Test Cricket: రూట్‌ త్వరలోనే సచిన్‌ రికార్డు బద్దలు కొడతాడు: ఆసీస్‌ మాజీ కెప్టెన్‌

6 Jun, 2022 09:57 IST|Sakshi

England Vs New Zealand Test Series 2022: ఇంగ్లండ్‌ స్టార్‌ బ్యాటర్‌ జో రూట్‌ను ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మార్క్‌ టేలర్‌ ప్రశంసల్లో ముంచెత్తాడు. అతడి భీకర ఫామ్‌ ఇలాగే కొనసాగితే త్వరలోనే టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ రికార్డు బద్దలయ్యే అవకాశం ఉందంటూ ఆకాశానికెత్తాడు. 31 ఏళ్ల రూట్‌ ఇంకో ఐదేళ్లు పాటు ఆడగలడని, కాబట్టి ఇది అసాధ్యమేమీ కాదని చెప్పుకొచ్చాడు.

కాగా న్యూజిలాండ్‌ స్వదేశంలో జరిగిన తొలి టెస్టు సందర్భంగా జో రూట్‌ తన కెరీర్‌లో అరుదైన మైలురాయిని చేరుకున్న విషయం తెలిసిందే. ప్రఖ్యాత లార్డ్స్‌ వేదికగా సాగిన ఈ మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 11 పరుగులకే పరిమితం అయిన రూట్‌.. రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం 115 పరుగులతో అజేయంగా నిలిచాడు. తద్వారా ఇంగ్లండ్‌ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా నిలిచాడు.

ఇంకో ఐదేళ్లు... కాబట్టి
ఇక ఈ మ్యాచ్‌లో అద్భుత ఇన్నింగ్స్‌తో 26వ టెస్టు సెంచరీ నమోదు చేసిన జో రూట్‌.. టెస్టుల్లో 10 వేల మార్కును అందుకున్నాడు. తద్వారా ఈ ఘనత సాధించిన అత్యంత పిన్నవయస్కుడిగా చరిత్రకెక్కిన అలిస్టర్‌ కుక్‌ రికార్డును బద్దలుకొట్టాడు. ఈ నేపథ్యంలో రూట్‌ను అభినందించిన టేలర్‌.. ‘‘రూట్‌ కనీసం ఇంకో ఐదేళ్ల పాటు ఆటలో కొనసాగుతాడు.

కాబట్టి టెండుల్కర్‌ రికార్డును అధిగమించడం అసాధ్యమేమీ కాదు. గత రెండేళ్లుగా ముఖ్యంగా 18 నెలలుగా అతడి బ్యాటింగ్‌ అమోఘం. రూట్‌ మాంచి ఫామ్‌లో ఉన్నాడు. ఒకవేళ తను ఫిట్‌గా ఉండి ఇలాగే ఆటను కొనసాగిస్తే 15 వేలకు పైచిలుకు పరుగులు పెద్ద కష్టమమేమీ కాదు’’ అని అభిప్రాయపడ్డాడు. కాగా సచిన్‌ టెస్టుల్లో 15921 పరుగులు చేసి ఈ ఘనత సాధించిన క్రికెటర్ల జాబితాలో ముందున్న విషయం తెలిసిందే.

వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్‌.. విమర్శకులకు బ్యాట్‌తో సమాధానం
ఇదిలా ఉంటే.. ఇంగ్లండ్‌ మాజీ సారథి నాసిర్‌ హుసేన్‌ సైతం.. రూట్‌ను వరల్డ్‌క్లాస్‌ ప్లేయర్‌ అంటూ కొనియాడాడు. అద్భుతమైన టెక్నిక్‌ అతడి సొంతమని.. టెస్టు క్రికెట్‌లో రూట్‌ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించాడు.

కాగా బ్యాటర్‌గా రాణించినా.. తన కెప్టెన్సీలో ఇంగ్లండ్‌ వరుస పరాజయాలు చవిచూడటంతో రూట్‌ ఇటీవలే టెస్టు సారథ్య బాధ్యతల నుంచి తప్పుకొన్నాడు. బెన్‌ స్టోక్స్‌ రూట్‌ స్థానాన్ని భర్తీ చేయగా.. అతడు బ్యాట్‌ ఝులిపిస్తూ అందరిచేతా ప్రశంసలు అందుకుంటున్నాడు. తనను విమర్శించిన వారికి బ్యాట్‌తో సమాధానం చెబుతున్నాడు.

చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టీ20.. వెంకటేష్ అయ్యర్‌, దినేష్ కార్తీక్‌కు నో ఛాన్స్‌..!

మరిన్ని వార్తలు