అవసరమా.. ఇలాంటి ప్లేయర్స్‌ మనకు!

12 Jun, 2021 12:00 IST|Sakshi

ఢాకా: బంగ్లాదేశ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకీబుల్‌ హసన్‌ శుక్రవారం అంపైర్‌పై అసహనం వ్యక్తం చేస్తూ చేసిన పనిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఢాకా ప్రీమియర్‌ లీగ్‌(డీపీఎల్‌)లో భాగంగా అంపైర్‌తో వాదనకు దిగి స్వల్ప వ్యవధిలో రెండుసార్లు అసహనంతో స్టంప్స్‌పై తన ప్రతాపాన్ని చూపించాడు. దీనిపై పలువురు మాజీ క్రికెటర్ల నుంచి విమర్శలు వస్తున్న నేపథ్యంలో షకీబ్‌ చర్యను తప్పుబడుతూ ఆసీస్‌ మాజీ మహిళ క్రికెటర్‌ లిసా స్టాలేకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ''బంగ్లాదేశ్ యువ క్రికెటర్స్ ఇలాంటివి ఫాలో అవ్వరు అనుకుంటున్నా. షకీబ్‌ ఒక సీనియర్‌ క్రికెటర్‌ అయి ఉండి సహనం కోల్పోయి ఇలాంటి పనులు చేయడం దారుణం. అవుట్‌ ఇవ్వనంత మాత్రానా అంపైర్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టంప్స్‌ను పడేయడం క్రీడాస్పూర్తికి విరుద్ధం. ఇలాంటి ప్లేయర్స్‌ మనకు అవసరమా'' అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇదిలా ఉంటే షకీబుల్‌ హసన్‌ తాను చేసిన పనిపై ట్విటర్‌ వేదికగా అభిమానులను క్షమాపణ కోరాడు. '' డియర్‌ ఫ్యాన్స్‌... నేను చేసిన పనికి సిగ్గుపడుతున్నా. నా సహనం కోల్పోయి అంపైర్‌పై దురుసుగా ప్రవర్తించాను. ఒక సీనియర్‌ ఆటగాడిగా ఇలాంటి పనులు చేయకూడదు. కానీ ఆ క్షణంలో ఏం చేస్తున్నానో అర్థమయ్యేలోపే తప్పు జరిగిపోయింది.'' అంటూ చెప్పుకొచ్చాడు.

విషయంలోకి వెళితే.. బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా మొహమ్మదాన్, అబహాని జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తాను బౌలింగ్‌ చేసిన ఐదో ఓవర్లో చివరి బంతికి ముష్ఫికర్‌ రహీమ్‌ ఎల్బీడబ్ల్యూ కోసం షకీబ్‌ అప్పీల్‌ చేయగా, అంపైర్‌ దానిని తిరస్కరించాడు. దాంతో వెనక్కి తిరిగి కాలితో స్టంప్స్‌ను తన్ని పడగొట్టిన షకీబ్‌ అంపైర్‌తో వాదనకు దిగాడు. తర్వాతి ఓవర్‌ ఐదో బంతి తర్వాత చినుకులు ప్రారంభం కావడంతో అంపైర్‌ ఆటను నిలిపేసి కవర్లు తీసుకురమ్మని సైగ చేశాడు. తన ఫీల్డింగ్‌ స్థానం నుంచి పరుగెత్తుకుంటూ వచ్చిన షకీబ్‌ మూడు స్టంప్స్‌ను కూడా ఊడబీకి కిందకు విసిరికొట్టాడు. ఆట ఆపేంత వర్షం రావడం లేదు కదా అని అసహనం ప్రదర్శించిన అతను ఆ తర్వాత కింద నుంచి స్టంప్స్‌ను తీసుకొని మళ్లీ అంపైర్‌ కాళ్ల దగ్గర పడేశాడు. షకీబ్‌ చర్యపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. మ్యాచ్‌ అనంతరం అతను ఒక ప్రకటన చేస్తూ బహిరంగ క్షమాపణ కోరాడు. అయితే మన్నింపు కోరినా సరే... అతనిపై బంగ్లాదేశ్‌ బోర్డు చర్య తీసుకునే అవకాశం ఉంది. 

ఇక ఈ మ్యాచ్‌ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్‌ చేసిన మొహమ్మదాన్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 145 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన అబహని వర్షం అంతరాయం కలిగించే సమయానికి 6 వికెట్లు కోల్పోయి 44 పరుగులు చేసింది. దీంతో డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం మొహమ్మదాన్‌ 31 పరుగులతో గెలిచినట్లు ప్రకటించారు.
చదవండి: అంపైర్‌ ఔటివ్వలేదని వికెట్లు పీకి పాడేసిన స్టార్‌ క్రికెటర్‌..

మరిన్ని వార్తలు