LLC 2023: గంభీర్‌ సేనకు పరాభవం.. అఫ్రిది దండు చేతిలో ఓటమి

19 Mar, 2023 10:11 IST|Sakshi

దోహా వేదికగా జరుగుతున్న లెజెండ్స్‌ లీగ్‌ క్రికెట్‌ 2023 సీజన్‌ ఫైనల్‌ బెర్తులు ఖరారయ్యాయి. మార్చి 20న జరిగే ఫైనల్లో వరల్డ్‌ జెయింట్స్‌ను ఢీకొట్టేందుకు ఆసియా లయన్స్‌ అర్హత సాధించింది. నిన్న (మార్చి 18) జరిగిన ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో షాహిద్‌ అఫ్రిది నేతృత్వంలోని ఆసియా లయన్స్‌.. గౌతమ్‌ గంభీర్‌ సారధ్యంలోని ఇండియా మహారాజాస్‌ను 85 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి తుది పోరుకు అర్హత సాధించింది.

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆసియా లయన్స్‌.. ఉపుల్‌ తరంగ (31 బంతుల్లో 50; 7 ఫోర్లు, సిక్స్‌), తిలకరత్నే దిల్షాన్‌ (26 బంతుల్లో 27; 2 ఫోర్లు), మహ్మద్‌ హఫీజ్‌ (24 బంతుల్లో 38; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), అస్ఘర్‌ అఫ్ఘాన్‌ (24 బంతుల్లో 34 నాటౌట్‌; ఫోర్‌, 2 సిక్సర్లు), తిసార పెరీరా (12 బంతుల్లో 24; 3 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 191 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

మహారాజాస్‌ బౌలర్లలో స్టువర్ట్‌ బిన్నీ, ప్రజ్ఞాన్‌ ఓజా తలో 2 వికెట్లు, ప్రవీణ్‌ తాంబే ఓ వికెట్‌ పడగొట్టగా.. మహ్మద్‌ కైఫ్‌ అత్యద్భుతమైన 3 క్యాచ్‌లు పట్టి మ్యాచ్‌ను రక్తి కట్టించాడు. మహారాజాస్‌ బౌలర్లు ఎక్స్‌ట్రాల రూపంలో 15 పరుగులు సమర్పించుకున్నారు.

అనంతరం ఛేదనకు దిగిన మహారాజాస్‌.. ఆసియా సింహాల బౌలర్ల ధాటికి 16.4 ఓవర్లలో 106 పరుగులకే చాపచుట్టేసి ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. మహారాజాస్‌ ఇన్నింగ్స్‌లో రాబిన్‌ ఉతప్ప (15), కెప్టెన్‌ గౌతమ్‌ గంభీర్‌ (32), మహ్మద్‌ కైఫ్‌ (14), సురేశ్‌ రైనా (18) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేయగా.. యూసఫ్‌ పఠాన్‌ (9), ఇర్ఫాన్‌ పఠాన్‌ (3), మన్విందర్‌ బిస్లా (8), స్టువర్ట్‌ బిన్నీ (0), అశోక్‌ దిండా (2), ప్రవీణ్‌ తాంబే (0) నిరాశపరిచారు.

లయన్స్‌ బౌలర్లలో సోహైల్‌ తన్వీర్‌, అబ్దుర్‌ రజాక్‌, మహ్మద్‌ హఫీజ్‌ చెరో 3 వికెట్లు పడగొట్టగా.. ఇసురు ఉడాన, షాహిద్‌ అఫ్రిది, తిలకరత్నే దిల్షాన్‌ తలో వికెట్‌ దక్కించుకున్నారు. 

మరిన్ని వార్తలు