"నాటు నాటు" స్టెప్పులేసి ఇరగదీసిన టీమిండియా మాజీలు

16 Mar, 2023 16:35 IST|Sakshi

RRR సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్‌ రావడంతో యావత్‌ ప్రపంచానికి ఈ పాట ఫోబియా పట్టుకుంది. ఎక్కడ చూసినా జనాల ఈ పాటకు స్టెప్పులేస్తూ దర్శనిమిస్తున్నారు. సోషల్‌మీడియా మాధ్యమాల్లో అయితే ఈ పాటకు ఉన్న క్రేజ్‌ వేరే లెవెల్లో ఉంది. సామాన్యుల దగ్గరి నుంచి సెలబ్రిటీల వరకు అందరూ నాటు నాటు పాటకు కాలు కదుపుతున్నారు. తాజాగా ఇద్దరు టీమిండియా మాజీలు కూడా ఈ పాటకు స్టెప్పేసి ఇరగదీశారు.

లెజెండ్‌ లీగ్‌ క్రికెట్‌-2023లో భాగంగా వరల్డ్‌ జెయింట్స్‌తో నిన్న (మార్చి 15) జరిగిన మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్‌ ఆటగాళ్లు హర్భజన్‌ సింగ్‌, సురేశ్‌ రైనా నాటు నాటు పాటకు చిందేసి అభిమానులను ఉర్రూతలూగించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. సీఎస్‌కే మాజీ క్రికెటర్లను అభిమానులు రామ్‌చరణ్‌, తారక్‌లతో పోలుస్తూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. 

మ్యాచ్‌ విషయానికొస్తే.. ఇండియా మహారాజాస్‌తో జరిగిన మ్యాచ్‌లో వరల్డ్‌ జెయింట్స్‌ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన మహారాజాస్‌.. సురేశ్‌ రైనా (41 బంతుల్లో 49; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), బిస్లా (36), ఇర్ఫాన్‌ పఠాన్‌ (25) ఓ మోస్తరుగా రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. వరల్డ్‌ జెయింట్స్‌ బౌలర్లు బ్రెట్‌ లీ (3-0-18-3), పోఫు (4-0-22-2), టీనో బెస్ట్‌ (4-0-27-2) చెలరేగారు.

అనంతరం బరిలోకి దిగిన వరల్డ్‌ జెయింట్స్‌.. క్రిస్‌ గేల్‌ (46 బంతుల్లో 57; 9 ఫోర్లు, సిక్స్‌) వీరవిహారం ధాటికి 18.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. గేల్‌కు షేన్‌ వాట్సన్‌ (26), సమిత్‌ పటేల్‌ (12) సహకరించారు. మహారాజాస్‌ బౌలర్లలో యుసఫ్‌ పఠాన్‌ (4-0-14-2), ప్రవీణ్‌ తాంబే (4-0-22-1), హర్భజన్‌ సింగ్‌ (4-0-29-1) పొదుపుగా బౌలింగ్‌ చేయడంతో పాటు వికెట్లు పడగొట్టి తమ జట్టును గెలిపించేం‍దుకు విఫలయత్నం చేశారు.

ఈ మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్‌ జట్టుకు హర్భజన్‌ సింగ్‌ నాయకత్వం వహించాడు. గంభీర గైర్హాజరీలో భజ్జీ ఈ బాధ్యతలు చేపట్టాడు. లీగ్‌లో మహారాజాస్‌ ఇప్పటిదాకా ఆడిన 4 మ్యాచ్‌ల్లో మూడింటిలో ఓడిపోయి ఒక మ్యాచ్‌లో గెలవగా.. వరల్డ్‌ జెయింట్స్‌ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ పరాజయం.. ఆసియా లయన్స్‌ 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు, ఓ ఓటమిని ఎదుర్కొన్నాయి. టోర్నీలో ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లో ఇవాళ (మార్చి 16) వరల్డ్‌ జెయింట్స్‌, ఆసియా లయన్స్‌ తలపడనున్నాయి.  

మరిన్ని వార్తలు