LSG VS PBKS: ఆ ఒక్కడే తప్పించుకున్నాడు.. అప్పుడు భువీ..!

29 Apr, 2023 13:02 IST|Sakshi
Photo credit: IPL Twitter

ఐపీఎల్‌-2023లో భాగంగా పంజాబ్‌ కింగ్స్‌తో నిన్న (ఏప్రిల్‌ 28) జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిన విషయం విధితమే. ఒక్కరు కూడా సెంచరీ చేయకపోయినా లక్నో బ్యాటర్లు ఐపీఎల్‌ చరిత్రలో రెండో అత్యధిక స్కోర్‌ (257) నమోదు చేశారు. కైల్‌ మేయర్స్‌ (54), ఆయూష్‌ బదోని (43), స్టోయినిస్‌ (72), పూరన్‌ (45) విధ్వంసం ధాటికి పంజాబ్‌ బౌలర్లు బెంబేలెత్తిపోయారు.

అయితే లక్నో బ్యాటర్ల బారి నుంచి ఒక్క పంజాబ్‌ బౌలర్‌ మాత్రం తప్పించుకున్నాడు. అతడే రాహుల్‌ చాహర్‌.ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ కెప్టెన్‌ ఏడుగురు బౌలర్లతో బౌలింగ్‌ చేయించగా, రాహుల్‌ చాహర్‌ ఒక్కడే పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. తన కోటా 4 ఓవర్లను అద్భుతంగా బౌల్‌ చేసిన చాహర్‌.. 29 పరుగులు మాత్రమే ఇచ్చి,  శివాలెత్తి ఉన్న లక్నో బ్యాటర్లను కట్టడి చేశారు.

మరోవైపు మిగతా పంజాబ్‌ బౌలర్లు లక్నో బ్యాటర్ల ఊచకోతను విలవిలలాడిపోయారు. గుర్నూర్‌ సింగ్‌ బ్రార్‌ 3 ఓవర్లలో 42 పరుగులు, అర్షదీప్‌ సింగ్‌.. తన ఐపీఎల్‌ కెరీర్‌లో అత్యంత చెత్త గణాంకాలు (4-0-54-1), రబాడ 4 ఓవర్లలో 52 పరుగులు, సికందర్‌ రజా ఒక ఓవర్లో 17, సామ్‌ కర్రన్‌ 3 ఓవర్లలో 38, లివింగ్‌స్టోన్‌ ఒక ఓవర్‌లో 19 పరుగులు సమర్పించుకున్నారు.

ఛేదనలో పంజాబ్‌ ఆటగాళ్ల ధాటికి లక్నో బౌలర్లు సైతం​ భారీగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ.. యశ్‌ ఠాకూర్‌  (4/37), నవీన్‌ ఉల్‌ హాక్‌ (3/30) క్రమం తప్పకుండా వికెట్లు తీసి ప్రత్యర్ధి ఓటమిని ఖరారు చేశారు. రవి బిష్ణోయ్‌ ధారాళంగా పరుగులు సమర్పించుకున్నప్పటికీ, 2 కీలక వికెట్లు (అథర్వ టైడే (66), లివింగ్‌స్టోన్‌ (23)) తీశాడు. 

అ‍ప్పట్లో భువీ కూడా ఇంతే..
ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక స్కోర్‌ (ఆర్సీబీ- 263) నమోదైన మ్యాచ్‌లోనూ ఇదే తరహాలో ఓ బౌలర్‌ ఆర్సీబీ బౌలర్ల బారి నుంచి తప్పించుకున్నాడు. నాటి మ్యాచ్‌లో పూణే బౌలర్లంతా విచ్చలవిడిగా పరుగులు సమర్పించుకుంటే.. ఒక్క భువనేశ్వర్‌ కుమార్‌ మాత్రం తాండవం చేస్తుండిన ఆర్సీబీ బ్యాటర్లను, ముఖ్యంగా అప్పటికే ఊగిపోతున్న క్రిస్‌ గేల్‌ను కట్టడి చేశాడు. ఆ మ్యాచ్‌లో భువీ 4 ఓవర్లు వేసి కేవలం 23 పరుగులు మాత్రమే ఇవ్వగా.. మిగతా బౌలర్లంతా 12 నుంచి 29 ఎకానమీ మధ్యలో పరుగులు సమర్పించుకున్నారు. 

మరిన్ని వార్తలు