మ్యాచ్‌ జరుగుతుండగా గ్రౌండ్‌లో టెంట్‌ వేసుకొని నిద్రపోయాడు

19 Aug, 2021 12:50 IST|Sakshi

లండన్‌: ఇంగ్లండ్‌, టీమిండియాల మధ్య  జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌ అభిమాని జార్వో చేసిన పని అందరికి గుర్తుండే ఉంటుంది. ఆట మూడోరోజు లంచ్‌ విరామం అనంతరం భారత ఆటగాళ్లు మైదానంలోకి వస్తుండగా జార్వో భారత జెర్సీ ధరించి వచ్చాడు. మొదట అతన్ని ఎవరు గుర్తుపట్టకపోయినా కొద్దిసేపటి తర్వాత సెక్యూరిటీ వచ్చి అతన్ని తీసుకెళ్లారు. ఈ సమయంలో..'' భారత్‌కు ఆడిన తొలి ఇంగ్లండ్‌ ఆటగాడిని తానేనంటూ గట్టిగా అరుస్తూ చెప్పడం ట్రెండింగ్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌ అయింది.

అయితే జార్వోకు ఇది కొత్త కాదట..  ఇంతకముందు జరిగిన మ్యాచ్‌ల్లోనూ ఇలాంటివి చాలా చేశాడు. మ్యాచ్‌ జరుగుతుండగా జార్వో చేసిన మరోపని తాజాగా వెలుగుచూసింది. అది ఎప్పుడు జరిగిందన్నది తెలియకపోయినప్పటికి.. వీడియో ప్రకారం అది ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టు  మ్యాచ్‌ అని తెలుస్తోంది. విషయంలోకి వెళితే.. బౌలర్‌ బంతి విసిరిన తర్వాత జార్వో బౌండరీ లైన్‌ను క్రాస్‌ చేసి మైదానంలోకి వచ్చాడు. అనంతరం తనతో పాటు తెచ్చుకున్న టెంట్‌ను గ్రౌండ్‌లో వేసి లోపలికి వెళ్లి నిద్రపోయాడు. ఇదంతా గమనించిన ఆటగాళ్లు నవ్వాపుకోలేకపోయారు. కొన్ని సెకన్ల తర్వాత సెక్యూరిటీ సిబ్బంది టెంట్‌ను అక్కడి నుంచి తొలగించే ప్రయత్నం చేశారు. సరిగ్గా అప్పుడే జార్వో అందులోకి బయటికి వచ్చి తాను అనుకున్నది సాధించినట్టుగా చేతులెత్తి విక్టరీ సింబల్‌ చూపించాడు. ఆ తర్వాత జార్వోను అక్కడి నుంచి తీసుకెళ్లారు. దీనికి సంబంధించిన వీడియోపై ఒక లుక్కేయండి. 

ఇక లార్డ్స్‌ టెస్టులో 151 పరుగుల తేడాతో ఓడిన ఇంగ్లండ్‌ టీమిండియాపై ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైంది. అయితే మూడో టెస్టుకు 8 రోజుల గ్యాప్‌ వచ్చింది. కాగా ఆగస్టు 25 నుంచి లీడ్స్‌ వేదికగా ఇరుజట్ల మధ్య మూడో టెస్టు జరగనుంది.
చదవండి: నేను భారత ఆటగాడినే.. లార్డ్స్‌లో అజ్ఞాత వ్యక్తి హల్‌చల్‌

మరిన్ని వార్తలు