్గరకు వచ్చి నా ప్రాక్టీస్‌ సమయంలో నాకు ఎలాంటి సౌండ్‌ వినిపించొద్దు.. అలా అయితే నేను డిస్ట్రబ్‌ అవుతా అని చెప్పాడట. అంతే ఆప్పటి నుంచి ఇప్పటివరకు శ్రీశంకర్‌ ప్రాక్టీస్‌ సమయంలో తండ్రి మ్యూజిక్‌ను బ్యాన్‌ చేస్తూనే వచ్చాడు. శ్రీశంకర్‌ తెచ్చిన ఈ రూల్‌ ఇప్పటికి ఆ కుటుంబసభ్యులు పాటిస్తూనే ఉన్నారు.

11 గంటల తర్వాత టీవీ కట్‌..
ఇక రాత్రి 11 గంటల తర్వాత శ్రీశంకర్‌ ఇంట్లో ఎవరు టీవీ చూడరు. అది ఎంత పెద్ద మ్యాచ్‌ గాని.. ఇంట్లో మాత్రం టీవీ ఆన్‌ చేయరు. తాజాగా శ్రీశంకర్‌ ఒక మెగాటోర్నమెంట్‌లో పాల్గొంటూ మ్యాచ్‌ ఆడుతున్న సంగతి తెలిసి కూడా టీవీ పెట్టలేదంటే వాళ్లు తమ నిర్ణయానికి ఎంత కట్టుబడి ఉన్నారో తెలుస్తోంది. తమ కొడుకు కామన్‌వెల్త్‌లో రజతం సాధించాడన్న వార్తను ఆ తల్లిదండ్రులు ఉదయమే తెలుసుకోవడం విశేషం.

శ్రీశంకర్‌ తనకు 18 ఏళ్ల వయసు వచ్చేవరకు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి వాటికి దూరంగా ఉన్నాడు. తల్లిదండ్రులు తనపై ఎన్ని ఆంక్షలు పెట్టినా వాటిని ఏనాడు నెగిటివ్‌గా తీసుకోలేదు. వాళ్లు పెట్టే కండీషన్స్‌ వల్లే ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నానని శ్రీశంకర్‌ బలంగా నమ్ముతాడు.

చదువులో మెరిట్‌..
సాధారణంగా క్రీడాకారులుగా మారేవాళ్లకు సరిగ్గా చదువు అబ్బదంటారు. కానీ ఈ విషయంలో శ్రీశంకర్‌ పూర్తిగా వేరు. ఆటలో ఎంత చురుకుగా ఉండేవాడో.. చదువులోనూ అంతే చురుకుదనాన్ని చూపించేవాడు. మ్యాచ్‌లు లేని సమయంలో చదువుకునే శ్రీశంకర్‌.. ఒకవేళ తాను పాల్గొనబోయే గేమ్స్‌లో సమయం దొరికితే కూడా చదువుకునేవాడు. అలా 10వ తరగతి, ఇంటర్మీడియెట్‌లు 95 శాతం మార్కులతో పాసయ్యాడు.

ఆ తర్వాత నీట్‌ పరీక్షలో స్పోర్ట్స్‌ కోటాలో సెకండ్‌ ర్యాంక్‌ సాధించిన మురళీ శ్రీశంకర్‌ మెరిట్‌లో బీఎస్సీ మాథ్స్‌ను పూర్తి చేశాడు. నీట్‌లో తనకొచ్చిన మార్కులతో మెడికల్‌ సీట్‌ వచ్చే అవకాశం ఉన్నప్పటికి వేరే కారణాల వల్ల మెడిసిన్‌ చేయలేదు. ఇక్కడ విచిత్రమేంటంటే.. మెరిట్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినప్పటికి శ్రీశంకర్‌ ఇప్పటికి నిరుద్యోగే.'' చదువు మనకు బ్రతికే తెలివిని నేర్పిస్తుంది.. నాతో సహా నా మిత్రులందరూ ఇప్పటికీ ఏ ఉద్యోగాలు చేయడం లేదంటే నమ్ముతారా.. భారత్‌ కదా ఈ పరిస్థితి మాములే'' అని ఒక సందర్బంలో చెప్పుకొచ్చాడు.

మద్యం, సిగరెట్లకు ఆమడ దూరం
శ్రీశంకర్‌ ఇచ్చే పార్టీల్లో ఫ్రూట్‌ జ్యూస్‌లు తప్ప ఇంకేం కనిపించవు. ఎందుకంటే శ్రీశంకర్‌ ఆల్కహాల్‌ను ఎంకరేజ్‌ చెయ్యడు. తన మిత్రుల్లో చాలా మంది మందు, సిగరెట్లు అలవాట్లు ఉన్నవారే. కానీ శ్రీశంకర్‌ పార్టీలిచ్చినా.. ఏ పార్టీలకు వెళ్లినా అక్కడ నో ఆల్కాహాల్‌.. నో సిగరెట్‌. ఎందుకంటే శ్రీశంకర్‌కు మేమిచ్చే గౌరవమని అతని స్నేహితులు పేర్కొంటారు.

''శంకు(మురళీ శ్రీశంకర్‌ ముద్దుపేరు) నా కొడుకుగా పుట్టడం అదృష్టంగా భావిస్తున్నాం. ఎంత పెద్ద స్థాయికి చేరుకున్నా వాడు చూపించే ప్రేమ, గౌరవం ఎప్పుడు తగ్గిపోలేదు. స్కూల్‌ వయసు నుంచి వాడిని ఒక మంచి అథ్లెట్‌గా చూడాలని కఠిన నిబంధనల మధ్య పెంచినా.. ఒక్కసారి కూడా మాకు ఎదురుచెప్పడం చూడలేదు. అందుకే ఈరోజు దేశం గర్వించే స్థాయికి చేరుకున్నాడు'' 
- తల్లి కెస్‌ బిజ్మోల్‌

''వాడు(శ్రీశంకర్‌) కష్టపడే తత్వాన్ని ఎప్పుడు వదల్లేదు. ఏనాడు షార్ట్‌కట్స్‌, అడ్డదారులు తొక్కలేదు. చిన్నప్పటి నుంచి కష్టపడిన తత్వమే ఈరోజు ఈస్థాయిలో నిలబెట్టింది. ఒక తండ్రిగా నాకు ఇంతకమించి ఏముంటుంది. నా మాటకు ఎదురుచెప్పకుండా ఎన్నో చేశాడు.. అలాంటి వాడి కోసం నేను చేసిన త్యాగాలు చాలా చిన్నవి. వాడు నా కొడుకుగా పుట్టడం నాకు గర్వకారణం'
- తండ్రి ఎకోస్‌ బిజ్మోల్‌

చదవండి: Commonwealth Games 2022: మురళీ శ్రీశంకర్‌ కొత్త చరిత్ర.. లాంగ్‌జంప్‌లో భారత్‌కు రజతం

వారం కిత్రం పేరు లేదు.. కుక్కలతో హై జంప్‌ ప్రాక్టీస్‌; కట్‌చేస్తే 

మరిన్ని వార్తలు