అదనపు ఎస్పీగా నియమిస్తూ ముఖ్యమంత్రి బిరేన్‌ సింగ్‌ ప్రకటన

26 Jul, 2021 18:02 IST|Sakshi

న్యూఢిల్లీ: రజత పతకం గెలుపొంది విశ్వవేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన మీరాబాయి చానుకు సొంత రాష్ట్రం మణిపూర్‌ ప్రభుత్వం కానుకల వర్షం కురిపించింది. పతకం గెలిచిన రోజే రూ.కోటి నగదు బహుమతి ప్రకటించగా తాజాగా సోమవారం ఆమెకు అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగం స్పోర్ట్స్‌ కోటాలో ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అదనపు ఎస్పీగా చానును నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఎన్‌.బిరేన్‌ సింగ్‌ తెలిపారు. అయితే టోక్యో నుంచి స్వదేశానికి చాను సోమవారం చేరుకుంది. ఆమెకు ఢిల్లీ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది.

మణిపూర్‌కు చెందిన చాను ఒలింపిక్స్‌ పోటీల్లో 49 కిలోల వెయిట్‌ లిఫ్టింగ్ విభాగంలో సిల్వ‌ర్ మెడ‌ల్ గెలిచి సత్తా చాటింది. ఆమె గెలుపుపై దేశమంతా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే మణిపూర్‌ ప్రభుత్వం ఆమెకు రూ.కోటి నగదు బహుమతితో పాటు ఆ ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించింది. మీరాబాయి టోక్యో ఒలింపిక్స్‌లో ఏకంగా రజత పతకం హస్తగతం చేసుకొని మరో చరిత్రను లిఖించింది. ఒలింపిక్స్‌ వెయిట్‌లిఫ్టింగ్‌లో రజత పతకం నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణిగా... స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు తర్వాత విశ్వ క్రీడల్లో రజతం సాధించిన రెండో భారతీయ క్రీడాకారిణిగా 26 ఏళ్ల మీరాబాయి ఘనత వహించింది. 8 మంది వెయిట్‌లిఫ్టర్లు పాల్గొన్న 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను మొత్తం 202 కేజీలు బరువెత్తి రెండో స్థానంలో నిలిచింది. మీరాబాయి స్నాచ్‌లో 87 కేజీలు.. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 115 కేజీలు బరువెత్తింది.

మరిన్ని వార్తలు