'బ్యాటింగ్‌ ఆర్డర్‌ గురించి బాత్‌రూంలో చర్చించుకున్నాం'

13 Apr, 2023 17:06 IST|Sakshi
Photo: IPL Twitter

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌ బోణీ చేసింది.  ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఉత్కంఠపోరులో ఆఖరి బంతికి విజయం సాధించింది. అయితే ఇదే మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌ సమయంలో సూర్యకుమార్‌ గాయపడిన సంగతి తెలిసిందే. అక్షర్‌ పటేల్‌ కొట్టిన భారీ సిక్సర్‌ను అడ్డుకునే ప్రయత్నంలో కంటి పైభాగాన్ని బంతి చీల్చుకొని వెళ్లింది. దీంతో సూర్య కంటికి కుట్లు కూడా పడ్డాయి. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన సూర్య గోల్డెన్‌ డకౌట్‌ అయి విమర్శలు మూటగట్టుకున్నాడు. కానీ ముంబై ఇండియన్స్‌ హెడ్‌కోచ్‌ మార్క్‌ బౌచర్‌ మాత్రం సూర్యపై ప్రశంసల వర్షం కురిపించాడు. 

కంటికి గాయమైన తర్వాత కూడా తనకు ఆటపై ఉన్న నిబద్ధత కనిపించిందని.. అందుకే ముంబై ఇండియన్స్‌ ఇన్నింగ్స్‌ ప్రారంభానికి ముందు బాత్‌రూంలో కలిసినప్పుడు తాను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తానని పేర్కొన్నాడు. యూ ట్యూట్‌ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బౌచర్‌ ఇలా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

''ఢిల్లీ క్యాపిటల్స్‌ ఇన్నింగ్స్‌ సమయంలో సూర్యకు గాయం కావడంతో బ్యాటింగ్‌ ఆర్డర్‌లో కింద పంపించాలని నిర్ణయించాం. అప్పటికి సూర్య తన కంటి బాగానికి ఐస్‌ప్యాక్‌ అప్లై చేస్తున్నాడు. ఒకవేళ పరిస్థితి అనుకూలంగా లేకుంటే అతని ప్లేస్‌లో మరో ఆటగాడిని ఇంపాక్ట్‌ కింద వాడుకుందామని చెప్పాను.

మరి ఇది విన్నాడో లేదో తెలియదు కానీ ఆ తర్వాత సూర్య, నేను బాత్‌రూం వెళ్లే దారిలో కలిశాం. ఆ సమయంలో సూర్య నా దగ్గరికి వచ్చి మ్యాచ్‌లో నేను బ్యాటింగ్‌ ఆర్డర్‌ మారే ఆలోచన లేదు.. నాలుగో స్థానంలోనే వస్తా అని నమ్మకంగా చెప్పాడు. అతని కాన్ఫిడెంట్‌కు నేను ఫిదా అయ్యా. సూర్య ఆడకున్నా పర్వాలేదు.. అతను నాలుగో స్థానంలోనే బ్యాటింగ్‌ దిగుతాడు అని ఫిక్స్‌ అయ్యాం. '' అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌పై నెగ్గి సీజన్‌లో బోణీ చేసిన ముంబై ఇండియన్స్‌ తన తర్వాతి మ్యాచ్‌ కేకేఆర్‌తో ఏప్రిల్‌ 16న వాంఖడేలో ఆడనుంది.

చదవండి: ఐపీఎల్‌లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ బౌలర్‌.. తొలుత ఎవరూ కొనలేదు, ఇప్పుడు తెలిసొచ్చింది..!

మరిన్ని వార్తలు