చివరి మూడు బంతుల్లో హ్యట్రిక్‌; అద్భుత విజయం

3 Jul, 2021 14:57 IST|Sakshi

లీడ్స్‌: టీ20 బ్లాస్ట్‌ 2021లో భాగంగా శుక్రవారం లంకాషైర్‌, యార్క్‌షైర్‌ మధ్య మ్యాచ్‌ జరిగింది. భారీస్కోర్లు నమోదైన ఈ మ్యాచ్‌లో యార్క్‌షైర్‌ ఆఖరిఓవర్‌లో విజయాన్ని దక్కించుకుంది. యార్క్‌షైర్‌ బౌలర్‌  లోకి ఫెర్గూసన్‌ ఆఖరి ఓవర్లో హ్యాట్రిక్‌తో మెరిసి జట్టును గెలిపించాడు. లంకాషైర్‌కు చివరిఓవర్‌లో 20 పరుగులు అవసరం కాగా ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌ను ఫెర్గూసన్‌ వేశాడు.

అయితే ఫెర్గూసన్ వేసిన  రెండో బంతి నోబాల్‌ కావడం, ఆ తర్వాత బంతిని రాబ్‌ జోన్స్‌ ఫోర్‌గా మలిచాడు. ఇన్నింగ్స్‌ మూడో బంతికి సింగిల్‌ తీయడంతో మూడు బంతుల్లో 10 పరుగులు చేస్తే లంకాషైర్‌ విజయం సాధిస్తుంది. ఈ దశలోనే ఫెర్గూసన్‌ అద్భుతం చేశాడు. ఇన్నింగ్స్‌ నాలుగో బంతికి వెల్స్‌ ను వెనక్కి పంపిన ఫెర్గూసన్‌ ఐదో బంతికి లూక్‌ వుడ్‌ను అద్బుత యార్కర్‌తో క్లీన్‌ బౌల్డ్‌ చేశాడు. అప్పటికే లంకాషైర్ పరాజయం ఖరారైనా.. ఇంకా ఒక బంతి మిగిలి ఉండడంతో ఫెర్గూసన్‌ బంతిని విసిరాడు. టామ్‌ హార్ట్‌లీ భారీ షాట్‌కు యత్నించి లాంగాన్‌లో లిత్‌ చేతికి చిక్కాడు. అంతే ఎవరు ఊహించని విధంగా ఫెర్గూసన్‌ హ్యాట్రిక్‌ నమోదు చేయడంతో పాటు విజయాన్ని అందించాడు. దీనికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేయడంతో వైరల్‌గా మారింది.

ఇక మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన యార్క్‌షైర్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. యార్క్‌షైర్‌ బ్యాటింగ్‌లో హారీ బ్రూక్‌(50 బంతుల్లో 91నాటౌట్‌ ; 10 ఫోర్లు, 3 సిక్సర్లతో) విధ్వంసం చేయగా.. ఓపెనర్‌ కెప్టెన్‌ లిత్‌ 52 పరుగులతో ఆకట్టుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన లంకాషైర్‌ ఆరంభం నుంచి దూకుడుగా ఆడినా ఆఖర్లో ఫెర్గూసన్‌ హ్యాట్రిక్‌తో మెరవడంతో 10 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. రాబ్‌ జోన్స్‌ 64 నాటౌట్‌, కీటన్‌ జెన్నింగ్స్‌ 37 పరుగులతో రాణించారు.

మరిన్ని వార్తలు