తొలి ఆసియన్‌ క్రికెటర్‌గా రికార్డు

11 Oct, 2020 16:47 IST|Sakshi

కరాచీ: పాకిస్తాన్‌ వెటరన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్‌ అరుదైన మైలురాయిని నమోదు చేశాడు. టీ 20 క్రికెట్‌లో పదివేల పరుగుల్ని పూర్తి చేసుకున్న క్రికెటర్ల జాబితాలో నిలిచాడు. కాగా, ఈ ఘనత సాధించిన తొలి ఆసియన్‌ క్రికెటర్‌గా మాలిక్‌ రికార్డు నెలకొల్పాడు.  పాకిస్తాన్‌ నేషనల్‌ టీ20 కప్‌లో భాగంగా  కైబర్‌ పఖ్‌తున్‌క్వా జట్టు తరఫున ఆడుతున్న మాలిక్‌.. శనివారం బాలోచిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో  ఈ ఫీట్‌ సాధించాడు.  ఆ మ్యాచ్‌లో 44బంతుల్లో  77 పరుగులు సాధించిన మాలిక్‌.. పదివేల టీ20 పరుగుల్ని ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం మాలిక్‌ 395 టీ20 మ్యాచ్‌ల్లో 10,027 పరుగులతో ఉన్నాడు. (ఆ ఇద్దరి కెప్టెన్లకు థాంక్స్‌: దినేశ్‌ కార్తీక్‌)

ఇక ఓవరాల్‌గా ఈ జాబితాలో వెస్టిండీస్‌ స్టార్‌ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌ 13, 296 పరుగులతో టాప్‌లో ఉన్నాడు. 404 టీ20 మ్యాచ్‌ల్లో గేల్‌ ఈ రికార్డు సాధించాడు. ఆ తర్వాత స్థానంలో మరొక వెస్టిండీస్‌ స్టార్‌ పొలార్డ్‌ ఉన్నాడు.  518 టీ20 మ్యాచ్‌ల్లో 10, 370 పరుగుల్ని నమోదు చేశాడు. ఆ తర్వాత స్థానంలో మాలిక్‌ నిలిచాడు. కాగా,ఆసియా నుంచి ఈ ఫీట్‌ సాధించిన తొలి క్రికెటర్‌గా మాలిక్‌ గుర్తింపు పొందాడు. అయితే పాకిస్తాన్‌ తరఫున 116 టీ20 మ్యాచ్‌లు ఆడిన మాలిక్‌.. 2,335 పరుగులు సాధించగా, మిగతా పరుగుల్ని  వేర్వేరు ఫ్రాంచైజీలకు క్రికెట్‌ ఆడుతూ సాధించాడు.
 

మరిన్ని వార్తలు