IPL 2023: ఎక్కువగా వాళ్ల మీదే ఆధారపడ్డారు.. ఫలితం అనుభవించారు.. వచ్చే సీజన్‌లో అయినా: టీమిండియా మాజీ క్రికెటర్‌

25 May, 2023 17:46 IST|Sakshi
లక్నో బ్యాటర్ల వైఫల్యంపై భారత మాజీ క్రికెటర్‌ విమర్శలు (PC: IPL)

IPL 2023- LSG: విదేశీ ఆటగాళ్ల మీద అతిగా ఆధారపడటం లక్నో సూపర్‌ జెయింట్స్‌ కొంపముంచిందని టీమిండియా మాజీ క్రికెటర్‌ మురళీ కార్తిక్‌ అభిప్రాయడపడ్డాడు. అదే సమయంలో దీపక్‌ హుడా, కృనాల్‌ పాండ్యా వంటి దేశీ ప్లేయర్లు కనీస స్థాయి ప్రదర్శన ఇవ్వలేకపోవడం ప్రభావం చూపిందని పేర్కొన్నాడు. ముంబై ఇండియన్స్‌తో బుధవారం నాటి ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో మరోసారి ఈ విషయం నిరూపితమైందన్నాడు.

ఆ ముగ్గురే అద్భుతంగా
ఐపీఎల్‌-2023లో లీగ్‌ దశలో ఆడిన 14 మ్యాచ్‌లలో 8 గెలిచిన లక్నో టాప్‌-3లో నిలిచి ప్లే ఆఫ్స్‌లో అడుగుపెట్టింది. రెగ్యులర్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ గాయం కారణంగా జట్టుకు దూరం కాగా కృనాల్‌ పాండ్యా సారథ్య బాధ్యతలు చేపట్టి ముందుకు నడిపించాడు. అయితే, లక్నో గెలిచిన చాలా మ్యాచ్‌లలో విదేశీ ఆటగాళ్లు కైలీ మేయర్స్‌, నికోలసన్‌ పూరన్‌, మార్కస్‌ స్టొయినిస్‌లే కీలక పాత్ర పోషించారు.

హుడా దారుణంగా
మార్కస్‌ స్టొయినిస్‌ మొత్తంగా సీజన్‌లో 15 మ్యాచ్‌లలో 408 పరుగులతో లక్నో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 13 మ్యాచ్‌లు ఆడి 379 పరుగులు సాధించిన కైలీ మేయర్స్‌ అతడి తర్వాతి స్థానంలో ఉండగా.. పూరన్‌ 15 మ్యాచ్‌లలో 358 పరుగులతో మూడో స్థానం ఆక్రమించాడు. ఇలా లక్నో టాప్‌ స్కోరర్లలో ముగ్గురు విదేశీ ఆటగాళ్లే ఉండటం గమనార్హం.

మరోవైపు.. తాత్కాలిక కెప్టెన్‌, ఆల్రౌండర్‌ కృనాల్‌ పాండ్యా 188 పరుగులు చేయగా.. ఎన్నో అంచనాలతో బరిలోకి దిగిన దీపక్‌ హుడా పూర్తిగా నిరాశపరిచాడు. 12 మ్యాచ్‌లలో అతడు చేసిన మొత్తం పరుగులు కేవలం 84. ఇక ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో మేయర్స్‌ 18 పరుగులకే పెవిలియన్‌ చేరగా.. కృనాల్‌ 8 రన్స్‌ మాత్రమే చేశాడు.

పాపం స్టొయినిస్‌
ఒంటరి పోరాటం చేస్తున్న స్టొయినిస్‌(27 బంతుల్లో 40 పరుగులు)ను అనవసరంగా రనౌట్‌కు బలైపోయేలా చేసిన దీపక్‌ హుడా(15) తాను కూడా రనౌట్‌ అయి కొంపముంచాడు. బ్యాటర్ల వైఫల్యం కారణంగా లక్ష్య ఛేదనలో  తడబడ్డ లక్నో 101 పరుగులకే చేతులెత్తేసింది. 81 పరుగుల తేడాతో ముంబై చేతిలో ఓడి మరోసారి భంగపడింది.

కనీసం వచ్చే సీజన్‌లో అయినా
ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం క్రిక్‌బజ్‌ షోలో భారత మాజీ బౌలర్‌ మురళీ కా​ర్తిక్‌ మాట్లాడుతూ.. ‘‘లక్నో ఎక్కువగా విదేశీ ఆటగాళ్ల మీదే ఆధారపడింది. ఆ జట్టులో ఉన్న భారత ఆటగాళ్లలో ఒక్కరు కూడా అంచనాలకు అనుగుణంగా రాణించలేకపోయారు.

ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో స్టొయినిస్‌ ఒక్కడే కాసేపు పోరాడాడు. వచ్చే సీజన్‌లోనైనా లక్నో ఈ లోపాలు సరిదిద్దుకోవాలి. ఈ మ్యాచ్‌లో పూరన్‌ డకౌట్‌ కావడం తీవ్ర ప్రభావం చూపింది. స్టొయినిస్‌ ఆడతాడు అనుకుంటే చెత్తగా రనౌట్‌ కావాల్సి వచ్చింది’’ అని లక్నో బ్యాటర్ల తీరును విమర్శించాడు. 

చదవండి: ఆర్సీబీలో నెట్‌బౌలర్‌గా ఉన్నా... ఒక్క ఛాన్స్‌ కూడా ఇవ్వలేదు! కానీ ఇప్పుడు..
తిలక్‌ వర్మను టీజ్‌ చేసిన సూర్యకుమార్‌.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు