Copa America 2021: 28 ఏళ్ల తర్వాత ఛాంపియన్‌గా అర్జెంటీనా

11 Jul, 2021 09:05 IST|Sakshi

అద్భుతమైన జట్టుగా పేరు.. అయితేనేం!. ప్రతిష్టాత్మకంగా భావించే ట్రోఫీని ఎత్తడానికి 28 ఏళ్లు ఎదురుచూసింది అర్జెంటీనా టీం. చివరకు మారడోనా లాంటి దిగ్గజానికి సైతం కలగా మిగిలిపోయిన టోర్నీ అది. అలాంటిది ఉత్కంఠభరింతగా జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ బ్రెజిల్‌ను ఓడించింది అర్జెంటీనా. తద్వారా కోపా అమెరికా 2021 టోర్నీ కైవసం చేసుకుని టైటిల్‌ ఛాంపియన్‌గా నిలిచింది. 

దక్షిణ అమెరికా ఖండంలోని దేశాల మధ్య జరిగే కోపా అమెరికా టోర్నీ 2021 సీజన్‌లో మొత్తం పది దేశాలు పాల్గొన్నాయి. వీటిలో బ్రెజిల్‌..అర్జెంటీనాలు ఫైనల్‌కు చేరుకున్నాయి. భారత కాలమానం ప్రకారం.. ఆదివారం వేకువ జామున రియో డీ జనెయిరోలోని మారాకానా స్టేడియంలో ఈ రెండు జట్లు తలపడ్డాయి. ఆట ఇరవై రెండో నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు Ángel Di María చేసిన గోల్‌ మ్యాచ్‌కు కీలకంగా మారింది. ఇక బ్రెజిల్‌కు గోల్‌ చేసే అవకాశం ఇవ్వకుండా కట్టడి చేయగలిగారు అర్జెంటీనా ఆటగాళ్లు. దీంతో లియోనెల్‌ మెస్సీ కెప్టెన్సీలోని అర్జెంటీనా టీం 15వ కోపా అమెరికా ట్రోఫీని ఎత్తి సంబురాలు చేసుకుంది.

మెస్సీ-నెయ్మర్‌.. ఇద్దరూ కన్నీళ్లే
ఓవైపు ఓటమి భారంతో బ్రెజిల్‌ స్టార్‌ ప్లేయర్‌ నెయ్‌మర్‌ దా సిల్వ శాంటోస్‌ శోకంతో ఏడుస్తుంటే.. మరోవైపు తన నేతృత్వంలో అర్జెంటీనా తొలి కప్పు సాధించడంతో Lionel Messi భావోద్వేగానికి లోనై కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని ఓదార్చుకున్నారు.

తన ప్రొఫెషనల్‌ క్లబ్‌ కెరీర్‌లో 34 టైటిల్స్‌ నెగ్గిన మెస్సీ.. అర్జెంటీనా తరఫున మాత్రం ఇప్పటి వరకు ఒక్క మేజర్‌ టైటిల్‌ గెలవలేకపోయాడు. తాజా విక్టరీతో అతనికి ఆ లోటు తీరినట్లయ్యింది. ఆట ముగిశాక.. బ్రెజిల్‌-అర్జెంటీనా ఆటగాళ్లు మైదానంలో కూర్చుని సరదాగా గడపడం ఆకట్టుకుంది.

ఇక ఇంతకుముందు అర్జెంటీనా 1993లో కోపా అమెరికా కప్‌ చాంపియన్‌గా నిలిచింది. 2004, 2007, 2015, 2016ల్లో రన్నరప్‌ ట్రోఫీతో సరిపెట్టుకుంది. విశేషం ఏంటంటే.. పీలే బ్రెజిల్‌ కెప్టెన్‌గా ఉన్న టైంలోనూ బ్రెజిల్‌ కోపాను గెల్చుకోలేకపోయింది.

మరిన్ని వార్తలు