మెస్సీపై ముగిసిన ఒక్క మ్యాచ్‌ నిషేధం

12 Sep, 2020 08:12 IST|Sakshi

అర్జెటీనా తరపున బరిలోకి

బ్యూనస్‌ ఎయిర్స్‌: ప్రఖ్యాత ఫుట్‌బాలర్‌ లియోనల్‌ మెస్సీపై అంతర్జాతీయ మ్యాచ్‌ నిషేధం ముగిసింది. దీంతో అతను వచ్చే నెలలో జరగనున్న వరల్డ్‌ కప్‌ క్వాలిఫయర్స్‌లో జాతీయ జట్టు అర్జెంటీనా తరఫున ఆడనున్నాడు. ఈ విషయాన్ని అర్జెంటీనా ఫుట్‌బాల్‌ సంఘం (ఏఎఫ్‌ఏ) అధ్యక్షుడు క్లాడియో టపియా వెల్లడించారు. గతేడాది కోపా అమెరికా కప్‌ టోర్నీలో భాగంగా మూడో స్థానం కోసం చిలీతో జరిగిన ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లో ప్రత్యర్థి జట్టు ఆటగాడు గ్యారీ మెడెల్‌తో మెస్సీ గొడవకు దిగి రెడ్‌ కార్డుకు గురయ్యాడు.

అంతే కాకుండా ఆతిథ్య దేశం బ్రెజిల్‌ను గెలిపించేలా టోర్నీని ఫిక్స్‌ చేశారంటూ నిర్వాహకులపై తీవ్ర ఆరోపణలు చేశాడు. దీంతో అతనిపై ఒక అంతర్జాతీయ మ్యాచ్‌ నిషేధం విధించారు. అయితే తాజాగా ఈ నిషేధం కాల పరిమితి చెల్లిపోవడంతో మెస్సీ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించవచ్చని దక్షిణ అమెరికా ఫుట్‌బాల్‌ కాన్ఫెడరేషన్‌ అధ్యక్షుడు అలెజాండ్రో డోమిగెజ్‌ స్పష్టం చేశారు. దీంతో బ్యూనస్‌ ఎయిర్స్‌లో అక్టోబర్‌ 8న ఈక్వెడార్‌తో జరుగనున్న వరల్డ్‌కప్‌ క్వాలిఫయర్స్‌లో అర్జెంటీనా తరఫున మెస్సీ బరిలోకి దిగనున్నాడు.
(చదవండి: మెస్సీ కావాలంటే...రూ. 6 వేల కోట్లు)

మరిన్ని వార్తలు