ఇంగ్లండ్‌ ఓడినా.. మలాన్‌ నయా రికార్డు లిఖించాడు

21 Mar, 2021 19:11 IST|Sakshi

అహ్మదాబాద్‌: ఇంగ్లండ్‌ పించ్‌ హిట్టర్‌ డేవిడ్‌ మలాన్‌ నయా రికార్డు లిఖించాడు. అంతర్జాతీయ టీ20ల్లో వేగవంతంగా వెయ్యి పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. ఈ క్రమంలోనే పాకిస్తాన్‌ క్రికెటర్‌ బాబర్‌ అజామ్‌ రికార్డును మలాన్‌ బ్రేక్‌ చేశాడు.  టీమిండియాతో శనివారం జరిగిన ఆఖరి టీ20ల్లో మలాన్‌ 46 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్‌లు సాయంతో 68 పరుగులు సాధించాడు. ఫలితంగా అంతర్జాతీ టీ20ల్లో వెయ్యి పరుగుల మైలురాయిని చేరాడు. అదే సమయంలో అజామ్‌ను రికార్డును చెరిపేశాడు. అజామ్‌ 26 ఇన్నింగ్స్‌ల్లో 1000 అంతర్జాతీయ టీ20 పరుగులు సాధిస్తే, మలాన్‌ 24వ ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మార్కును చేరాడు. ఈ జాబితాలో వీరిద్దరి తర్వాత స్థానంలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఉన్నాడు. కోహ్లి 27 ఇన్నింగ్స్‌ల్లో వెయ్యి పరుగుల్ని సాధించాడు. ఇక కేఎల్‌ రాహుల్(టీమిండియా)‌, అరోన్‌ ఫించ్‌(ఆస్ట్రేలియా)లు 29 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ సాధించారు. 

ఇంగ్లండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను టీమిండియా 3-2 తేడాతో కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. నిన్న జరిగిన చివరి మ్యాచ్‌లో టీమిండియా 36 పరుగుల తేడాతో విజయం సాధించడంతో సిరీస్‌ను దక్కించుకుంది.  ఫలితంగా వరుసగా ఆరో టీ20 సిరీస్‌ను టీమిండియా ఖాతాలో వేసుకుంది. ఆఖరి మ్యాచ్‌లో టీమిండియా తొలుత బ్యాటింగ్‌ చేసి 224 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన కెప్టెన్‌ కోహ్లి(80 నాటౌట్‌; 52 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) దుమ్ములేపగా, రోహిత్‌ శర్మ(64; 34 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) విధ్వంసకర ఆటతో అదరగొట్టాడు. ఈ జోడి తొలి వికెట్‌కు 94 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి శుభారంభాన్ని అందించింది. ఆపై సూర్యకుమార్‌ యాదవ్‌(32; 17 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) ధాటిగా బ్యాటింగ్‌ చేయగా, హార్దిక్‌ పాండ్యా(39 నాటౌట్‌; 17 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) టచ్‌లోకి వచ్చాడు. ఆపై ఇంగ్లండ్‌ను 188 పరుగులకే పరిమితం చేసిన టీమిండియా ఘన విజయాన్ని సాధించింది. 

మరిన్ని వార్తలు