Cristiano Ronaldo: బంధం ముగిసింది.. రొనాల్డోతో మాంచెస్టర్‌ యునైటెడ్‌ తెగదెంపులు

23 Nov, 2022 12:25 IST|Sakshi

మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌తో పోర్చుగల్‌ ఫుట్‌బాల్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో బంధం ముగిసింది. ఇటీవలే పియర్స్‌ మోర్గాన్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో రొనాల్డో మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌ ఓనర్స్‌తో పాటు కోచ్‌ ఎరిక్‌ టెన్‌ హగ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. తనకు క్లబ్‌ ద్రోహం చేసిందనీ.. కొత్త మేనేజర్ ఎరిక్ టెన్ హాగ్ పట్ల తనకు ఏమాత్రం గౌరవం లేదని రొనాల్డో పేర్కొన్నాడు. ఈ ఇంటర్య్వూ వివాదాస్పదంగా మారింది. దీనిని సీరియస్‌గా తీసుకున్న మాంచెస్టర్‌ యునైటెడ్‌.. రొనాల్డోను వెంటనే క్లబ్‌ నుంచి బయటకు పంపుతున్నట్లు ట్విటర్‌లో తెలిపింది. 

"పరస్పర అంగీకారం ప్రకారం క్రిస్టియానో రొనాల్డోనూ వెంటనే క్లబ్‌ నుంచి తొలగిస్తున్నాం. ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో రొనాల్డో ఇచ్చిన రెండు స్పెల్స్‌కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం.'' అంటూ మాంచెస్టర్‌ వెల్లడించింది. ఇక రొనాల్డో మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌ తరపున 346 మ్యాచ్‌ల్లో 145 గోల్స్  కొట్టాడు. కాగా తొలిసారి రొనాల్డో 2003 నుంచి 2009 వరకు మాంచెస్టర్‌ యునైటెడ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత మళ్లీ 2021లో మాంచెస్టర్‌ యునైటెడ్‌కు తిరిగి వచ్చిన రొనాల్డో ఏడాది వ్యవధిలోనే క్లబ్‌ను వీడాల్సి వస్తోంది.

మాంచెస్టర్‌ యునైటెడ్‌ తనను తొలగించడంపై రొనాల్డో స్పందించాడు. "ఇది ముందే ఊహించాను. అయితే ఇంతకముందే జరిగిన పరస్పర అంగీకారం మేరకే నేను జట్టును వీడుతున్నా.  అయినా నాకు మాంచెస్టర్ యునైటెడ్ అంటే ప్రేమ.. వాళ్లు చూపించే అభిమానం ఎప్పటికి మరిచిపోలేను. నేను వేరే క్లబ్‌కు ఆడినా అవి ఎప్పటికీ మారవు. అయితే కొత్త సవాలును స్వీకరించేందుకు నాకు ఇదే సరైన సమయం . ఈ సీజన్‌తో పాటూ భవిష్యత్తులో కూడా మాంచెస్టర్‌ యునైటెడ్‌ విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నా" అంటూ తెలిపాడు.

ఇక రొనాల్డో ప్రస్తుతం ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో పాల్గొనేందుకు వచ్చాడు. పోర్చుగల్‌ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న రొనాల్డో ఎలాగైనా జట్టుకు కప్‌ అందించాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇక గ్రూప్‌-హెచ్‌లో ఉన్న పోర్చుగల్‌ ఘనా, ఉరుగ్వే, సౌత్‌ కొరియాలతో ఆడనుంది. గురువారం ఘనాతో పోర్చుగల్‌ అమితుమీ తేల్చుకోనుంది.

రొనాల్డోపై రెండు క్లబ్‌ మ్యాచ్‌ల నిషేధం  
అభిమానితో గొడవ పడి అతని ఫోన్‌ను విసిరేసినందుకు మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌ మాజీ ప్లేయర్‌ క్రిస్టియానో రొనాల్డోపై ఇంగ్లండ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ రెండు క్లబ్‌ మ్యాచ్‌ల నిషేధంతోపాటు 50 వేల పౌండ్ల జరిమానా విధించింది. గత ఏడాది ఏప్రిల్‌ 9న ఎవర్టన్‌తో జరిగిన ప్రీమియర్‌ లీగ్‌ మ్యాచ్‌లో మాంచెస్టర్‌  0–1తో ఓడిపోయిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. మాంచెస్టర్‌ యునైటెడ్‌ క్లబ్‌తో రొనాల్డో తెగదెంపులు చేసుకోవడంతో తదుపరి సీజన్‌లో అతను ఆడే కొత్త క్లబ్‌ జట్టుకు ఈ నిషేధం వర్తిస్తుంది.    

చదవండి: 'పగవాడికి కూడా ఈ కష్టం రాకూడదు'

FIFA WC: అర్జెంటీనాకు షాకిచ్చిన సౌదీ అరేబియా

మరిన్ని వార్తలు