‘ప్లే ఆఫ్స్‌’కు సూపర్‌ కింగ్స్‌... జెయింట్స్‌ 

21 May, 2023 01:19 IST|Sakshi

క్వాలిఫయర్‌–1కు చెన్నై 

77 పరుగులతో ఢిల్లీపై ఘన విజయం 

ఐపీఎల్‌–2023లో మరో రెండు ‘ప్లే ఆఫ్స్‌’ స్థానాలు ఖరారయ్యాయి... గత సీజన్‌లో తొమ్మిదో స్థానంతో ముగించిన నాలుగు సార్లు చాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఈ సారి మళ్లీ పైకెగసింది... చివరి లీగ్‌లో ఢిల్లీని చిత్తు చేసి రెండో స్థానంతో క్వాలిఫయర్‌–1కు అర్హత సాధించింది... సొంత గడ్డపై మ్యాచ్‌ ఆడే అవకాశం దక్కించుకుంది.

మరో వైపు గత ఏడాదిలాగే ఈ సారి కూడా లక్నో సూపర్‌ జెయింట్స్‌ ప్లే ఆఫ్స్‌కు చేరింది... ఉత్కంఠభరితంగా సాగిన చివరి పోరులో పరుగు తేడాతో కోల్‌కతాను ఓడించి ఊపిరి పీల్చుకుంది... నాలుగో స్థానం ఎవరిదనేది నేడు జరిగే చివరి రెండు లీగ్‌ మ్యాచ్‌లతో తేలుతుంది. ఈ స్థానం కోసం ప్రధానంగా ముంబై, బెంగళూరు పోటీ పడుతుండగా... ఈ రెండూ ఓడితే రాజస్తాన్‌కు అవకాశం ఉంటుంది.   

న్యూఢిల్లీ: నాలుగుసార్లు ఐపీఎల్‌ చాంపియన్‌  చెన్నై సూపర్‌కింగ్స్‌ ప్లేఆఫ్స్‌కు చేరింది. ఇప్పటికే రేసుకు దూరమైన ఢిల్లీని సులువుగా చిత్తుచేసింది. సొంతగడ్డపై గెలుపుతో ముగిద్దామనుకున్న వార్నర్‌ సేన ఆశలపై నీళ్లుచల్లింది. ధోని సేన 77 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మొదట సూపర్‌కింగ్స్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 223 పరుగుల భారీ స్కోరు చేసింది. డెవాన్‌ కాన్వే (52 బంతుల్లో 87; 11 ఫోర్లు, 3 సిక్స్‌లు), ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రుతురాజ్‌ గైక్వాడ్‌ (50 బంతుల్లో 79; 3 ఫోర్లు, 7 సిక్సర్లు) శివమెత్తారు. అనంతరం భారీ లక్ష్యాన్ని ఛేదించలేక ఢిల్లీ క్యాపిటల్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 146 పరుగులకే పరిమితమైంది. కెప్టెన్‌ వార్నర్‌ (58 బంతుల్లో 86; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) పోరాడాడు. 

ఓపెనర్ల వీరవిహారం 
ఆట మొదలవగానే చెన్నై ఓపెనర్లు పరుగుల బాట పట్టారు. ప్రత్యర్థి జట్టు పేస్, స్పిన్‌ మార్చిమార్చి ప్రయోగించినా రుతురాజ్, కాన్వే జోరును అడ్డుకోలేకపోయారు. పవర్‌ప్లేలో 52/0 స్కోరు చేసిన చెన్నై ఆ తర్వాత ఇంకాస్త వేగంగా ఆడారు. అక్షర్‌ పదో ఓవర్లో రెండు వరుస సిక్సర్లు బాదిన రుతురాజ్‌ 37 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. కాసేపటికే కుల్దీప్‌ 12వ ఓవర్లో ‘హ్యాట్రిక్‌’ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.

జట్టు స్కోరు వంద దాటాక కాన్వే ఫిఫ్టీ 33 బంతుల్లో పూర్తయ్యింది. 14 ఓవర్ల పాటు దుర్బేధ్యంగా సాగిన 141 పరుగుల ఓపెనింగ్‌ జోడీకి 15వ ఓవర్లో సకారియా ముగింపు పలికాడు. రుతురాజ్‌ నిష్క్రమించగా, శివమ్‌ దూబే (9 బంతుల్లో 22; 3 సిక్సర్లు), కాన్వే ధాటిగా ఆడారు. ఆఖర్లో జడేజా (7 బంతుల్లో 20 నాటౌట్‌; 3 ఫోర్లు, 1 సిక్స్‌) మెరిపించాడు. 

వార్నర్‌ ఒంటరిగా... 
ఢిల్లీ ముందున్న లక్ష్యం అతి కష్టమైంది. టాపార్డర్‌ దంచేస్తే తప్ప ఛేదన సాధ్యం కానేకాదు. కానీ టాపార్డరే కాదు... మిడిల్, లోయర్‌ ఆర్డర్, టెయిలెండర్లు అంతా చేతులెత్తేయడంతో చెన్నై గెలుపు సులువైంది. పృథ్వీ షా (5), సాల్ట్‌ (3), రోసో (0) ఇలా ధాటిగా ఆడే సత్తా వున్న బ్యాటర్లు పవర్‌ప్లే వరకైనా ఆడలేకపోయారు. 26 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన క్యాపిటల్స్‌ను కెప్టెన్‌ వార్నర్‌ ఒంటరిగా నడిపించాడు. సహచరులు ధుల్‌ (13), అక్షర్‌ (15), అమన్‌ (7), లలిత్‌ యాదవ్‌ (6) చెన్నై బౌలర్ల ఉచ్చులో పడటంతో వార్నర్‌ ఎంత పోరాడినా జట్టు స్కోరు 150 పరుగులు దాటలేదు. 

స్కోరు వివరాలు 
చెన్నై సూపర్‌కింగ్స్‌ ఇన్నింగ్స్‌: రుతురాజ్‌ (సి) రోసో (బి) సకారియా 79; కాన్వే (సి) అమన్‌ (బి) నోర్జే 87; దూబే (సి) లలిత్‌ (బి) ఖలీల్‌ 22; ధోని (నాటౌట్‌) 5; జడేజా (నాటౌట్‌) 20; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం (20 ఓవర్లలో 3 వికెట్లకు) 223. వికెట్ల పతనం: 1–141, 2–195, 3–195. బౌలింగ్‌: ఖలీల్‌ 4–0–45–1, లలిత్‌ 2–0–32–0, అక్షర్‌ 3–0–32–0, నోర్జే 4–0–43–1, సకారియా 4–0–36–1, కుల్దీప్‌ 3–0–34–0. 

ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌: పృథ్విషా (సి) రాయుడు (బి) తుషార్‌ 5; వార్నర్‌ (సి) రుతురాజ్‌ (బి) పతిరణ 86; సాల్ట్‌ (సి) రహానె (బి) చహర్‌ 3; రోసో (బి) చహర్‌ 0; ధుల్‌ (సి) తుషార్‌ (బి) జడేజా 13; అక్షర్‌ (సి) రుతురాజ్‌ (బి) చహర్‌ 15; అమన్‌ (సి) అలీ (బి) పతిరణ 7; లలిత్‌ (సి) అలీ (బి) తీక్షణ 6; నోర్జే నాటౌట్‌ 0; కుల్దీప్‌ (ఎల్బీ) (బి) తీక్షణ 0; సకారియా నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 9 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1–5, 2–26, 3–26, 4–75, 5–109, 6–131, 7–144, 8–146, 9–146. బౌలింగ్‌: దీపక్‌ చహర్‌ 4–0–22–3, తుషార్‌ 4–0–26–1, తీక్షణ 4–1–23–2, జడేజా 4–0–50–1, పతిరణ 4–0–22–2.   


ఎలిమినేటర్‌కు లక్నో 
♦ పరుగు తేడాతో కోల్‌కతాపై విజయం 
కోల్‌కతా: విజయలక్ష్యం 177 పరుగులు...కీలక బ్యాటర్లంతా వెనుదిరగ్గా, కోల్‌కతా విజయానికి చివరి 12 బంతుల్లో 41 పరుగులు కావాలి...క్రీజ్‌లో రింకూ సింగ్‌ ఉండటంతో కొంత ఆశ...దానిని వమ్ము చేయకుండా ఈ సీజన్‌లో పలు మార్లు ఆడినట్లుగా రింకూ మళ్లీ తన జోరు మొదలు పెట్టాడు. నవీనుల్‌ వేసిన 19వ ఓవర్లో 4, 4, 4, 2, 6, 0లతో 20 పరుగులు రాబట్టాడు. అంతే ఒక్కసారిగా ఉత్కంఠ పెరిగింది. 6 బంతులకు 21 పరుగులు కావాల్సి ఉండగా భారీ షాట్లమీదే దృష్టిపెట్టిన రింకూ సింగిల్స్‌ తీయలేదు. తీవ్ర ఒత్తిడిలో యశ్‌ ఠాకూర్‌ 2 వైడ్లు వేశాడు.

ఆఖరి మూడు బంతుల్లో 18 పరుగులు అవసరం కాగా, రింకూ వరుసగా 6, 4, 6 కొట్టినా ఈ సారి గెలిపించలేకపోయాడు. చివరకు పరుగు తేడాతో లక్నో గట్టెక్కింది. మొదట లక్నో సూపర్‌ జెయింట్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. నికోలస్‌ పూరన్‌ (30 బంతుల్లో 58; 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) దంచేశాడు. అనంతరం లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 7 వికెట్లకు 175 పరుగులు చేసింది. రింకూ సింగ్‌ (33 బంతుల్లో 67 నాటౌట్‌; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) అలుపెరగని పోరాటం చేశాడు. జేసన్‌ రాయ్‌ (28 బంతుల్లో 45; 7 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించాడు.  

ఆదుకున్న పూరన్‌  
డికాక్‌తో కరణ్‌ శర్మ (3) ఓపెనింగ్‌ కుదరలేదు. ఆ తర్వాత వచ్చిన వారితో లక్నో ఆట కూడా తీసికట్టుగానే ఉంది.  ప్రేరక్‌ మన్కడ్‌ (20 బంతుల్లో 26; 5 ఫోర్లు)ను, స్టొయినిస్‌ (0)ను వైభవ్‌ అరోరా ఒకే ఓవర్లో పెవిలియన్‌ చేర్చాడు.

కెప్టెన్‌ కృనాల్‌ పాండ్యా (9) నరైన్‌ ఉచ్చులో పడగా... డికాక్‌ (27 బంతుల్లో 28; 2 సిక్స్‌లు) భారీ షాట్‌కు యతి్నంచి నిష్క్ర మించాడు. 73 పరుగులకే 5 కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో ఆయుశ్‌ బదోని (21 బంతుల్లో 25; 2 ఫోర్లు, 1 సిక్స్‌)కు జతయిన పూరన్‌ జట్టు బాధ్యత మోశాడు. క్రీజులోకి వచి్చనప్పటినుంచే సిక్సర్లు, ఫోర్లతో ఇన్నింగ్స్‌కు ఊపిరిపోశాడు.

శుభారంభం దక్కినా... 
కోల్‌కతా ఓపెనర్లు వెంకటేశ్‌ అయ్యర్, జేసన్‌ రాయ్‌ లక్ష్యానికి దీటైన పునాది వేశారు. 4.2 ఓవర్లలోనే జట్టు స్కోరు 50 దాటింది. అయితే వెంకటేశ్‌ అయ్యర్‌ (15 బంతుల్లో 24; 3 ఫోర్లు, 1 సిక్స్‌)ను గౌతమ్‌ అవుట్‌ చేయడంతోనే ఆట మలుపు తిరిగింది. నితీశ్‌ రాణా (8), రాయ్, గుర్బాజ్‌ (10) పెవిలియన్‌కు వరుస కట్టారు. 27 బంతుల్లో 57 పరుగులు చేయాల్సిన దశలో రసెల్‌ అవుట్‌ కావడంతో కోల్‌కతా ఛేదన కష్టంగా మారిపోయింది.  

స్కోరు వివరాలు 
లక్నో సూపర్‌జెయింట్స్‌ ఇన్నింగ్స్‌: కరణ్‌ శర్మ (సి) శార్దుల్‌ (బి) హర్షిత్‌ 3; డికాక్‌ (సి) రసెల్‌ (బి) వరున్‌ 28; ప్రేరక్‌ (సి) హర్షిత్‌ (బి) వైభవ్‌ 26; స్టొయినిస్‌ (సి) వెంకటేశ్‌ (బి) వైభవ్‌ 0; కృనాల్‌ (సి) రింకూ (బి) నరైన్‌ 9; బదోని (సి) శార్దుల్‌ (బి) నరైన్‌ 25; పూరన్‌ (సి) వెంకటేశ్‌ (బి) శార్దుల్‌ 58; గౌతమ్‌ నాటౌట్‌ 11; బిష్ణోయ్‌ (బి) శార్దుల్‌ 2; నవీనుల్‌ నాటౌట్‌ 2; ఎక్స్‌ట్రాలు 12; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 176. వికెట్ల పతనం: 1–14, 2–55, 3–55, 4–71, 5–73, 6–147, 7–159, 8–162. 
బౌలింగ్‌: హర్షిత్‌ 3–0–21–1, వైభవ్‌ 4–0–30–2, వరుణ్‌ 4–0–38–1, నితీశ్‌ రాణా 1–0–3–0, శార్దుల్‌ 2–0–27–2, నరైన్‌ 4–0–28–2, సుయశ్‌ 1–0–12–0, రసెల్‌ 1–0–12–0. 

కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఇన్నింగ్స్‌: రాయ్‌ (బి) కృనాల్‌ 45; వెంకటేశ్‌ (సి) బిష్ణోయ్‌ (బి) గౌతమ్‌ 24; నితీశ్‌ రాణా (సి) కృనాల్‌ (బి) బిష్ణోయ్‌ 8; గుర్బాజ్‌ (సి) బిష్ణోయ్‌ (బి) యశ్‌ 10; రింకూసింగ్‌ (నాటౌట్‌) 67; రసెల్‌ (బి) బిష్ణోయ్‌ 7; శార్దుల్‌ (సి) ప్రేరక్‌ (బి) యశ్‌ 3; నరైన్‌ రనౌట్‌ 1; వైభవ్‌ (నాటౌట్‌) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 175. వికెట్ల పతనం: 1–61, 2–78, 3–82, 4–108, 5–120, 6–134, 7–136. బౌలింగ్‌: మొహసిన్‌ 1–0–15–0, నవీనుల్‌ 4–0–46–0, కృనాల్‌ 4–0–30–1, గౌతమ్‌ 4–0–26–1, రవి బిష్ణోయ్‌ 4–0–23–2, యశ్‌ ఠాకూర్‌ 3–0–31–2.  


ఐపీఎల్‌లో నేడు కీలక మ్యాచ్‌లు 
ముంబై VS హైదరాబాద్‌ (మధ్యాహ్నం గం. 3:30 నుంచి)
బెంగళూరు VS గుజరాత్‌  (రాత్రి గం. 7:30 నుంచి)

స్టార్‌ స్పోర్ట్స్, జియో సినిమాలో ప్రత్యక్ష ప్రసారం 
 

మరిన్ని వార్తలు