India Vs England: 'మాతో పెట్టుకోవద్దు'

18 Aug, 2021 03:50 IST|Sakshi

2007 సిరీస్‌... నాటింగ్‌హామ్‌లో భారత్, ఇంగ్లండ్‌ టెస్టు మ్యాచ్‌. మన పేసర్‌ జహీర్‌ ఖాన్‌ బ్యాటింగ్‌కు వచ్చిన సమయంలో క్రీజ్‌ చుట్టూ ఇంగ్లండ్‌ ఆటగాళ్లు కొన్ని జెల్లీ బీన్స్‌ విసిరి అతడిని ఆట పట్టించేందుకు ప్రయత్నించారు. అది చూసి జహీర్‌కు బాగా కోపం వచ్చింది. ఇంగ్లండ్‌తో వాదనకు దిగిన అతను బౌలింగ్‌కు వచ్చినప్పుడు తన కసినంతా చూపించాడు. ఐదు వికెట్లతో ప్రత్యర్థిని కుప్పకూల్చడం, భారత్‌ ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం జరిగిపోయాయి. తాజాగా బుమ్రా ఉదంతాన్ని బట్టి చూస్తే 14 ఏళ్ల తర్వాత కూడా ఇంగ్లండ్‌ పాఠాలు నేర్చుకోలేదని అనిపిస్తోంది.  – సాక్షి క్రీడా విభాగం

లార్డ్స్‌ టెస్టు విజయంలో షమీ, బుమ్రా బ్యాటింగ్‌ ప్రదర్శన కూడా కీలక పాత్ర పోషించింది. ఏకంగా 20 ఓవర్ల పాటు క్రీజ్‌లో నిలిచిన వీరిద్దరు 89 పరుగుల భాగస్వామ్యంతో టీమిండియా పైచేయి సాధించడానికి కారణమయ్యారు. ఈ క్రమంలో మైదానంలో ఇంగ్లండ్‌ ఆటగాళ్లనుంచి వీరిద్దరు బంతులే కాదు, మాటల తూటాలు కూడా ఎదుర్కొన్నారు. అయితే ఎక్కడా తగ్గకుండా పట్టుదలగా క్రీజ్‌లో నిలబడ్డారు. షమీ తనదైన శైలిలో దూకుడుగా ఆడి ఇంగ్లండ్‌ బౌలర్లపై చెలరేగగా... బుమ్రా తన బ్యాటింగ్‌ సత్తా చూపించడంతో పాటు బౌలింగ్‌లో తన స్థాయి ఏమిటో ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ను రుచి చూపించాడు. నిజానికి భారత్‌ 8 వికెట్లు కోల్పోయిన తర్వాత మరో వికెట్‌ తీసే లక్ష్యంతో బౌలింగ్‌ చేయకుండా బుమ్రా శరీరంపైకి బంతులు ఎక్కు పెట్టి పదే పదే షార్ట్‌ బంతులతో ఇబ్బంది పెట్టాలని ఇంగ్లండ్‌ ప్రయత్నించింది. తొలి ఇన్నింగ్స్‌లో అండర్సన్‌కు ఒక ఓవర్‌ బుమ్రా ప్రమాదకరంగా వేసినందుకు ప్రతీకారంగా అందరూ కలిసి పాఠం చెప్పాలని భావించినట్లున్నారు. నిజానికి 164 టెస్టుల అనుభవం ఉన్న అండర్సన్‌కు ఇలాంటివి కొత్త కాదు. 2007 నాటింగ్‌హామ్‌లో టెస్టులో కూడా అతను ఆడాడు. అతనికంటే ఎక్కువగా స్పందించిన ఇతర బౌలర్లు ఈ వేడిలో బౌలింగ్‌లో గతి తప్పగా...షమీ, బుమ్రా పండగ చేసుకున్నారు.

కోహ్లి దారి చూపగా... 
ఈ టెస్టులో భారత ఆటగాళ్ల శారీరక భాష చూస్తే ప్రతీ ఒక్కరు ఒక్కో అగ్నిగోళంగా కనిపించారు. ముఖ్యంగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ప్రతీ క్షణం అమితోత్సాహంతో కనిపిస్తూ, తన సహచరులను ప్రేరేపిస్తున్న తీరు...వికెట్‌ పడినప్పుడు ప్రదర్శిస్తున్న హావభావాలు ప్రత్యర్థిని ఒత్తిడిలో పడేస్తున్నాయి. ఎక్కడా తగ్గేదే లేదు అన్నట్లుగా క్రికెటర్లు మాటల దాడికి వెనుకాడలేదు. అండర్సన్‌తో కోహ్లి వాదన, వికెట్‌ తీసినప్పుడు ‘నిశ్శబ్దం’ అన్నట్లుగా నోటిపై వేలుతో సిరాజ్‌ సంబరాలతో మొదలైన టెస్టు బుమ్రా, బట్లర్‌ మాటల యుద్ధం వరకు సాగింది. ఒక దశలో ఇది శృతి మించడంతో బుమ్రా చివరకు అంపైర్‌కు కూడా ఫిర్యాదు చేయాల్సి వచ్చింది. ఆ ఆగ్రహాన్నంతా బుమ్రా తర్వాత తన బౌలింగ్‌లో చూపించాడు. ‘మాలో ఒక్కడిని అంటే పది మందిని అన్నట్లే. అందుకే ఎవరిని దూషంగా అందరం మళ్లీ జవాబిచ్చేందుకు సిద్ధంగా ఉంటాం తప్ప వెనక్కి తగ్గం’ అంటూ మ్యాచ్‌ ముగిసిన తర్వాత రాహుల్‌ చేసిన వ్యాఖ్య మ్యాచ్‌ చివరి రోజు ఎలా సాగిందో చెబుతోంది.  

ఆస్ట్రేలియన్లూ ఇలాగే... 
అడిలైడ్‌లో 36 ఆలౌట్‌ తర్వాత మెల్‌బోర్న్‌లో బరిలోకి దిగిన టీమిండియాను ఆసీస్‌ ఆటగాళ్లు మొదటి సెషన్‌నుంచే మాటలతో వేధించారు. అయితే రహానే నాయకత్వంలో జట్టు మరింత కసిగా ఆటను ప్రదర్శించింది. చివరకు అద్భుత విజయం సాధించి మమ్మల్ని రెచ్చగొడితే ఇలాగే ఉంటుందంటూ చూపించింది. ఇక బ్రిస్బేన్‌ అద్భుతం గురించి ఎంత చెప్పినా తక్కువే. సిడ్నీ టెస్టులో డ్రాకు ప్రయత్నిస్తున్న సమయంలో గాబా మైదానానికి రా చూసుకుందాం అంటూ కెప్టెన్‌ పైన్‌ సవాల్‌ విసిరాడు. ఇది కూడా టీమిండియా సీరియస్‌గా తీసుకుంది. అత్యద్భుత ఆట తో అనూహ్య లక్ష్యాన్ని ఛేదించి మూడు దశాబ్దాలుగా ఆసీస్‌ ఓటమి ఎరుగని మైదానంలో వారిని మట్టికరిపించింది. అన్నట్లు ఇటీవల ఓడిన వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్‌ ఫైనల్లో భారత్, న్యూజిలాం డ్‌ ఆటగాళ్ల మధ్య చిన్నపాటి వాదన కూడా జరగలేదు. భారత్‌ను ఎలా ఓడించాలో మాకు తెలుసన్నట్లుగా కివీస్‌ చాలా కూల్‌గా ఆటపై మాత్రమే దృష్టి పెట్టి ఫలితం సాధించింది! 

మరిన్ని వార్తలు