Mumbai Indians: జహీర్‌ ఖాన్‌, జయవర్ధనేలకు కీలక బాధ్యతలు

14 Sep, 2022 15:20 IST|Sakshi

ఫైవ్‌ టైమ్‌ ఐపీఎల్‌ ఛాంపియన్‌ ముంబై ఇండియన్స్‌.. తమ నాన్‌ ప్లేయింగ్‌ బృందంలో కీలక మార్పులు చేసింది. ప్రధాన కోచ్‌ మహేళ జయవర్థనేతో పాటు ఫ్రాంచైజీ క్రికెట్‌ ఆపరేషన్స్‌ హెడ్‌ జహీర్‌ ఖాన్‌కు ప్రమోషన్ కల్పించి అత్యంత కీలక బాధ్యతలు అప్పజెప్పింది. జయవర్దనేకు ముంబై ఇండియన్స్‌ (ఎంఐ) గ్రూప్‌ గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ పదవి అప్పజెప్పిన యాజమాన్యం.. జహీర్ ఖాన్‌ను గ్లోబల్ హెడ్ ఆఫ్ క్రికెట్ డెవలప్‌మెంట్‌గా ప్రమోట్‌ చేసింది. ఈ విషయాన్ని ముంబై ఇండియన్స్ తమ అధికారిక ట్విటర్ ఖాతా ద్వారా వెల్లడించింది. 

ఎంఐ యాజమాన్యం ఖాళీ అయిన జయవర్ధనే, జాక్‌ల స్థానాలకు త్వరలో భర్తీ చేయనుంది. జయవర్ధనే 2017 నుంచి ముంబై ఇండియన్స్‌ హెడ్‌ కోచ్ గా పని చేస్తుండగా.. జహీర్‌ ఖాన్‌ 2019లో ఆ జట్టు క్రికెట్‌ ఆపరేషన్స్‌ డైరెక్టర్‌గా నియమితుడయ్యాడు. 

జయవర్ధనే, జహీర్‌ ఖాన్‌ కొత్త బాధ్యతలేంటి..
ఎంఐ గ్రూప్‌ గ్లోబల్ హెడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్‌గా బాధ్యతలు చేపట్టనున్న జయవర్ధనే.. కొత్త పాత్రలో ముంబై ఇండియన్స్ (ఐపీఎల్) తో పాటు ఎంఐ ఎమిరేట్స్ (ఇంటర్నేషనల్ లీగ్ టీ20),  ఎంఐ కేప్‌టౌన్ (సౌతాఫ్రికా) ఫ్రాంచైజీలకు సంబంధించిన కోచింగ్ స్టాఫ్‌కు మార్గదర్శకుడిగా వ్యవహరిస్తాడు. అలాగే మూడు జట్ల స్టాఫ్, ప్లేయర్స్ రిక్రూట్‌మెంట్, స్ట్రాటజిక్ ప్లానింగ్ తదితర వ్యవహారాలు పర్యవేక్షిస్తాడు. 

జహీర్ విషయానికొస్తే.. ఇతను మూడు ఫ్రాంచైజీల ప్లేయర్స్ డెవలప్‌మెంట్, ప్రోగ్రామ్ డెవలప్‌మెంట్, అలాగే న్యూ టాలెంట్‌ అన్వేషణ వంటి పలు కీలక బాధ్యతలు చూస్తాడు. 

మరిన్ని వార్తలు