ఆర్మీ స్పోర్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో భారత మహిళా బాక్సర్ల శిబిరం

6 May, 2021 06:10 IST|Sakshi

న్యూఢిల్లీ: పుణేలోని ఆర్మీ స్పోర్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఏఎస్‌ఐ)లో భారత మహిళా బాక్సర్ల టోక్యో ఒలింపిక్స్‌ సన్నాహాలు జరగనున్నాయి. వాస్తవానికి ఢిల్లీలో ఈ శిక్షణ శిబిరం జరగాల్సి ఉన్నా అక్కడ శిక్షణ పొందుతున్న బాక్సర్లతో పాటు సహాయక సిబ్బంది గత నెలలో కరోనా బారిన పడ్డారు. దాంతో శిబిరం వేదికను మార్చాల్సి వచ్చింది. ఈ శిబిరంలో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌ మేరీకోమ్‌ (51 కేజీలు)తో పాటు లవ్లీనా (69 కేజీలు), సిమ్రన్‌జిత్‌ కౌర్‌ (60 కేజీలు) పాల్గొననున్నారు. వీరు ఇప్పటికే టోక్యో బెర్తులను ఖాయం చేసుకున్నారు. టోక్యోకు క్వాలిఫై అయిన మరో బాక్సర్‌ పూజా రాణి (75 కేజీలు) మాత్రం ఈ శిబిరంలో పాల్గొనడం లేదు. ఏఎస్‌ఐలో పాల్గొనే బాక్సర్లను మూడు గ్రూపులుగా విభజించారు.

ప్రతి గ్రూపులోనూ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన బాక్సర్‌తో పాటు ఆమెకు భాగస్వామ్యులుగా ఇద్దరు బాక్సర్లు ఉంటారు. ఇందుకోసం ప్రపంచ యూత్‌ చాంపియన్‌ అరుంధతి చౌదరి (69 కేజీలు), ముంజూ రాణి (48 కేజీలు), సోనియా లాథర్‌ (57 కేజీలు), శశి చోప్రా (64 కేజీలు), జాస్మిన్‌ (57 కేజీలు) లాల్‌బుట్సాహి (64 కేజీలు)లను ఎంపిక చేశారు. గత నెలలో కరోనా బారిన పడి కోలుకుంటున్న మేరీకోమ్‌ కోచ్‌ చోటేలాల్‌ యాదవ్‌ ఆలస్యంగా శిబిరానికి రానున్నట్లు మేరీకోమ్‌ స్వయంగా తెలిపింది. ఒలింపిక్స్‌ కంటే ముందు భారత బాక్సర్లు మే 21 నుంచి జూన్‌ 1 వరకు దుబాయ్‌లో జరిగే ఆసియా చాంపియన్‌షిప్‌లో పాల్గొంటారు. వాస్తవానికి ఈ టోర్నీ ఢిల్లీలో జరగాల్సి ఉన్నా కరోనా వల్ల దుబాయ్‌కు తరలించారు.  

మరిన్ని వార్తలు