నాన్న, నేను, ఒలింపిక్‌ పతకం...

31 Jul, 2021 05:16 IST|Sakshi

అమ్మాయికి ఆటలు ఎందుకని నాన్న ఏనాడూ అడ్డు చెప్పలేదు... బాక్సింగ్‌ లాంటి ప్రమాదకర క్రీడ ఎంచుకోవడం ఎందుకని నాన్న అభ్యంతర పెట్టలేదు... ఆర్థిక స్థితి అంతంత మాత్రమే, ఆడించడం కష్టం అంటూ అర్ధాంతరంగా తప్పుకోమని నాన్న ఆపలేదు... బౌట్‌లు, కేటగిరీలు, పంచ్‌ల గురించి తెలియకపోయినా దేశం తరఫున ఆడటం గొప్ప గౌరవం అనే విషయం మాత్రం నాన్నకు బాగా తెలుసు... అందుకే తన కూతురు ఒలింపిక్స్‌లో బరిలోకి దిగితే చాలనేది మాత్రం ఆ నాన్న కల... సరిగ్గా రెండేళ్ల క్రితం లవ్లీనా చెప్పిన మాటలు ఇవి! అదే లక్ష్యంగా కష్టపడుతున్నానన్న లవ్లీనా ఇప్పుడు నాన్న చిరు కోరికను తీర్చడంతోనే సరి పెట్టలేదు. ఏకంగా పతకం సాధించి అంతకంటే ఎన్నో రెట్ల ఆనందాన్ని పంచింది.   

సాక్షి క్రీడా విభాగం
సరదాగా ప్రారంభించిన కిక్‌ బాక్సింగ్‌/మువతాయ్‌ నుంచి సీరియస్‌ బాక్సింగ్‌కు మళ్లాలనే నిర్ణయం సరైన సమయంలో తీసుకోవడం వల్లే లవ్లీనా కెరీర్‌ మలుపు తిరిగింది. కవలలైన ఆమె ఇద్దరు అక్కలు లిచా, లిమా కిక్‌ బాక్సింగ్‌ ఆడేవారు. ఏడాదిపాటు లవ్లీనా కూడా అదే బాటలో నడిచింది. కానీ ఆ ఆటకు తగిన గుర్తింపు లేదని, భవిష్యత్తూ ఉండదని ఆమెకు తెలిసొచ్చింది. అస్సాం రాష్ట్రం,  గోలాఘాట్‌ జిల్లా సమీపంలోని బారోముఖియా ఆమె స్వస్థలం. ప్రతిభాన్వేషణలో భాగంగా అస్సాంలోని వివిధ ప్రాంతా లకు వెళ్లిన స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (సాయ్‌) కోచ్‌ పదమ్‌ బోరో దృష్టిలో పడటం లవ్లీనా కెరీర్‌కు నాంది పలికింది.

ఆమెలో ప్రతిభను గుర్తించిన పదమ్, బాక్సింగ్‌కు సరిగ్గా సరిపోతుందని భావించి గువహటి అకాడమీలో శిక్షణకు ఎంపిక చేశారు. ఆ తర్వాత లవ్లీనా వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. బాక్సింగ్‌లో తన ప్రతిభకు పదును పెడుతూ వరుస విజయాలతో ఆమె జాతీయ సబ్‌ జూనియర్‌ చాంపియన్‌గా కూడా నిలిచింది. 2016లో భారత సీనియర్‌ టీమ్‌ శిక్షణా శిబిరంలోకి వచ్చాక లవ్లీనాకు తన లక్ష్యం ఏమిటో స్పష్టంగా అర్థమైంది. గతంలో మిడిల్‌ వెయిట్‌ కేటగిరీలో తలపడిన ఆమె... ఒలింపిక్స్‌లో తొలిసారి వెల్టర్‌ వెయిట్‌ను చేర్చడంతో అందుకోసమే సాధన చేసింది. ఈ కేటగిరీ లో సరైన ప్రాక్టీస్‌ పార్ట్‌నర్‌లు లభించకపోయి నా... మరో విభాగానికి చెందిన సీనియర్‌ సరితా దేవితో పోటీ పడుతూ సాధన కొనసాగించింది.  

అమ్మ అనారోగ్యం... కరోనా...
జోర్డాన్‌లో జరిగిన ఆసియా క్వాలిఫయర్స్‌లో రాణించి గత ఏడాదే లవ్లీనా టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. అనంతరం లాక్‌డౌన్‌ సమయమంతా సొంత ఊరిలోనే గడిపింది. అనంతరం మళ్లీ ప్రాక్టీస్‌ ప్రారంభం కావడంతో పటియాలాలోని శిక్షణా శిబిరానికి వచ్చేసింది. అప్పటి వరకు అంతా బాగుంది. అయితే గత ఫిబ్రవరిలో కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న తల్లి మమోని చెంతన ఉండేందుకు పది రోజులు మళ్లీ ఇంటికి వచ్చింది. ఇంట్లో పరిస్థితి చక్కబడినా... తిరిగి పటియాలా చేరుకున్న తర్వాత ఆమె కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. ఇది లవ్లీనాకు బాగా నష్టం కలిగించింది.  

ఒలింపిక్స్‌ సన్నద్ధమయ్యే క్రమంలో 52 రోజుల ప్రత్యేక శిక్షణ కోసం స్పెయిన్‌ వెళ్లాల్సిన భారత బాక్సర్ల బృందం నుంచి ఆమె తప్పుకోవాల్సి వచ్చింది. కరోనా నుంచి కోలుకోవడం ఒకవైపు... ఆపై ప్రాక్టీస్‌ కొనసాగించడం మరోవైపు... ఈ కఠిన సమయాన్ని లవ్లీనా పట్టుదలతో అధిగమించింది. ఇప్పుడు ఆమె విజయం చూస్తున్న తండ్రి టికెన్‌ బొర్గోహైన్‌ ఆనందానికి అవధులు లేవు. ఎన్నో ఇబ్బందులను దాటిన తర్వాత తన కూతురు తీసుకువస్తున్న ఒలింపిక్‌ పతకాన్ని చూసేందుకు ఆ నాన్న వేయి కళ్లతో ఎదురు చూస్తున్నాడు!

మరిన్ని వార్తలు