FIFA WC 2022: పీలేకు గౌరవం.. మారడోనాకు అవమానం!

6 Dec, 2022 12:44 IST|Sakshi

పీలే, డీగో మారడోనా.. ఇద్దరు దిగ్గజాలే. ఫుట్‌బాల్‌లో తమకంటూ ప్రత్యేక చరిత్రను లిఖించుకున్నారు. ఒకరు బ్రెజిల్‌ను మూడుసార్లు చాంపియన్‌గా నిలిపితే.. మరొకరు అర్జెంటీనాను ఒకసారి విశ్వవిజేతగా నిలపడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ ఇద్దరిలో మారడోనా రెండేళ్ల క్రితమే ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్లాడు.

ప్రస్తుతం పీలే పెద్ద పేగు క్యాన్సర్‌తో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నాడు. ఇటీవలే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించిందని వార్తలు రావడంతో అభిమానుల్లో ఆందోళన మొదలైంది. కానీ తనకేం కాలేదని.. బాగానే ఉన్నట్లు పీలే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొనడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.


ఖతర్‌ వేదికగా జరుగుతున్న ఫిఫా వరల్డ్‌కప్‌లో సోమవారం బ్రెజిల్‌, దక్షిణ కొరియాల మధ్య ప్రీ క్వార్టర్స్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో బ్రెజిల్‌ 4-1 తేడాతో కొరియాను చిత్తు చేసి క్వార్టర్స్‌లో అడుగుపెట్టింది. కాగా ఈ మ్యాచ్‌ను పీలే ఆసుపత్రి నుంచి వీక్షించినట్లు ఆయన కూతురు పేర్కొంది. మ్యాచ్‌ విజయం కూడా పీలేకు అంకితమిచ్చిన బ్రెజిల్‌ జట్టు ఆయన తొందరగా కోలుకోవాలని కోరుకుంది. ఇక మ్యాచ్‌ జరిగిన స్టేడియం 974లో బ్రెజిల్‌ ఫ్యాన్స్‌.. పీలే తొందరగా కోలుకోవాలంటూ పెద్ద ఎత్తున బ్యానర్లు, కటౌట్‌లు ప్రదర్శించారు. బ్రెజిల్‌ గోల్‌ కొట్టిన ప్రతీసారి పీలే.. పీలే అంటూ గట్టిగా అరిచారు. అలా పీలేపై తమకున్న గౌరవాన్ని గొప్పగా చాటుకున్నారు.

పీలేకు ఎక్కడైతే గౌరవం లభించిందో అక్కడే మారడోనాకు అవమానం జరుగుతుందంటూ మారడోనా కూతురు జియానిన్ని మారడోనా పేర్కొనడం ఆసక్తి కలిగించింది. అయితే అర్జెంటీనా జట్టును తప్పుబట్టలేదు కానీ.. కనీసం మారడోనా గౌరవార్థం ఆయనకు ఒక మ్యాచ్‌ విజయాన్ని అంకితమిస్తే బాగుండేదని అభిప్రాయపడింది. ఈ విషయాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొంది.

అయితే మారడోనాను అర్జెంటీనా జట్టు ఎప్పుడు అవమానపరచలేదంటూ ఒక వార్తాసంస్థ తన కథనంలో పేర్కొంది. ఫిఫా వరల్డ్‌కప్‌లో అర్జెంటీనా ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ మ్యాచ్‌ ప్రారంభమైన పది నిమిషాల తర్వాత మారడోనా సేవలకు గుర్తుగా పాటలు, బ్యానర్లు ప్రదర్శించడం చేస్తున్నారని పేర్కొంది. ఇక పీలే, మారడోనా జెర్సీ నెంబర్‌లు 10 అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే అర్జెంటీనా, బ్రెజిల్‌లు క్వార్టర్స్‌లో అడుగుపెట్టాయి. డిసెంబర్‌ 7న జరిగే క్వార్టర్‌ ఫైనల్లో అర్జెంటీనా.. నెదర్లాండ్స్‌ను ఎదుర్కోనుండగా.. డిసెంబర్‌ 9న బ్రెజిల్‌.. క్రొయేషియాతో అమితుమీ తేల్చుకోనుంది.

A post shared by Gianinna Maradona 🧿 (@giamaradona)

చదవండి: FIFA WC: జపాన్‌ను అవమానించిన క్రొయేషియా సుందరి

FIFA WC 2022: రొనాల్డో కోసం ఏదైనా.. టాప్‌లెస్‌గా దర్శనం

మరిన్ని వార్తలు