పాండ్యాది చెత్త నిర్ణయం.. నంబర్‌ 1 బౌలర్‌ విషయంలో ఎందుకలా? హుడాను మాత్రం..

30 Jan, 2023 13:53 IST|Sakshi
చహల్‌- పాండ్యా

India vs New Zealand, 2nd T20I: న్యూజిలాండ్‌తో రెండో టీ20లో టీమిండియా స్పిన్నర్‌ యజువేంద్ర చహల్‌ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. లక్నోలో జరిగిన ఆదివారం నాటి మ్యాచ్‌లో రెండు ఓవర్ల బౌలింగ్‌లో కేవలం నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి ఒక వికెట్‌ పడగొట్టాడు. ప్రమాదకర బ్యాటర్‌ ఫిన్‌ అలెన్‌ను నాలుగో ఓవర్లోనే పెవిలియన్‌కు పంపి టీమిండియాకు శుభారంభం అందించాడు.

పొదుపుగా బౌలింగ్‌
కివీస్‌ ఇన్నింగ్స్‌లో భాగంగా చహల్‌ వేసిన ఈ మొదటి ఓవర్లో ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా ప్రత్యర్థి బ్యాటర్లను తిప్పలు పెట్టాడు. అలాగే ఓ వికెట్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ ఆరో ఓవర్లో బరిలోకి దిగిన యుజీ.. 4 పరుగులు మాత్రమే ఇచ్చి పొదుపుగా బౌలింగ్‌ చేశాడు.

కానీ.. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా మాత్రం ఆ తర్వాత చహల్‌ చేతికి బంతినివ్వలేదు. నాలుగు ఓవర్ల బౌలింగ్‌ కోటా పూర్తిచేయనివ్వలేదు. ఈ విషయంపై స్పందించిన టీమిండియా మాజీ ఓపెనర్‌ గౌతం గంభీర్‌ హార్దిక్‌ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు.

చెత్త నిర్ణయం
చహల్‌ విషయంలో కెప్టెన్‌ నిర్ణయం తనని ఆశ్చర్యపరిచిందన్న గౌతీ.. టీ20 ఫార్మాట్లో జట్టులో నంబర్‌ స్పిన్నర్‌గా ఉన్న బౌలర్‌ను ఎలా పక్కనపెడతారని ప్రశ్నించాడు. ఈ మేరకు బ్రాడ్‌కాస్టర్‌ స్టార్‌ స్పోర్ట్స్‌ షోలో మ్యాచ్‌ అనంతర చర్చలో తన అభిప్రాయాన్ని పంచుకున్నాడు.

‘‘నాకైతే అమితాశ్చర్యం కలిగింది. ఇలాంటి వికెట్‌పై ఈ నిర్ణయం తీసుకోవడమెలా జరిగిందన్న ప్రశ్నకు నా దగ్గరైతే సమాధానం ఉండదు. టీ20 ఫార్మాట్లో మీకున్న నంబర్‌ 1 స్పిన్నర్‌ చహల్‌. అలాంటిది తనతో రెండు ఓవర్లే వేయించాడు.

అప్పటికే తను ఫిన్‌ అలెన్‌ వంటి కీలక ఆటగాడిని అవుట్‌ చేశాడు. అయినా సరే బౌలింగ్‌ కోటా పూర్తి చేయనివ్వకపోవడం నాకైతే చెత్త నిర్ణయం అనిపిస్తోంది’’ అని గంభీర్‌.. హార్దిక్‌ పాండ్యాను విమర్శించాడు. 

హుడా విషయంలో అలా ఎలా?
చహల్‌కు రెండు ఓవర్లు ఇవ్వడమే ఒక ఎత్తైతే.. దీపక్‌ హుడాతో నాలుగు ఓవర్లు వేయించడం తనను మరింత ఆశ్చర్యానికి గురిచేసిందంటూ గంభీర్‌ విస్మయం వ్యక్తం చేశాడు. ‘‘యువ బౌలర్లు అర్ష్‌దీప్‌ సింగ్‌ లేదంటే శివం మావికి అవకాశం ఇవ్వాలనుకోవడంలో తప్పు లేదు.

అలాంటపుడు చహల్‌తో మొదటి, చివరి ఓవర్లు వేయిస్తే సరి. లక్నో పిచ్‌పై అతడు న్యూజిలాండ్‌ను 80 లేదంటే 85 పరుగులకే పరిమితం చేయడంలో కీలక పాత్ర పోషించేవాడు. కానీ హుడాతో 4 ఓవర్లు వేయించారు. అక్కడే ట్రిక్‌ మిస్‌ అయింది’’అని గంభీర్‌ అభిప్రాయపడ్డాడు.

ఎక్కువ పరుగులు ఇచ్చింది ఎవరంటే?
ఈ మ్యాచ్‌లో స్పిన్‌ ఆల్‌రౌండర్‌ దీపక్‌ హుడా 4 ఓవర్ల బౌలింగ్‌లో 17 పరుగులు ఇచ్చి ఒక వికెట్‌ తీశాడు. ఇక అందరికంటే అత్యధికంగా పేస్‌ ఆల్‌రౌండర్‌, కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా 4 ఓవర్లలో 25 పరుగులు సమర్పించుకుని ఒక వికెట్‌ పడగొట్టగలిగాడు. మిగతా వాళ్లలో వాషింగ్టన్‌ సుందర్‌కు ఒకటి, కుల్దీప్‌ యాదవ్‌కు ఒకటి, అర్ష్‌దీప్‌ సింగ్‌కు రెండు వికెట్లు దక్కాయి.

ఇదిలా ఉంటే.. కివీస్‌తో రెండో మ్యాచ్‌లో ఒక వికెట్‌ తీసిన చహల్‌.. అంతర్జాతీయ టీ20లలో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా అవతరించాడు. ప్రస్తుతం 91 వికెట్లు తన ఖాతాలో ఉన్నాయి. ఇక రెండో టీ20లో భారత్‌ 6 వికెట్ల తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.

చదవండి: Hardik Pandya: ఇదేం పిచ్‌.. షాక్‌కు గురయ్యాం.. టీ20 కోసం చేసింది కాదు.. క్యూరేటర్లు ఇకనైనా..
IND vs NZ: వన్డేల్లో హిట్‌.. టీ20ల్లో ఫట్‌! గిల్‌కు ఏమైంది? ఇకనైనా అతడిని..

మరిన్ని వార్తలు