Lionel Messi FIFA Winning Photo: తగ్గేదేలే.. మరో ‘ప్రపంచ రికార్డు’ బద్దలు కొట్టిన మెస్సీ!

21 Dec, 2022 13:51 IST|Sakshi
ప్రపంచకప్‌ ట్రోఫీని ముద్దాడుతున్న మెస్సీ (PC: Lionel Messi Instagram)

FIFA World Cup 2022- Lionel Messi: ఒక్క అడుగు.. ఆ ఒకే ఒక్క అడుగు పడితే.. ఆ క్రీడాకారుడి జీవితం పరిపూర్ణమైనట్లే! ‍తన కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరినట్లే! దేశాలకు అతీతంగా ప్రపంచమంతా అతడి గెలుపును కాంక్షించింది.. అందరి ఆశలు ఫలించాయి.. ఎట్టకేలకు ఫైనల్లో తమ జట్టును విజేతగా నిలిపి అతడు ప్రపంచకప్‌ ట్రోఫీని ముద్దాడాడు! 

ఈ అపురూప దృశ్యాలను ఇన్‌స్టాలో పంచుకుంటూ భావోద్వేగానికి గురయ్యాడు. ‘‘ఎన్నో ఏళ్లుగా నేను కంటున్న కల నెరవేరింది.. ఈ గెలుపు కోసం నేనెంతగానో తపించి పోయాను.. ఇప్పటికీ దీనిని నేను నమ్మలేకపోతున్నాను.. ఈ ప్రయాణంలో నాకు మద్దతుగా నిలిచిన నా కుటుంబం, ప్రతి ఒక్క అభిమానికి పేరుపేరునా ధన్యవాదాలు. 

నేను ఇది సాధించగలనని నమ్మిన వాళ్లకు థాంక్స్‌. అర్జెంటీనా వాళ్లు ఐక్యంగా ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ ఉండదని మరోసారి నిరూపితమైంది. జట్టు సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యమైంది. అర్జెంటీనా కల ఇలా నెరవేరింది’’ అని ఉద్వేగపూరిత నోట్‌ రాశాడు. కోట్లాది మంది ఈ పోస్టును లైక్‌ చేశారు. ఇప్పటి వరకు 68.8 మిలియన్లకు పైగా లైకులు కొట్టారు. 1.8 మిలియన్లకు పైగా కామెంట్లు వచ్చాయి. ఇంకా ఈ సంఖ్య పెరుగుతూనే ఉంది.

ది ఎగ్‌ రికార్డు బద్దలు
ఈ క్రమంలో అతడి ఖాతాలో మరో అరుదైన రికార్డు నమోదైంది. ‘ది ఎగ్‌’ పేరిట ఉన్న ఉన్న రికార్డును బద్దలు కొడుతూ.. అతడు చేసిన పోస్టు ఇన్‌స్టాగ్రామ్‌లో అత్యధిక లైకులు పొందిన పోస్ట్‌గా నిలిచింది. 

అవును.. ఫుట్‌బాల్‌ స్టార్‌, రికార్డుల రారాజు లియోనల్‌ మెస్సీనే ఈ అరుదైన ఫీట్‌ నమోదు చేశాడు. 2019 జనవరి 4న పోస్ట్‌ చేసిన ‘ది ఎగ్‌’కు ఇన్‌స్టాలో  ఇప్పటి వరకు 56 మిలియన్‌ లైకులు రాగా.. మెస్సీ ఆ రికార్డును బ్రేక్‌ చేశాడు. దీంతో మరోసారి అతడి పేరు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది.

మెస్సీ మాయ.. ప్రపంచమంతా సంబరం
ఫిఫా ప్రపంచకప్‌- 2022ను మెస్సీ వరల్డ్‌కప్‌గా భావించిన తరుణంలో ఫ్రాన్స్‌తో ఆఖరి పోరులో అతడు మరోసారి తన మ్యాజిక్‌తో మెరిసిన విషయం తెలిసిందే. ఫుట్‌బాల్‌ దిగ్గజం డిగో మారడోనా వారసత్వాన్ని కొనసాగిస్తూ.. అర్జెంటీనాకు మూడో వరల్డ్‌కప్‌ను అందించాడు.

ఈ ఈవెంట్‌లో మొత్తంగా ఏడు గోల్స్‌తో పాటు మూడు అసిస్ట్‌లు చేసిన మెస్సీ గోల్డెన్‌ బాల్‌ అవార్డును అందుకున్నాడు. ఈ నేపథ్యంలో ప్రపంచమంతా మెస్సీ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకుంది. ఇక అతడి స్వదేశం అర్జెంటీనాలో సంబరాలు అంబరాన్నంటాయి. సెలబ్రేషన్స్‌ కొనసాగుతూనే ఉన్నాయి. 

చదవండి: Ajinkya Rahane: డబుల్‌ సెంచరీతో చెలరేగిన రహానే.. రెండో ద్విశతకం! టీమిండియాలో చోటు ఖాయమంటూ..
 Lionel Messi: వరల్డ్‌కప్‌ కొట్టిన ఒక్కరోజు వ్యవధిలో మరో అరుదైన ఘనత

A post shared by Leo Messi (@leomessi)

మరిన్ని వార్తలు