ఖాళీ ఉన్నా... ఆడే అవకాశం ఇవ్వలేదు

12 Aug, 2020 08:10 IST|Sakshi

న్యూఢిల్లీ : భారత క్రికెట్‌ జట్టు మిడిల్‌ ఆర్డర్‌లో ఖాళీ ఉన్నా... తనకు అవకాశం ఇవ్వలేదంటూ భారత మాజీ క్రికెటర్‌ మనోజ్‌ తివారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఒక స్పోర్ట్స్‌ వెబ్‌సైట్‌కు ఇచ్చిన ఇంటర్యూలో అతడు తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి వివరించాడు. ‘2011–2012లో మేము ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాం. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో భారత మిడిల్‌ ఆర్డర్‌ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేకపోయింది. అంతేకాకుండా మిడిల్‌ ఆర్డర్‌లో బ్యాట్స్‌మన్‌కు ఒక ఖాళీ కూడా ఉంది. టీమ్‌ మేనేజ్‌మెంట్‌ నాకు అవకాశం ఇవ్వాలని భావించి ఉంటే తప్పకుండా ఇచ్చేది. కానీ వారు అలా భావించలేదు’ అని వ్యాఖ్యానించాడు.

అంతేకాకుండా సెంచరీతో జట్టును గెలిపించే ప్రదర్శన చేశాక ఎవరికైనా సరే జట్టులో తన స్థానం సుస్థిరం అనే అనిపిస్తుందని... అయితే తనకు మాత్రం ఆ విధంగా జరగలేదని... తర్వాత తనను ఏకంగా 14 మ్యాచ్‌లపాటు బెంచ్‌కే పరిమితం చేయడం షాక్‌కు గురిచేసిందని వాపోయాడు. ఆసీస్‌ పర్యటన కంటే ముందు వెస్టిండీస్‌తో భారత్‌ వన్డే సిరీస్‌ ఆడింది. అందులో భాగంగా జరిగిన ఐదో వన్డేలో మనోజ్‌ తివారి శతకం (104) సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆ మ్యాచ్‌లో భారత్‌ 34 పరుగుల తేడాతో గెలుపొందింది.(ఆరోజు సచిన్‌ నక్కతోకను తొక్కాడు : నెహ్రా)

మాజీ కెప్టెన్, ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీని మాత్రం మనోజ్‌ ప్రశంసలతో ముంచెత్తాడు. 2011 ప్రపంచ కప్‌ను భారత చేజిక్కించుకోవడంలో గంగూలీ పాత్ర కూడా ఉందన్నాడు. గంగూలీ నాయకుడిగా ఉన్నప్పుడే ప్రపంచ కప్‌ను గెలిచేలా యువరాజ్‌ సింగ్, గౌతమ్‌ గంభీర్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్‌ ఖాన్, ఆశీష్‌ నెహ్రా, హర్భజన్‌ సింగ్‌లతో కూడిన జట్టును తయారు చేశాడన్నాడు. వారిని 2011 ప్రపంచ కప్‌లో అప్పటి సారథి ధోని సమర్థంగా ఉపయోగించుకున్నాడని పేర్కొన్నాడు. భారత్‌ తరఫున 12 వన్డేలు ఆడిన మనోజ్‌ తివారి 287 పరుగులు చేశాడు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా