Mary Kom: ఆ నిర్ణయం దురదృష్టకరం, మేరీ కోమ్‌ భావోద్వేగం​

29 Jul, 2021 21:17 IST|Sakshi

మేరీకోమ్  అనూహ్య నిష్క్రమణ   

పతకంతో వస్తాననుకున్నా కన్నీటి పర్యంతమైన మేరీ కోమ్‌

మీరే విజేత అంటూ ప్రశంసలు

టోక్యో ఒలింపిక్స్‌లో భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ (38) నిష్క్రమణ పలువుర్ని షాక్‌కు గురిచేసింది. మహిళల ఫ్లై వెయిట్ బాక్సింగ్ ప్రీ-క్వార్టర్ ఫైనల్లో ఇంగ్రిట్ వాలెన్సియాపై ఓడిన తరువాత మీడియాతో మా‍ట్లాడిన మేరీ కోమ్‌ భావోద్వేగానికి లోనయ్యారు. తాను ఓడిపోయానంటే నమ్మలేకపోతున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. జడ్జెస్‌ నిర్ణయం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పతకంతో తిరిగి వస్తానని అనుకున్నా.. కానీ తన తప్పు ఏమిటో అర్థం కాలేదనీ, దీన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని ఆమె పేర్కొన్నారు.  అయితే 40 ఏళ్ల వయస్సు వరకు తన బాక్సింగ్ వృత్తిని కొనసాగిస్తానని మేరీ కోమ్‌ ప్రకటించారు.  

ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్‌ అయిన మేరీ కోమ్ టోక్యో ఒలింపిక్స్‌లో కొలంబియా ప్రత్యర్థిపై న్యాయ నిర్ణేతల  విభజన నిర్ణయంతో అనూహ్యంగా ఓడిపోయారు. ఈ పరిస్థితిని మేరీ కోమ్‌ కూడా ఊహించలేదు. ఒక దశలో ఇంగ్రిట్ విజేతగాప్రకటించడానికి ముందే విజేతగా మేరీ తన చేయిని పైకి లేపారు. ముగ్గురు  జడ్జిలు  ఇంగ్రిట్‌కు అనుకూలంగా బౌట్ తీర్పు ఇవ్వగా ఇద్దరు  మేరీ కోమ్‌కు మద్దతిచ్చారు.  కానీ పాయింట్ల కేటాయింపులో తేడా మేరీని  విజయానికి దూరం చేసింది. 

మరోవైపు ఇదే విషయంపై కేంద్రమంత్రి కిరణ్‌ రిజిజు కూడా ట్వీట్‌ చేశారు. అందరి దృష్టిలో మీరే విజేత. కానీ న్యాయమూర్తులకు వారి వారి లెక్కలు ఉంటాయంటూ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. ప్రియమైన మేరీ కోమ్, టోక్యో ఒలింపిక్స్‌లో కేవలం ఒక పాయింట్‌తో ఓడిపోయారు. కానీ ఎప్పటికీ మీరే ఛాంపియన్‌ అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో మరే మహిళా బాక్సర్ సాధించనిది మీరు సాధించారన్నారు. మీరొక చరిత్ర. భారతదేశం మిమ్మల్ని చూసి గర్విస్తోందని  కేంద్ర మాజీ క్రీడామంత్రి ప్రశంసించారు. అలాగే ఇతర క్రీడాభిమానులు కూడా మేరీ కోమ్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఓడిపోయినా  ‘యూ ఆర్‌ ది లెజండ్‌.. మీరే విజేత.. మీరే మాకు ఆదర్శం’ అన్న సందేశాలు సోషల్‌ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. 

మరిన్ని వార్తలు