Lionel Messi: అర్జెంటీనా స్టార్‌ మెస్సీ కొత్త చరిత్ర.. 61 వ స్థానంలో కోహ్లి

12 May, 2022 11:35 IST|Sakshi

అర్జెంటీనా స్టార్‌ ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీ అరుదైన ఘనత సాధించాడు. 2022 ఏడాదిలో అత్యధిక పారితోషికం తీసుకున్న అథ్లెట్‌గా మెస్సీ చరిత్ర సృష్టించాడు. బుధవారం ప్రకటించిన ఫోర్బ్స్‌ అథ్లెట్‌ జాబితాలో మెస్సీ తొలిస్థానంలో ఉండగా.. దిగ్గజ ఎన్‌బీఏ ఆటగాడు లెబ్రన్‌ జేమ్స్‌ రెండు, పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ రొనాల్డో మూడో స్థానంలో ఉన్నాడు.

మే 1, 2022 ముగిసేనాటికి మెస్సీ 131 మిలియన్‌ డాలర్ల పారితోషికం అందుకున్నాడు. ఇందులో 55 మిలియన్‌ డాలర్లు ఎండార్స్‌మెంట్‌ రూపంలో సంపాదించాడు. ఇక రెండో స్థానంలో ఉన్న ఎన్‌బీఏ ఆటగాడు లెబ్రన్‌ జేమ్స్‌ 121 మిలియన​ డాలర్ల పారితోషికం తీసుకోగా.. తర్వాత వరుసగా పోర్చుగల్‌ కెప్టెన్‌ రొనాల్డో(115 మిలియన్‌ డాలర్లు), బ్రెజిల్‌ స్టార్‌ ఫుట్‌బాలర్‌ నెయ్‌మర్‌(95 మిలియన్‌ డాలర్లు), మూడుసార్లు ఎన్‌బీఏ చాంపియన్‌ స్టీఫెన్‌ కర్రీ(92.8 మిలియన్‌ డాలర్లు)తో మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు.

ఎన్‌బీఏ ఆటగాడు కెవిన్‌ డురంట్‌(92 మిలియన్‌ డాలర్లు) ఆరో స్థానంలో ఉండగా.. స్విస్‌ టెన్నిస్‌ దిగ్గజం రోజర్‌ ఫెదరర్‌(90.7 మిలియన్‌ డాలర్లు) ఏడో స్థానంలో ఉన్నాడు. ఇక చివరి మూడు స్థానాల్లో మెక్సికన్‌ బాక్సర్‌ కానెలో అల్వరెజ్‌(90 మిలియన్‌ డార్లు), ఏడుసార్లు సూపర​ బౌల్‌ చాంపియన్‌ టామ్‌ బ్రాడీ(83.9 మిలియన్‌ డాలర్లు), ఎన్‌బీఏ చాంపియన్‌ గియనిస్‌ (80.9 మిలియన్‌ డాలర్లు) ఉన్నారు.

ఇక ఈ జాబితాలో టీమిండియా నుంచి విరాట్‌ కోహ్లి 33.9 మిలియన్‌ డాలర్లతో(31 మిలియన్‌ డాలర్లు ఎండార్స్‌మెంట్‌ రూపంలో) 61వ స్థానంలో ఉన్నాడు. కోహ్లి తప్ప మరే భారతీయ ఆటగాడు టాప్‌-100లో చోటు దక్కించుకోలేకపోయారు. ఇక ఈ ఫోర్బ్స్‌ జాబితాను ప్రతీ ఏడాది ప్రకటించడం ఆనవాయితీ. ఆటగాళ్ల వార్షిక సంపాదన, ఎండార్స్‌మెంట్‌, బోనస్‌, స్పాన్సర్‌షిప్‌ డీల్స్‌, లైసెన్స్‌ ఇన్‌కమ్‌ ద్వారా వివరాలను వెల్లడిస్తుంటారు.

చదవండి: MS Dhoni: సినీరంగ ప్రవేశం చేయనున్న టీమిండియా మాజీ కెప్టెన్‌

మరిన్ని వార్తలు