Marcus Stoinis: కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌.. ఆ ఒక్క సెంచరీ వెనుక విషాద కథ

7 Jun, 2022 17:46 IST|Sakshi

ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మార్కస్‌ స్టోయినిస్‌ గురించి కొత్తగా పరిచయం అక్కర్లేదు. టి20 క్రికెట్‌లో విధ్వంసకర ఆటకు పెట్టింది పేరు. ఇటీవలే ఐపీఎల్‌ 2022 సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్‌కు ఆడిన స్టోయినిస్‌ 11 మ్యాచ్‌ల్లో 156 పరుగులు మాత్రమే చేసి అంతగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే కొన్ని కీలక ఇన్నింగ్స్‌లతో మాత్రం మెరిశాడు. ఇక ఆస్ట్రేలియా తరపున 48 మ్యాచ్‌ల్లో 1200 పరుగులు సాధించాడు. స్టోయినిస్‌ ఖాతాలో ఆరు హాఫ్‌ సెంచరీలు.. ఒక సెంచరీ ఉన్నాయి.

ఆరోజు మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ 286 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌లో పూర్తిగా తడబడింది. 67 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. అప్పుడు మార్కస్‌ స్టోయినిస్‌ క్రీజులోకి వచ్చాడు. టాపార్డర్‌, మిడిలార్డర్‌ విఫలమైనవేళ లోయర్‌ ఆర్డర్‌లో జేమ్స్‌ ఫాల్కనర్‌(25), పాట్‌ కమిన్స్‌(36)తో కలిసి కీలక భాగస్వామ్యాలు నిర్మించి జట్టును విజయం వైపు నడిపించాడు. ఓవరాల్‌గా 117 బంతుల్లో 9 ఫోర్లు, 11 సిక్సర్లతో 146 పరుగులు నాటౌట్‌గా నిలిచాడు. అతని దాటికి ఆసీస్‌ విజయానికి చేరువగా వచ్చినప్పటికి ఆరు పరుగుల తేడాతో పరాజయం చవిచూసింది.


ఒక రకంగా ఆసీస్‌ ఓటమి పాలైనప్పటికి స్టోయినిస్‌కు ఆ సెంచరీ ఒక టర్నింగ్‌ పాయింట్‌ అని చెప్పొచ్చు. తాజాగా ఆ సెంచరీ వెనుక ఉన్న ఒక విషాద కథను స్టోయినిస్‌ తాజాగా రివీల్‌ చేశాడు. స్టోయినిస్‌ సెంచరీ చేసే సమయానికి అతని తండ్రి ఆసుపత్రి బెడ్‌పై ఉన్నాడు. క్యాన్సర్‌ మహమ్మారితో పోరాడుతున్న తండ్రి కీమోథెరపీ చికిత్స తీసుకుంటున్నాడు. ''నేను వన్డేల్లో తొలి సెంచరీ సాధించిన రోజున నా తండ్రి ఆసుపత్రిలో కీమో థెరపీ చేయించుకుంటున్నాడు. నేను సెంచరీ చేశానన్న విషయం తెలుసుకున్న నా తండ్రి అక్కడున్న అన్ని టీవీలను ఆన్‌ చేశాడు. కానీ ఏ ఒక్క దాంట్లోనూ నేను ఆడుతున్న మ్యాచ్‌ కనిపించలేదట.

దీంతో అక్కడున్న నర్సును పిలిచి.. నా కొడుకు ఇవాళ సెంచరీ సాధించాడు.. దానిని నా కళ్లతో చూడాలి అని కోరాడు. వెంటనే ఆసుపత్రి సిబ్బందితో మాట్లాడి నా తండ్రి కోసం సదరు చానెల్‌ను పెట్టారు. ఆ క్షణంలో నా సెంచరీని టీవీలో కళ్లారా చూసిన నాన్న కళ్లను చమర్చడం నర్సు ఆ తర్వాత చెప్పుకొచ్చింది. నా జీవితంలో అది ఎంతో సంతోష క్షణం. ఆ తర్వాత కొన్నాళ్లకే నాన్న క్యాన్సర్‌ మహమ్మారితో కన్నుమూశారు. నా కెరీర్‌కు టర్నింగ్‌ పాయింట్‌ అయిన సెంచరీ ఆ తర్వాత ఒక విషాదాన్ని తీసుకువస్తుందని ఊహించలేదు'' అంటూ చెప్పుకొచ్చాడు.

చదవండి: Suved Parkar Ranji Debut: రహానే స్థానంలో అరంగేట్రం.. డబుల్‌ సెంచరీతో కొత్త చరిత్ర

మరిన్ని వార్తలు