Lionel Messi: మెస్సీ 'నల్లకోటు' వెనక్కి ఇవ్వాలంటూ రూ. 8.2 కోట్ల ఆఫర్‌

25 Dec, 2022 16:16 IST|Sakshi

ఖతర్‌ వేదికగా ముగిసిన ఫిఫా వరల్డ్‌కప్‌ను అర్జెంటీనా నెగ్గిన సంగతి తెలిసిందే. జట్టును అన్నీ తానై నడిపించిన మెస్సీ ట్రోఫీ గెలవడంతో పాటు తన 17 ఏళ్ల కలను కూడా నెరవేర్చుకున్నాడు. ఈసారి ఫిఫా వరల్డ్‌కప్‌లో మెస్సీ ఏడు గోల్స్‌ చేయడమే గాక బెస్ట్‌ ఫుట్‌బాలర్‌గా గోల్డెన్‌ బాల్‌ అవార్డు కూడా అందుకున్నాడు. ఇక ఫిఫా టైటిల్‌ అందుకునే క్రమంలో మెస్సీ ఒక నల్లకోటు ధరించి వచ్చాడు. ఆ నల్లకోటును అరబ్‌ దేశాల్లో 'బిష్త్‌' అని పిలుస్తారు. ఎవరైనా గొప్ప పని సాధిస్తే కృతజ్ఞతగా వారిని గౌరవిస్తూ బిస్ట్‌ను అందిస్తారు. 

ఈ నేపథ్యంలోనే మెస్సీ ధరించిన బిష్త్‌(నల్లకోటు)ను ఖతర్‌ రాజు షేక్ త‌మిమ్ బిన్ హ‌మ‌ద్ అల్ థానీ అందించారు. ట్రోఫీ అందుకోవడానికి ముందు  మెస్సీకి ఆ న‌ల్ల‌ని కోటు తొడిగారు. ఆ నల్లని కోటు ధ‌ర అక్షరాలా 10 ల‌క్ష‌ల డాల‌ర్లు. మరి అంత విలువైన కోటును మెస్సీ బహుకరించింది మాత్రం ఒమ‌న్‌కు చెందిన అహ్మ‌ద్ అల్ బ‌ర్వానీ అనే పార్ల‌మెంట్ స‌భ్యుడు.

తాజాగా మెస్సీ ధరించిన బిస్ట్‌ వెనక్కి ఇవ్వాలంటూ మరొక ట్వీట్‌ చేశాడు అహ్మద్‌ అల్‌ బర్వానీ. ఆ ట్వీట్‌లో ఏముందంటే.. ''ఖ‌త‌ర్ సుల్తాన్ త‌ర‌ఫున వ‌ర‌ల్డ్ క‌ప్ ట్రోఫీ నెగ్గినందుకు నేను శుభాకాంక్ష‌లు తెలుపుతున్నా. బంగారం, నలుపు రంగులో ఉన్న అర‌బిక్ బిష్త్ శౌర్యానికి, తెలివితేట‌ల‌కు ప్ర‌తీక‌. అయితే మెస్సీ ఇప్పుడు దానిని తిరిగి ఇస్తే అతనికి నేను మిలియన్‌ డాలర్‌(రూ. 8.2 కోట్లు) ఆఫర్‌గా ఇస్తాను. ఎందుకంటే బిష్త్‌ అనేది మా సంప్రదాయానికి ప్రతీక. మెస్సీ సాధించిన గొప్పతనానికి గుర్తుగా ఆ బిష్త్‌ను తొడిగాం. మా దేశంలో ఉంటేనే ఆ బిష్త్‌కు గౌరవం ఉంటుంది. అందుకే మెస్సీ బిష్త్‌ తిరిగి ఇచ్చేయాలనే ఈ ఆఫర్‌ ఇస్తున్నా అంటూ తెలిపాడు.

మొత్తానికి లియోనల్‌ మెస్సీ ఫిఫా వరల్డ్‌కప్‌ అందుకోవడం ఏమోగానీ ఎటునుంచి చూసినా అతనికి డబ్బులు కుప్పలుతెప్పలుగా వచ్చి పడుతున్నాయి. నిజంగా మెస్సీ అదృష్టవంతుడు.  ఇప్పుడు తాను ధరించిన బిష్త్‌(నల్లకోటు)కు కూడా అంత ధర ఆఫర్‌ చేయడం మాములు విషయం కాదనే చెప్పొచ్చు.

చదవండి: మెస్సీ ధరించిన నల్లకోటు ధర ఎంతంటే?

మరిన్ని వార్తలు