మహేంద్రుడి మాయాజాలం

16 Aug, 2020 03:49 IST|Sakshi

‘19:29 గంటల సమయం నుంచి నన్ను రిటైర్‌ అయినట్లుగా పరిగణించగలరు’... వీడ్కోలు చెబుతున్నప్పుడు కూడా అందరికంటే అదే భిన్నమైన శైలి. లేదంటే ఈ తరహాలో ఎవరైనా ఇలా ప్రకటించినట్లు మీకు గుర్తుందా! ధోనిపై ఇప్పటికే ఒక బయోపిక్‌ వచ్చేసింది. అయినా సరే అంతకు మించి మరో సినిమాకు సరిపడే డ్రామా అతని కెరీర్‌లో ఉంది. ఎక్కడో వెనుకబడిన రాంచీనుంచి వచ్చిన నేపథ్యం... రైల్వేలో టికెట్‌ ఇన్‌స్పెక్టర్‌గా పని చేయడం... ఆ తర్వాత అనూహ్యంగా అంది వచ్చిన అవకాశం... జులపాల జుట్టుతో టార్జాన్‌ లుక్‌...బెదురు లేని బ్యాటింగ్, భీకర హిట్టింగ్‌...కొద్ది రోజులకే కెప్టెన్‌గా మారి టి20 ప్రపంచ కప్‌ గెలిపించడం... ఇలా ధోని కథలో ఆసక్తికర మలుపులెన్నో. గణాంకాలను అందని ఘనతలెన్నో... బ్యాట్స్‌మన్‌గా అద్భుత టెక్నిక్‌ లేకపోయినా...వికెట్‌ కీపింగ్‌ సాంప్రదాయ శైలికి భిన్నంగా ఉన్నా తను మారలేదు, మారే ప్రయత్నం చేయలేదు. అదే ధోనిని అందరికంటే ప్రత్యేకంగా నిలబెట్టింది. 

వన్డే బ్యాట్స్‌మన్‌గా పది వేలకు పైగా పరుగులు సాధించినా... ధోని అందరి మదిలో ‘కెప్టెన్‌ కూల్‌’గానే ఎక్కువగా నిలిచిపోయాడు. అతని నాయకత్వ లక్షణాలు భారత్‌కు ఎన్నో అద్భుత విజయాలు అందించాయి. 2007లో టి20 ప్రపంచ కప్, ఆ తర్వాత భారత అభిమానులంతా కలలు గన్న వన్డే వరల్డ్‌ కప్‌ (2011)లతో తన ఘనతను లిఖించుకున్న ఎమ్మెస్‌ 2013లో చాంపియన్‌ ట్రోఫీని కూడా సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు. మూడు ఐసీసీ టోర్నీలను గెలిచిన ఏకైక కెప్టెన్‌గా నిలిచిపోయాడు. మైదానంలో ధోని కెప్టెన్సీ ప్రతిభకు ఉదాహరణగా నిలిచిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. ప్రత్యర్థి జట్లపై వ్యూహ ప్రతివ్యూహాలు పన్నడంలో, ఎక్కడా సంయమనం కోల్పోకుండా మైదానంలో ప్రశాంతంగా జట్టును నడిపించడంలో అతనికి అతనే సాటి.
 
5 ఏప్రిల్‌ 2005...మన  విశాఖపట్నంలో పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌ ధోని సత్తాను ప్రపంచానికి పరిచయం చేసింది. 123 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో పాక్‌పై అతను చేసిన 148 పరుగులకు ప్రపంచం ఫిదా అయిపోయింది. అప్పటినుంచి ఆ బ్యాట్‌నుంచి ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌లు జాలువారాయి. అదే ఏడాది జైపూర్‌లో ఏకంగా 10 సిక్సర్లతో విరుచుకు పడి అజేయంగా చేసిన 183 పరుగులు కెరీర్‌లో అత్యుత్తమంగా నిలిచిపోగా...మరెన్నో చిరస్మరణీయ ప్రదర్శనలు మహిని మన మనసుల్లో నిలిచిపోయేలా చేశాయి.  

ఒక వీడ్కోలు మ్యాచ్‌ కావాలని... ఆఖరి రోజు మైదానంలో సహచరుల జయజయధ్వానాల మధ్య తప్పుకోవాలనే కోరికలు ధోనికి ఎప్పుడూ లేవు. అతను ఏదో రోజు నిశ్శబ్దంగా నిష్క్రమిస్తాడని అందరికీ తెలుసు. ఇప్పుడు కూడా అదే జరిగింది. టెస్టులనుంచి రిటైర్మెంట్‌ ప్రకటించినట్లు ఏకవాక్యంతో అతను తన అంతర్జాతీయ ఆటను ముగించాడు. అందుకు ఈ ‘లెఫ్టినెంట్‌ కల్నల్‌’ భారత స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఎంచుకున్నాడు. ఇక అతని మెరుపులు ఐపీఎల్‌లోనే చూసేందుకు సిద్ధం కండి! 2008, 2009లలో అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) వన్డే ప్లేయర్‌ ఆఫ్‌ ద ఇయర్‌ అవార్డులు సాధించాడు. వరుసగా రెండేళ్లు ఈ అవార్డు గెల్చుకున్న తొలి ప్లేయర్‌గా గుర్తింపు పొందాడు.

ఘనతలు, అవార్డులు 
► 2007లో దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’ అందుకున్నాడు.
► 2009లో దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మశ్రీ’... 2018లో దేశ మూడో అత్యున్నత పౌర పురస్కారం ‘పద్మ భూషణ్‌’ అందుకున్నాడు.

ధోని ఫినిషర్‌ 
66 విజయవంతమైన లక్ష్య ఛేదనలో 66 సార్లు నాటౌట్‌గా నిలిచాడు (47 వన్డేల్లో; 15 టి20ల్లో; 4 టెస్టుల్లో) 
43  మ్యాచ్‌లో 43 సార్లు విన్నింగ్‌ రన్స్‌ కొట్టాడు (30 వన్డేల్లో; 10 టి20ల్లో; 3 టెస్టుల్లో)
13 మ్యాచ్‌ను 13 సార్లు సిక్సర్‌తో ముగించాడు (9 వన్డేల్లో; 3 టి20ల్లో; ఒకసారి టెస్టులో) 

ధోని కెప్టెన్సీ రికార్డు 
ఆడిన వన్డేలు: 200, గెలిచినవి: 110, ఓడినవి: 74; టై: 5, ఫలితం రానివి: 11
ఆడిన టెస్టులు: 60, గెలిచినవి: 27, ఓడినవి: 18; డ్రా: 15
ఆడిన టి20లు: 72, గెలిచినవి: 42, ఓడినవి: 28

ధోని పేరిట ప్రపంచ రికార్డులు... 
► వన్డేల్లో అత్యధికసార్లు నాటౌట్‌గా నిలిచిన ప్లేయర్‌ (84) 
► వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన వికెట్‌ కీపర్‌ (183 నాటౌట్‌) 
► వన్డేల్లో అత్యధిక స్టంపింగ్స్‌ చేసిన కీపర్‌ (123) 
► అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక స్టంపింగ్స్‌ చేసిన కీపర్‌ (195) 
► అత్యధిక అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కెప్టెన్‌గా వ్యవహరించిన క్రికెటర్‌ (332 మ్యాచ్‌లు)
► టి20 ప్రపంచకప్‌ చరిత్రలో ఒక జట్టుకు అత్యధికంగా ఆరుసార్లు కెప్టెన్‌గా వ్యవహరించిన ఏకైక ప్లేయర్‌ (6 సార్లు; 2007, 2009, 2010, 2012, 2014, 2016). 

► ‘అద్భుత కెరీర్‌ ముగించిన ఎమ్మెస్‌ ధోనికి అభినందనలు. మీరు వదిలి వెళుతున్న క్రికెట్‌ వారసత్వం క్రికెట్‌ ప్రేమికులు, ఔత్సాహికులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది. భవిష్యత్తులో అంతా మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నా’ 
– వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి

► ‘భారత క్రికెట్‌కు నువ్వు అందించిన సేవలు ఎప్పటికీ మరచిపోలేనివి. నీతో కలిసి 2011 వరల్డ్‌ కప్‌ సాధించిన నా జీవితంలో మధుర ఘట్టం. నీ రెండో ఇన్నింగ్స్‌ బాగా సాగాలని కోరుకుంటున్నా’ 
– సచిన్‌ టెండూల్కర్‌

► ‘ప్రతీ క్రికెటర్‌ ఏదో ఒక రోజు తన ప్రయాణం ముగించాల్సిందే. అయితే నీకు అత్యంత ఆత్మీయులు అలా చేసినప్పుడు భావోద్వేగాలు సహజం. నీవు దేశానికి చేసింది ప్రతీ ఒక్కరి మదిలో గుర్తుండిపోతుంది. కానీ మన మధ్య పరస్పర గౌరవం నా హృదయంలో నిలిచిపోయింది. ఈ ప్రపంచం ఎన్నో ఘనతలను చూసింది. అయితే దాని రూపాన్ని నేను చూశాను’ 
–విరాట్‌ కోహ్లి

► ‘భారత క్రికెట్‌లో ఒక శకం ముగిసింది. ప్రపంచ క్రికెట్‌లో అతనో అద్భుతమైన ఆటగాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో అతని నాయకత్వ లక్షణాలకు మరెవరూ సాటి రారు. వన్డేల్లో అతని బ్యాటింగ్‌ గురించి ఎంత చెప్పినా తక్కువే’ 
– సౌరవ్‌ గంగూలీ

► ‘ఎలాంటి ఫిర్యాదులు లేకుండా ధోని కెరీర్‌ ముగిస్తున్నాడు. డ్రెస్సింగ్‌ రూమ్‌ సహచరుడిగా నీలాంటి ప్రొఫెషనల్‌తో కలిసి పని చేయడం నాకు దక్కిన గౌరవం. భారత అత్యుత్తమ క్రికెటర్లలో ఒకడిగా నిలిచిన ధోనికి సెల్యూట్‌’  
–రవిశాస్త్రి

► ‘ధోని లాంటి ఆటగాడు రావడం అంటే మిషన్‌ ఇంపాజిబుల్‌. ఎమ్మెస్‌ లాంటి వాడు గతంలోనూ, ఇప్పుడూ లేరు. ఇంకెప్పుడూ రారు. ఆటగాళ్లంతా వచ్చి పోతుంటారు కానీ అతనంత ప్రశాంతంగా ఎవరూ కనిపించరు. ఎందరో క్రికెట్‌ అభిమానుల కుటుంబ సభ్యుడిగా ధోని మారిపోయాడు. ఓం ఫినిషాయనమ’ 
–వీరేంద్ర సెహ్వాగ్‌

► ‘గొప్ప కెరీర్‌ను ముగించినందుకు ధోనికి నా అభినందనలు. నీతో కలిసి ఆడటం నాకూ గౌరవకారణం. నాయకుడిగా నీ ప్రశాంత శైలితో అందించిన విజయాలు ఎప్పటికీ మధురానుభూతులే’ 
– అనిల్‌ కుంబ్లే

► ‘చిన్న పట్టణంనుంచి వచ్చి మ్యాచ్‌ విన్నర్‌గా, గొప్ప నాయకుడిగా ఎదిగిన ధోని ప్రయాణం అద్భుతం. నువ్వు అందించిన జ్ఞాపకాలకు కృతజ్ఞతలు. నీతో కలిసి ఆడిన క్షణాలు ఎప్పటికీ మరచిపోలేను’ 
–వీవీఎస్‌ లక్ష్మణ్‌   

మరిన్ని వార్తలు