Lionel Messi: పది రోజులైనా కిక్కు దిగలేదు.. చుట్టుముట్టేశారు

29 Dec, 2022 15:04 IST|Sakshi

ఖతర్‌ వేదికగా ఫిపా వరల్డ్‌కప్‌ ముగిసి దాదాపు పది రోజులు కావొస్తోంది. డిసెంబర్‌ 18న జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్‌లో 4-2 తేడాతో నెగ్గి విశ్వవిజేతగా నిలిచింది. అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లియోనల్‌ మెస్సీ తన 17 ఏళ్ల కలను నెరవేర్చుకోవడంతో పాటు ముచ్చటగా మూడోసారి ఫిఫా టైటిల్‌ను అందించాడు. ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌ మెస్సీకి చివరిదని అంతా భావించారు. అయితే అర్జెంటీనా విజేతగా నిలిచిన తర్వాత మనుసు మార్చుకున్న మెస్సీ కొంతకాలం కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. 

అయితే అర్జెంటీనా మూడోసారి ఫిఫా వరల్డ్‌కప్‌ నెగ్గడంతో ఆ దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి. మెస్సీ సేనకు ఘనస్వాగతం లభించింది. ఒపెన్‌ టాప్‌ బస్సులో రాజధాని బ్రూనస్‌ ఎయిర్స్‌ వీధుల్లో తిరగాలని ప్రయత్నించినప్పటికి ఇసుక వేస్తే రాలనంత జనం రావడంతో ఆటగాళ్లను ప్రత్యేక హెలికాప్టర్‌లో తమ స్వస్థలాలకు తరలించారు. మారడోనా లిగసీని కంటిన్యూ చేస్తూ మళ్లీ 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనాకు కప్‌ అందించిన మెస్సీ హీరోగా మారిపోయాడు.   

అయితే పది రోజులయినా అతనిపై మోజు తగ్గలేదునుకుంటా అభిమానులకు. తాజాగా మెస్సీ తన కోడలు 15వ పుట్టినరోజు వేడుకలకని తన హోమ్‌టౌన్‌ నుంచి బయలుదేరాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న అభిమానులు మెస్సీని చుట్టుముట్టారు. దాదాపు అరగంట పాటు మెస్సీ కారును చుట్టుముట్టిన అభిమానులు అతనితో ఫోటోలు దిగేందుకు ప్రయత్నించారు. అయితే మెస్సీ కూడా వారితో దురుసుగా ప్రవర్తించకుండా కూల్‌గా సర్దిచెప్పి అక్కడినుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇక మెస్సీ పారిస్‌ సెయింట్‌ జెర్మెన్‌ క్లబ్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే వచ్చే వారం పీఎస్‌జీ క్లబ్‌లో మెస్సీ జాయిన్‌ అయ్యే అవకాశం ఉందని పీఎస్‌జీ హెడ్‌కోచ్‌ క్రిస్టోప్‌ గాల్టియర్‌ పేర్కొన్నాడు. ఫిపా వరల్డ్‌కప్‌ ఫైనల్‌ సందర్భంగా అర్జెంటీనాకు వణికించిన ఫ్రాన్స్‌ స్టార్‌ కైలియన్‌ ఎంబాపె సహా బ్రెజిల్‌ స్టార్‌ నెయ్‌మర్‌ కూడా పీఎస్‌జీలో ఉన్నారు.

చదవండి: ధోని కూతురుకు మెస్సీ అరుదైన కానుక

మరిన్ని వార్తలు