-

Shane Warne Demise:'ఇప్పటికీ షాక్‌లోనే.. జీవితం మనం ఊహించినట్లు ఉండదు'

5 Mar, 2022 12:18 IST|Sakshi

ఆస్ట్రేలియా లెజెండరీ స్పిన్‌ దిగ్గజం షేన్‌ వార్న్‌ హఠాన్మరణం క్రీడాలోకాన్ని దిగ్బ్రాంతికి గురి చేసింది. వార్న్‌ మరణాన్ని తోటి క్రికెటర్లు సహా అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 52 ఏళ్ల వయసులోనే అర్థంతరంగా తనువు చాలించిన దిగ్గజానికి క్రీడాలోకం అశ్రు నివాళి అర్పిస్తోంది. టీమిండియా క్రికెటర్లు సైతం వార్న్‌కు నివాళి అర్పిస్తూ అతనితో ఉంద అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్‌ అయ్యారు. తాజాగా శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టు రెండో రోజు ఆట ప్రారంభానికి ముందు బీసీసీఐ నిర్వహించిన ప్రత్యేక సెషన్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ సహా మిగతా క్రికెటర్లు వార్న్‌కు నివాళి ప్రకటించారు.

ఈ సందర్భంగా టీమిండియా మెషిన్‌గన్‌ విరాట్‌ కోహ్లి వార్న్‌ను తలచుకుంటూ కాస్త ఎమోషనల్‌ అయ్యాడు. '' నిన్న రాత్రి దిగ్గజ స్పిన్నర్‌ షేన్‌ వార్న్‌ దూరమయ్యాడన్న వార్త తెలిసింది. వార్న్‌ చనిపోయాడన్న వార్త మొదట నేను నమ్మలేదు. అతను చనిపోవడం ఏంటని అనుకున్నా. కానీ అది నిజమని తెలిసిన తర్వాత దుఃఖం ఆపుకోలేకపోయా. నిజంగా జీవితం మనం ఊహించినట్లు ఉండదు. ఈ క్షణంలో బాగానే ఉన్నామనిపిస్తుంది.. కానీ మరుక్షణంలో ఏం జరగబోయేది ఎవరు చెప్పలేరు. జీవితం అనూహ్యమైంది.. కానీ ఊహించలేనిది.

వార్న్‌ తన 15  ఏళ్ల క్రికెట్‌ జీవితంలో చాలానే చూశాడు. క్రికెట్‌ బంతిని అతనికంటే గొప్పగా ఎవరూ టర్న్‌ చేయలేరు. క్రికెట్‌ తర్వాత కూడా జీవితంలో చాలా చూస్తాడు అనుకున్నా.. కానీ 52 ఏళ్లకే ఇలా భౌతికంగా దూరమవుతాడని అనుకోలేదు. వార్న్‌తో కలిసి ఆడే అదృష్టం మాకు లేకపోయినప్పటికి.. మాకు బూస్టప్‌ కావాలంటే ఇప్పటికి వార్న్‌ బౌలింగ్‌ వీడియోలను పెట్టుకొని చూస్తుంటా. ఆ పర్సనాలిటి.. చరిష్మా కనబడదు అంటే జీర్ణించుకోలేకపోతున్నా. అతనికి ఇదే నా ప్రగాడ సానుభూతి'' అంటూ ముగించాడు. 

ఇక టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ''వార్న్‌ గురించి తెలుసుకోవడం నేను అదృష్టంగా భావిస్తా. నా దృష్టిలో అతను ఎవర్‌గ్రీన్‌ స్పిన్నర్‌.. అతనితో కలిసి ఆడకపోవడం నేను చేసుకున్న దురదృష్టం. ఇంత తొందరగా మమ్మల్ని వదిలివెళతాడని ఊహించలేదు. ఎ గ్రేట్‌ ట్రిబ్యూట్‌ టూ షేన్‌ వార్న్‌.  ఈ సందర్భంగా వార్న్‌ కుటుంబసభ్యులకు నా ప్రగాడ సానుభూతి ప్రకటిస్తునా. అలాగే వార్న్‌ ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా''అంటూ ముగించాడు. బీసీసీఐ వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేసింది.

చదవండి: Shane Warne-Sachin: 'చిన్న వయసులోనే వెళ్లిపోయావా మిత్రమా'.. సచిన్‌ భావోద్వేగం

Shane Warne: ఉదయమే ట్వీట్‌.. సాయంత్రానికి మరణం; ఊహించని క్షణం

మరిన్ని వార్తలు