Malaysia Open వాయిదా: సైనా, శ్రీకాంత్‌కు షాక్‌!

8 May, 2021 03:06 IST|Sakshi

భారత బ్యాడ్మింటన్‌ స్టార్‌ ప్లేయర్లు సైనా, శ్రీకాంత్‌ ఒలింపిక్స్‌ అర్హత అవకాశాలపై దెబ్బ

కౌలాలంపూర్‌: మలేసియాలో కరోనా వైరస్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మలేసియా ఓపెన్‌ సూపర్‌–750 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌ను నిరవధికంగా వాయిదా వేస్నుట్లు ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) ప్రకటించింది. షెడ్యూల్‌ ప్రకారం ఈ టోర్నీ మే 25 నుంచి 30 వరకు కౌలాలంపూర్‌లో జరగాల్సింది. టోక్యో ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌ టోర్నమెంట్‌లలో భాగమైన మలేసియా ఓపెన్‌ వాయిదా పడటంతో భారత స్టార్‌ ప్లేయర్లు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్‌లకు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందే అవకాశాలు అత్యంత క్లిష్టంగా మారాయి.

సింగిల్స్‌ విభాగంలో ఒక దేశం తరఫున గరిష్టంగా రెండు బెర్త్‌లు ఖరారు కావాలంటే ఆ దేశానికి చెందిన ఆటగాళ్లు టాప్‌–16 ర్యాంకింగ్స్‌లో ఉండాలి. ప్రస్తుతం పురుషుల సింగిల్స్‌లో భారత్‌ నుంచి సాయిప్రణీత్‌ 13వ ర్యాంక్‌లో, శ్రీకాంత్‌ 20వ ర్యాంక్‌లో ఉన్నారు. మహిళల సింగిల్స్‌లో భారత్‌ నుంచి పీవీ సింధు ఏడో ర్యాంక్‌లో, సైనా నెహ్వాల్‌ 22వ ర్యాంక్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలో సింగిల్స్‌ నుంచి సాయిప్రణీత్‌కు, సింధుకు ‘టోక్యో’ బెర్త్‌లు ఖరారయినట్టే.

మలేసియా ఓపెన్‌ వాయిదా పడటంతో టోక్యో ఒలింపిక్స్‌ క్వాలిఫయింగ్‌లో భాగంగా ప్రస్తుతం ఒకే ఒక టోర్నీ సింగపూర్‌ ఓపెన్‌ (జూన్‌ 1–6) మిగిలి ఉంది. ‘టోక్యో’ బెర్త్‌లు దక్కించుకోవాలంటే సింగపూర్‌ ఓపెన్‌లో శ్రీకాంత్, సైనా తప్పనిసరిగా టైటిల్స్‌ సాధించడంతోపాటు ఇతర క్రీడాకారుల ఫలితాల కోసం వేచి చూడాలి. అయితే ప్రస్తుత కరోనా వైరస్‌ పరిస్థితుల నేపథ్యంలో సింగపూర్‌ ఓపెన్‌ కూడా జరుగుతుందో వాయిదా పడుతుందో తేలియదు. మరోవైపు మలేసియా ఓపెన్‌ వాయిదా పడటంతో టోక్యో ఒలింపిక్స్‌ అర్హత నిబంధనలపై క్లారిటీ ఇవ్వాలని బీడబ్ల్యూఎఫ్‌ను భారత బ్యాడ్మింటన్‌ సంఘం కోరింది.

మరిన్ని వార్తలు