షమీ భార్య జహాన్‌కు వేధింపులు

26 Nov, 2020 12:29 IST|Sakshi

కోల్‌కతా:  టీమిండియా క్రికెటర్‌ మహ్మద్‌ షమీ నుంచి విడిపోయి కూతురుతో కలిసి వేరుగా ఉంటున్న హసీన్‌ జహాన్‌ను వేధిస్తున్న ఓ వ్యక్తిని ఎట్టకేలకు అరెస్టు చేశారు. కోల్‌కతాకు చెందిన ఓ 25 ఏళ్ల వ్యక్తి జహాన్‌కు తరచు ఫోన్‌ కాల్స్‌ చేస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. ఆ క్రమంలోనే భారీ మొత్తంలో డబ్బు డిమాండ్‌ చేయడం మొదలుపెట్టాడు. దీనిపై గతంలోనే పోలీసులకు జహాన్‌ ఫిర్యాదు చేయగా అతన్నిఅరెస్ట్‌ చేశారు. ‘ ఆ వ్యక్తి పదే పదే కాల్‌ చేయడంతో జహాన్‌ సాయం కోరింది. దానిలో భాగంగా అతనిపై  ఫిర్యాదు చేసింది. భారీగా డబ్బులు డిమాండ్‌ చేస్తున్నాడని  ఫిర్యాదులో పేర్కొన్నారు. (కోహ్లిని ఊరిస్తున్న తొలి క్రికెటర్‌ రికార్డు)

ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే వ్యక్తిగత ఫోటోలు సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరింపులకు గురి చేశాడు. ఫోన్‌ చేసిన ప్రతీసారి ఆమెను తిట్టేవాడు. ఆ కాల్స్‌ను ఎత్తకపోతే ఫోన్లు చేస్తూనే ఉండేవాడు. ఆ వేధింపులు భరించలేక మమ్మల్ని ఆశ్రయించింది. మంగళవారం రాత్రి అతన్ని అరెస్ట్‌  చేశాం. దర్యాప్తు కొనసాగుతోంది’ అని  పోలీస్‌ అధికారి ఒకరు తెలిపారు. రెండేళ్ల క్రితం షమీపై గృహ హింస కేసు పెట్టిన హసీన్.. అతను అక్రమ సంబంధాలు కలిగి ఉన్నాడని మీడియా ముందు చెప్పడమే కాకుండా మ్యాచ్ ఫిక్సింగ్‌‌కి పాల్పడుతున్నాడంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు గుప్పించింది. దాంతో.. షమీపై విచారణ జరిపించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అతడ్ని నిర్దోషిగా తేల్చగా.. ప్రస్తుతం ఈ ఇద్దరూ విడిగా ఉంటున్నారు. ప్రస్తుతం షమీ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు. (ఐసీసీ అవార్డుల నామినేషన్‌లో కోహ్లి డామినేషన్‌)

మరిన్ని వార్తలు