భారమైన హృదయంతో బరిలోకి దిగాడు..

25 Oct, 2020 16:48 IST|Sakshi

దుబాయ్‌: సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో శనివారం జరిగిన మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ అనూహ్య విజయం సాధించింది. సన్‌రైజర్స్‌ గెలుస్తుందనుకునే తరుణంలో కింగ్స్‌ పంజాబ్‌ అద్భుతం చేసింది. 14 పరుగుల వ్యవధిలో ఏడు వికెట్లు సాధించిన పంజాబ్‌ 12 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. తద్వారా ప్లేఆఫ్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. కాగా,  నిన్నటి మ్యాచ్‌లో కింగ్స్‌ పంజాబ్‌ జట్టు మయాంక్‌ అగర్వాల్‌కు విశ్రాంతినిచ్చి మన్‌దీప్‌ సింగ్‌ను జట్టులోకి తీసుకుంది. రాహుల్‌తో కలిసి ఇన్నింగ్స్‌ ఆరంభించిన మన్‌దీప్‌ 17 పరుగులే చేశాడు. 

ఈ మ్యాచ్‌కు భారమైన హృదయంతోనే మన్‌దీప్‌ సిద్ధమయ్యాడు. అతని తండ్రి, మాజీ అథ్లెటిక్స్‌ హర్‌దేవ్‌ సింగ్‌ శుక్రవారం రాత్రి చనిపోయారు. అయితే స్వస్థలం వెళ్లలేని స్థితిలో ఉన్న మనదీప్‌ సింగ్‌.. అతని తండ్రి చివరి చూపును వీడియో కాల్‌లోనే చూసి నివాళులు అర్పించాడు. శనివారం నాటి మ్యాచ్‌లో మన్‌దీప్‌ తండ్రి మృతికి సంతాపంగా పంజాబ్‌ ఆటగాళ్లు నల్లరంగు రిబ్బన్లు ధరించి బరిలోకి దిగారు. గత మ్యాచ్‌లో మయాంక్‌ గాయపడటంతో మన్‌దీప్‌ తుది జట్టులోకి వచ్చాడు. 

తండ్రి చనిపోయిన బాధలో ఉన్న మన్‌దీప్‌ జట్టుకోసం ఓపెనర్‌గా బరిలోకి దిగాడని కింగ్స్‌ పంజాబ్‌ కొనియాడింది. ఇక మాజీ క్రికెటర్లు ఆకాశ్‌ చోప్రాతో పాటు సచిన్‌ టెండూల్కర్‌లు కూడా మన్‌దీప్‌ను కొనియాడారు. ఎంతో గుండె నిబ్బరం ఉన్న మన్‌దీప్‌ జట్టుకోసం సిద్ధం కావడం అతని అంకితభావానికి, ధైర్యానికి నిదర్శనమన్నాడు. ‘ మనకు ఇష్టమైన వ్యక్తిని కోల్పోవడం చాలా బాధిస్తుంది.

ఆ వ్యక్తికి తుది వీడ్కోలు చెప్పలేకపోతే ఇంకా కలిచివేస్తుంది. మన్‌దీప్‌కు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. వారి కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడ్ని ప్రార్థిస్తున్నా’ అని సచిన్‌ తెలిపాడు. ఇక కేకేఆర్‌ ఆటగాడు నితీష్‌ రాణా మావయ్య సురిందర్‌ సింగ్‌ కూడా రెండు రోజుల క్రితం మరణించారు. ఈ రెండు కుటుంబాలు విషాదం నుండి కోలుకోవాలని సచిన్‌ ఆకాంక్షించారు. అదే సమయంలో ఫ్యాన్స్‌ కూడా మన్‌దీప్‌ను కొనియాడుతున్నారు. కుటుంబంలో విషాదం నెలకొని ఉన్న పరిస్థితుల్లో మ్యాచ్‌ ఆడటం అతని చేసే పనిలో ఎంతటి అంకిత భావం ఉందో తెలియజేస్తుందని అభిమానులు కీర్తిస్తున్నారు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు