ఆమె బాధలో ఉంది.. బీసీసీఐ పట్టించుకోకపోవడం దారుణం

15 May, 2021 17:38 IST|Sakshi

ముంబై: టీమిండియ మహిళా క్రికెటర్‌ వేదా కృష్ణమూర్తి జీవితంలో కరోనా మహమ్మారి విషాదాన్ని నింపింది.  రెండు వారాల వ్యవధిలో తన అక్కను, తల్లిని కోల్పోయింది. మొదట కరోనాతో పోరాడుతూ ఆమె అక్క వత్సల శివకుమార్‌ కన్నుమూయగా.. రెండు వారాల తర్వాత వేదా తల్లి కూడా కరోనా మహమ్మారికి బలయ్యారు. తన జీవితంలో ఒకేసారి జరిగిన రెండు విషాదాలు ఆమెను తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేశాయి. ఈ సందర్భంగా వేదా కృష్ణమూర్తికి తన తోటి క్రికెటర్లతో పాటు.. పలువురు మాజీ మహిళా క్రికెటర్లు ఆమెకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేశారు. అందులో ఐసీసీ ఆల్ ఆఫ్‌ ఫేమ్‌ .. మాజీ ఆస్ట్రేలియా మహిళల జట్టు కెప్టెన్‌ లిసా స్టాలేకర్ కూడా ఉన్నారు. ఆమె వేదా కృష్ణమూర్తిని తన ట్విటర్‌ ద్వారా ఓదారుస్తూనే.. బీసీసీఐ తీరును విమర్శంచింది.

''వేదా తనకిష్టమైన ఇద్దరు వ్యక్తులను కోల్పోయి తీవ్ర విషాదంలో ఉంది. అయితే బీసీసీఐ మాత్రం తమకేం పట్టదన్నట్లుగా వ్యవహరించడం దారుణం. ఆమె అంత బాధలో ఉంటే కనీసం పరామర్శించకపోవడం ఆశ్చర్యపరిచింది. సరిగ్గా ఈ సమయంలోనే బీసీసీఐ ఇంగ్లండ్‌ టూర్‌కు జట్టును ఎంపికచేసింది. వేదా కృష్ణమూర్తిని జట్టులోకి తీసుకోలేదు.. ఆమె బాధలో ఉందని ఎంపికచేయకపోవడం అనుకున్నా.. ఇలా చేసి చేతులు దులుపుకోవడం సమంజసం కాదు. టీమిండియా మహిళల జట్టులో వేదా కృష్ణమూర్తిది కీలకస్థానం. ఆమె ఒక సీనియర్‌.. భారత్‌ తరపున ఎన్నో మ్యాచ్‌లు ఆడింది. తన వాళ్లను కోల్పోయి బాధలో ఉన్న ఆమెతో బీసీసీఐ ఎలాంటి కమ్యునికేషన్‌ జరపలేదు. బాధలో ఉండి ఒంటరిగా ఉన్నప్పుడే అన్ని సమస్యలు ఎదురవుతాయి.. బీసీసీఐది సరైన పద్దతి కాదు'' అంటూ విమర్శలు చేసింది.

ఇక వేదా కృష్ణమూర్తి టీమిండియా తరపున 48 వన్డేల్లో 829 పరుగులు.. 76 టీ20ల్లో 875 పరుగులు చేసింది. ఇక లిసా స్టాలేకర్‌ 2001 నుంచి 2013 వరకు ఆసీస్‌ తరపున ప్రాతినిధ్యం వహించింది.  మంచి వుమెన్‌ ఆల్‌రౌండర్‌గా పేరు పొందిన లిసా 125 వన్డేల్లో 2278 పరుగులు.. 146 వికెట్లు, 4 టెస్టుల్లో 416 పరుగులు.. 23 వికెట్లు, 54 టీ 20ల్లో 769 పరుగులు.. 60 వికెట్లు సాధించింది.
చదవండి: అమ్మా.. అక్కా.. గుండె పగిలిపోతోంది
ఆ క్రికెటర్ ఇంట్లో మరోసారి విషాదం..!

మరిన్ని వార్తలు