IPL 2022: వరుస ఓటముల నేపథ్యంలో ముంబై ఇండియన్స్‌ కోచ్‌ కీలక వ్యాఖ్యలు

25 Apr, 2022 16:21 IST|Sakshi
Photo Courtesy: IPL

ఐపీఎల్‌ 2022 సీజన్‌లో వరుసగా ఎనిమిది ఓటములు చవిచూసి ప్లే ఆఫ్స్‌ బరి నుంచి దాదాపుగా తప్పుకున్న ముంబై ఇండియన్స్.. జట్టు ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తుంది. ఆదివారం (ఏప్రిల్‌ 24) లక్నో సూపర్‌ జెయింట్స్‌ చేతిలో ఓటమి అనంతరం ముంబై ప్రధాన కోచ్ మహేల జయవర్ధనే ఈ విషయాన్ని ప్రధానంగా ప్రస్తావించాడు. తదుపరి మ్యాచ్‌లకు ముంబై జట్టులో కీలక మార్పులు తప్పవని ఆయన పేర్కొన్నాడు. 

ఓపెనర్లు రోహిత్‌ శర్మ, ఇషాన్ కిషన్‌ల ఫామ్‌ ఆందోళనకరంగానే ఉన్నప్పటికీ.. త్వరలోనే వారివురు సెట్‌ అవుతారనే ధీమాను వ్యక్తం చేశాడు. కొత్త కుర్రాడు తిలక్‌ వర్మ అద్భుతంగా బ్యాటింగ్‌ చేస్తున్నాడని ఆయన కితాబునిచ్చాడు. సూర్యకుమార్‌ యాదవ్‌ పర్వాలేదనిపిస్తున్నా, పోలార్డ్‌ పేలవ ఫామ్‌ కారణంగా ఇబ్బంది పడుతున్నాడని అన్నాడు. బేబీ ఏబీడి డెవాల్డ్‌ బ్రెవిస్‌కు మరిన్ని అవకాశాలిస్తామని క్లూ ఇచ్చాడు. బ్యాటింగ్‌కు అనుకూలించే పిచ్‌లపై తమ బ్యాటింగ్‌ దళం సరిగా పెర్ఫార్మ్‌ చేయలేకపోవడం ఆందోళనకరమేనని అంగీకరించాడు. 

కోచింగ్‌ స్టాఫ్‌ అభిప్రాయాలు తీసుకున్న అనంతరం జట్టులో అవసరమైన మార్పులు ఉంటాయని హింటిచ్చాడు. బౌలర్ల ప్రదర్శన సైతం ఏమంత ఆశాజనకంగా లేదని ఒప్పుకున్నాడు. బుమ్రా ఆశించిన మేరకు రాణించలేకపోతున్నాడని, డేనియల్‌ సామ్స్‌, రిలే మెరిడిత్‌ ధారాళంగా పరుగులు సమర్పించుకుంటున్నారని, సీనియర్‌ బౌలర్‌గా ఉనద్కత్‌, టీ20 స్పెషలిస్ట్‌గా పోలార్డ్‌ రాణించలేకపోతున్నారని వివరించాడు. కొత్త కుర్రాడు హృతిక్‌ షోకీన్‌ పర్వాలేదనిపిస్తున్నాడని కితాబునిచ్చాడు. మొత్తంగా ఒత్తిడి, నిలకడలేమి కారణంగా ప్రస్తుత సీజన్‌లో తమ జట్టు పరాజయాల బాట పట్టిందని తెలిపాడు. 
చదవండి: కింగ్స్‌ ఫైట్‌లో గెలుపెవరిది..? రికార్డులు ఎలా ఉన్నాయంటే..?

Poll
Loading...
మరిన్ని వార్తలు