డివిలియర్స్‌ అందుకే ఒప్పుకోలేదు.. కానీ సరైన నిర్ణయం

19 May, 2021 18:10 IST|Sakshi

జోహన్నెస్‌బర్గ్‌: విధ్వంసకర ఆటగాడు ఏబీ డివిలియర్స్‌  అంతర్జాతీయ క్రికెట్‌లో పునరాగమనం చేయడం లేదని దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు (సీఎస్‌ఏ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. దక్షిణాఫ్రికా క్రికెట్‌ చరిత్రలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌లో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్న 37 ఏళ్ల డివిలియర్స్‌ అనూహ్యంగా 2018 మే నెలలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించాడు.  అప్పటి నుంచే అతని పునరాగమనంపై పదే పదే వార్తలు వచ్చాయి. అతని మాజీ సహచరులు గ్రేమ్‌ స్మిత్, మార్క్‌ బౌచర్‌లు బోర్డులో కీలకపాత్ర పోషిస్తుండటంతో ఈ ఏడాది భారత్‌లో జరిగే టి20 ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా తరఫున కచ్చితంగా ఆడతాడనే ప్రచారం జరిగింది. కానీ ఈ వార్తలను తోసి పుచ్చుతూ సీఎస్‌ఏ చేసిన ప్రకటనతో డివిలియర్స్‌ కెరీర్‌ ముగిసినట్లు స్పష్టమైపోయింది.

ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా కోచ్‌ మార్క్‌ బౌచర్‌ డివిలియర్స్‌ అంశంపై స్పందించాడు. ''ఏబీ విషయంలో ఇది నిజంగా దురదృష్టకరం. 2018లో అతను తీసుకున్న నిర్ణయాన్ని మేం గౌరవించాం. కానీ తనకు మళ్లీ ఆడాలని ఉందనే కోరికను బయటపెట్టాడు. జట్టులోకి అతని పునరాగమనం కోసం బోర్డు సభ్యులతో చాలాసార్లు చర్చించాం. కానీ అనూహ్యంగా కొత్తవాళ్లకు అవకాశం ఇచ్చేందుకు తాను ఇక జట్టులోకి రాకపోవచ్చు అనే సంకేతాలు డివిలియర్స్‌ బోర్డుకు పంపించడంతో అతని అంతర్జాతీయ కెరీర్‌ ముగిసిపోయింది. ఆ విషయాన్ని మేము అర్థం చేసుకున్నాం. అతను ఎంత గొప్ప ఆటగాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికీ టీ20ల్లో బెస్ట్‌ ఫినిషర్‌గా నిలుస్తూ వచ్చాడు. అందుకు ఐపీఎల్‌ చక్కటి ఉదాహరణ. ఒక బోర్డులో సభ్యునిగా ఉత్తమంగా రాణిస్తున్న ఆటగాళ్లను జట్టులోకి తీసుకువచ్చే బాధ్యత నాపై ఉంది. ఏబీ డివిలియర్స్‌ విషయంలో కూడా అదే భావించాను. అతను జట్టులో ఉంటే ఆటగాళ్లకు మంచి ఎనర్జీ ఉంటుంది. కానీ ఏబీ నిర్ణయాన్ని మేం గౌరవించాల్సిందే. ఇక ఈ విషయాన్ని మరిచిపోయి ముందుకు సాగుదాం'' అంటూ చెప్పుకొచ్చాడు.

ఏబీ డివిలియర్స్‌ 2004లో టెస్టు మ్యాచ్‌ ద్వారా దక్షిణాఫ్రికా తరపున అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. అనతికాలంలోనే విధ్వంసకర బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మైదానం నలువైపులా షాట్లు కొడుతూ మిస్టర్‌ 360 అనే పేరును ఏబీ సార్థకం చేసుకున్నాడు.అంతేగాక దక్షిణాఫ్రికాకు మూడు ఫార్మాట్లలోనూ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఏబీ తన 15 ఏళ్ల కెరీర్‌లో దక్షిణాఫ్రికా తరపున 114 టెస్టుల్లో 8765, 228 వన్డేల్లో 9557, 78 టీ20ల్లో 1672 పరుగులు సాధించాడు. ఇందులో టెస్టుల్లో 22 సెంచరీలు.. వన్డేల్లో 22 సెంచరీలు ఉన్నాయి. ఇక ఐపీఎల్‌లోనూ డివిలియర్స్‌ తన ప్రత్యేకతను చూపించాడు. ఆరంభంలో ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఆడిన ఏబీడీ ఆర్‌సీబీకి వెళ్లిన తర్వాత ఫ్యాన్స్‌కు మరింత దగ్గరయ్యాడు. ఐపీఎల్‌లో ఎన్నో భీకరమైన ఇన్నింగ్స్‌లు ఆడిన డివిలియర్స్‌ ఇప్పటివరకు మొత్తంగా 176 మ్యాచ్‌లాడి 5056 పరుగులు చేశాడు.
చదవండి: డివిలియర్స్‌పై కీలక ప్రకటన చేసిన దక్షిణాఫ్రికా బోర్డు

ఇండియాకు వచ్చెయ్‌.. పంత్‌​ స్థానంలో ఆడు!

మరిన్ని వార్తలు