Lionel Messi: తగిన గౌరవం.. రూమ్‌నే మ్యూజియంగా

29 Dec, 2022 21:50 IST|Sakshi

ఫిఫా వరల్డ్‌కప్‌ కోసం ఖతార్‌లో మెస్సీ బస చేసిన హోటల్‌ రూమ్‌ను ఓ మ్యూజియంగా మార్చాలని ఖతార్‌ యూనివర్సిటీ నిర్ణయించడం ఆసక్తి రేపింది. దోహాలో మెస్సీతోపాటు అర్జెంటీనా స్ట్రైకర్‌ సెర్గియో ఆగెరో ఒకే హోటల్ రూమ్‌లో ఉన్నారు.  మెస్సీ గౌరవానికి సూచకంగా ఇక నుంచి ఆ రూమ్‌ను ఎవరికీ ఇవ్వకూడదని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అందులో మెస్సీకి సంబంధించిన వస్తువులతో ఓ చిన్న మ్యూజియాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఒక న్యూస్‌ ఏజెన్సీకి వెల్లడించారు. ఈ మ్యూజియాన్ని విద్యార్థులు, టూరిస్టులు సందర్శించే అవకాశం కల్పించారు.

"అర్జెంటీనా టీమ్‌ ప్లేయర్‌ లియోనెల్‌ మెస్సీ బస చేసిన హోటల్‌ రూమ్‌ను అలాగే ఉంచుతాం. ఈ రూమ్‌కు కేవలం సందర్శకులకు మాత్రమే అవకాశం కల్పిస్తాం. ఆ హోటల్‌ రూమ్‌ ఇక భవిష్యత్తులో మరెవరికీ కేటాయించం. మెస్సీకి చెందిన వస్తువులు విద్యార్థులు, భవిష్యత్తు తరాలకు ఓ పాఠంగా నిలుస్తాయి. అతడు వరల్డ్‌కప్‌ సందర్భంగా సాధించిన ఘనతలేంటో వారికి తెలుస్తాయి" అని ఖతార్‌ యూనివర్సిటీ డైరెక్టర్‌ హిత్మి అల్‌ హిత్మి చెప్పారు.

ఖతర్‌ వేదికగా జరిగిన ఫిపా వరల్డ్‌కప్‌ ముగిసి దాదాపు పది రోజులు కావొస్తోంది. డిసెంబర్‌ 18న జరిగిన ఫైనల్లో ఫ్రాన్స్‌పై అర్జెంటీనా పెనాల్టీ షూటౌట్‌లో 4-2 తేడాతో నెగ్గి విశ్వవిజేతగా నిలిచింది. అర్జెంటీనా సూపర్‌స్టార్‌ లియోనల్‌ మెస్సీ తన 17 ఏళ్ల కలను నెరవేర్చుకోవడంతో పాటు ముచ్చటగా మూడోసారి ఫిఫా టైటిల్‌ను అందించాడు. ఫిఫా ప్రపంచకప్‌ ఫైనల్‌ మెస్సీకి చివరిదని అంతా భావించారు. అయితే అర్జెంటీనా విజేతగా నిలిచిన తర్వాత మనుసు మార్చుకున్న మెస్సీ కొంతకాలం కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. 

అయితే అర్జెంటీనా మూడోసారి ఫిఫా వరల్డ్‌కప్‌ నెగ్గడంతో ఆ దేశంలో సంబరాలు అంబరాన్నంటాయి. మెస్సీ సేనకు ఘనస్వాగతం లభించింది. ఒపెన్‌ టాప్‌ బస్సులో రాజధాని బ్రూనస్‌ ఎయిర్స్‌ వీధుల్లో తిరగాలని ప్రయత్నించినప్పటికి ఇసుక వేస్తే రాలనంత జనం రావడంతో ఆటగాళ్లను ప్రత్యేక హెలికాప్టర్‌లో తమ స్వస్థలాలకు తరలించారు. మారడోనా లిగసీని కంటిన్యూ చేస్తూ మళ్లీ 36 ఏళ్ల తర్వాత అర్జెంటీనాకు కప్‌ అందించిన మెస్సీ హీరోగా మారిపోయాడు.   

చదవండి: పది రోజులైనా కిక్కు దిగలేదు.. చుట్టుముట్టేశారు

మరిన్ని వార్తలు