Cristiano Ronaldo: రొనాల్డో అరుదైన రికార్డు బద్దలు కొట్టిన మెస్సీ.. ఇక చాలు!

2 Feb, 2023 15:49 IST|Sakshi
లియోనల్‌ మెస్సీ- క్రిస్టియానో రొనాల్డో

Lionel Messi- Cristiano Ronaldo: క్రిస్టియానో రొనాల్డో- లియోనల్‌ మెస్సీ.. ఈ ఇద్దరు ఫుట్‌బాల్‌ దిగ్గజాల మధ్య రికార్డుల పోటీ నువ్వా- నేనా అన్నట్లుగా ఉంటుందన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దశాబ్దకాలంగా సాకర్‌ ప్రపంచంలో తమదైన ముద్ర వేస్తున్న ఈ ఇద్దరు లెజెండ్స్‌లో.. మెస్సీ ఫిఫా ప్రపంచకప్‌-2022 ట్రోఫీని ముద్దాడి ఓ మెట్టు పైన నిలిచాడు.

మరోవైపు.. పోర్చుగల్‌ స్టార్‌ రొనాల్టోకు మాత్రం వరల్డ్‌కప్‌ టైటిల్‌ అందని ద్రాక్షగా మిగిలిపోయింది. ఖతర్‌ టోర్నీలో అర్జెంటీనా సూపర్‌స్టార్‌ మెస్సీ అద్భుతాలు చేయగా.. రొనాల్డో మాత్రం అవమానకర రీతిలో ఈవెంట్‌ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి తలెత్తిన విషయం తెలిసిందే.

రొనాల్డో రికార్డు బద్దలు
ఈ క్రమంలో రొనాల్డోకు సాధ్యం కాని పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్న లియోనల్‌ మెస్సీ.. ఈ పోర్చుగల్‌ స్టార్‌ పేరిట ఉన్న మరో రికార్డును బద్దలు కొట్టాడు. టాప్‌-5 యూరోపియన్‌ లీగ్‌లలో అత్యధిక గోల్స్‌ చేసిన ఆటగాడిగా నిలిచాడు. మొత్తంగా 697 గోల్స్‌తో రొనాల్డోను అధిగమించాడు మెస్సీ.

ఫ్రెంచ్‌ లీగ్‌లో భాగంగా పారిస్‌ సెయింట్‌ జర్మనీ(పీఎస్‌జీ), మాంట్‌పిల్లర్‌ మ్యాచ్‌ సందర్భంగా మెస్సీ ఈ ఫీట్‌ నమోదు చేశాడు. పీఎస్‌జీకి ప్రాతినిథ్యం వహించిన ఈ అర్జెంటీనా లెజెండ్‌.. ఈ మ్యాచ్‌లో గోల్‌ ద్వారా రొనాల్డోను వెనక్కినెట్టాడు. క్లబ్‌ కెరీర్‌లో మొత్తంగా 697 గోల్స్‌ చేసి టాప్‌లో నిలిచాడు.  ఇక ఇందులో ఈ సీజన్‌లో పీఎస్‌జీ తరఫున చేసిన గోల్స్‌ 13.

మరోవైపు.. రొనాల్డో ఇప్పటి వరకు రియల్‌ మాడ్రిడ్‌ తరఫున 450, మాంచెస్టర్‌ యునైటెడ్‌ తరఫున 145, జువెంటస్‌ తరఫున 101 గోల్స్‌తో కలిపి మొత్తంగా 696 గోల్స్‌ సాధించాడు. ఇదిలా ఉంటే.. మాంట్‌పిల్లర్‌తో మ్యాచ్‌కు ముందు మెస్సీ మాట్లాడుతూ తన రిటైర్మెంట్‌పై సంకేతాలు ఇచ్చాడు. 

కోరుకున్నవన్నీ దక్కాయి.. ఇకపై
‘‘జాతీయ జట్టు తరఫున నేనైతే సాధించాలని అనుకున్నానో ఆ కల నెరవేరింది. వ్యక్తిగతంగా.. వృత్తిగతంగా నేను కోరుకున్నవన్నీ నాకు లభించాయి. శిఖరాగ్రంలో ఉన్నపుడే కెరీర్‌ను ముగించడమే మిగిలి ఉంది. నేను ఫుట్‌బాల్‌ ఆడటం మొదలుపెట్టినపుడు ఇక్కడి దాకా వస్తానని అస్సలు ఊహించలేదు.

కెరీర్‌లో అత్యుత్తమ స్థాయికి చేరుకున్నాను. ప్రస్తుతం నా జీవితంలో ఎలాంటి అసంతృప్తి లేదు. మేము 2021లో కోపా అమెరికా, 2022లో వరల్డ్‌కప్‌ గెలిచాము. ఇంతకంటే సాధించాల్సిందేమీ లేదు’’అని మెస్సీ అర్బన్‌ప్లేతో వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే రొనాల్డో ప్రస్తుతం సౌదీ అరేబియా ఫుట్‌బాల్‌ క్లబ్‌ అల్‌ నసర్‌ మ్యాచ్‌లతో బిజీగా ఉన్నాడు.

చదవండి: Shubman Gill Century: అప్పుడు 7, 11.. ఇప్పుడేమో ఏకంగా 126.. ప్రతి మ్యాచ్‌కు సచిన్‌ రావాల్సిందే!
IND vs NZ: 'తీవ్రంగా నిరాశపరిచాడు.. స్పిన్నర్లను ఎదుర్కోవడం నేర్చుకోవాలి’

మరిన్ని వార్తలు