Manika Batra: నన్ను ఓడిపొమ్మన్నారు.. మనికాకు హైకోర్టులో ఊరట

24 Sep, 2021 08:22 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత స్టార్‌ టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) ప్లేయర్‌ మనిక బత్రాకు ఢిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. భారత టేబుల్‌ టెన్నిస్‌ సమాఖ్య (టీటీఎఫ్‌ఐ) ఎంపిక నిర్ణయంపై గురువారం స్టే విధించింది. జాతీయ శిబిరంలో పాల్గొన్న వారినే ఎంపిక చేయాలనే నిబంధనకు ఈ స్టే వర్తిస్తుంది. అంటే ఇకపై అంతర్జాతీయ టోర్నీలకు ప్రదర్శన ఆధారంగా ఎంపిక చేస్తారు. జాతీయ శిబిరానికి హాజరు, గైర్హాజరుతో సంబంధం ఉండదు. అలాగే మనిక చేసిన ఆరోపణలపై విచారణ చేపట్టాలని కూడా కోర్టు కేంద్ర క్రీడాశాఖను ఆదేశించింది.

కాగా ఒలింపిక్‌ క్వాలిఫయర్‌ మ్యాచ్‌ సందర్భంగా సుతీర్థ ముఖర్జీ కోసం జాతీయ కోచ్‌ సౌమ్యదీప్‌ రాయ్‌ తనను ఓడిపోవాలని సూచించారని మనిక ఆరోపించింది. హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఈ అంశాన్ని ప్రస్తావించింది. దీనిపై గురువారం విచారించిన జస్టిస్‌ రేఖ పల్లి టీటీఎఫ్‌ఐ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన సమాఖ్యకు నోటీసు జారీ చేయాల్సిందిగా ఆర్డర్‌ పాస్‌ చేస్తానని అన్నారు.

ఓ మేటి క్రీడాకారిణి ఆరోపణలపై తదుపరి చర్యలు చేపట్టకుండానే జాతీయ శిబిరంలో తప్పనిసరిగా పాల్గొంటేనే ఎంపిక చేస్తామని ఎలా అంటారని న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తరఫున వాదించిన న్యాయవాది క్రీడాశాఖ విచారణ చేపడుతుందని కోర్టుకు విన్నవించారు.   

చదవండి: Naomi Osaka: మళ్లీ ఎప్పుడు ఆడతానో తెలీదు.. నిరవధిక విరామం

మరిన్ని వార్తలు