Pro Kabaddi League: 59 మంది ఆటగాళ్ల కొనసాగింపు

21 Aug, 2021 04:05 IST|Sakshi

Pro Kabaddi League: ప్రొ కబడ్డీ లీగ్‌ (పీకేఎల్‌ – సీజన్‌ 8) కోసం 59 మంది ఆటగాళ్లను ఆయా ఫ్రాంచైజీలు అట్టి పెట్టుకున్నాయని టోర్నీ ఆర్గనైజర్‌ మషాల్‌ స్పోర్ట్స్‌ శుక్రవారం ప్రకటించింది. ‘మొత్తం మూడు కేటగిరీల్లో 59 మందిని రిటెయిన్‌ చేసుకున్నారు. ఎలైట్‌ రిటెయిన్‌ ప్లేయర్ల (ఈఆర్‌పీ) గ్రూపులో ఉన్న 22 మందిని, రిటెయిన్‌ యంగ్‌ ప్లేయర్ల (ఆర్‌వైపీ) జాబితాలోని ఆరు మందిని, న్యూ యంగ్‌ ప్లేయర్ల (ఎన్‌వైపీ)లో 31 మందిని జట్లు అట్టిపెట్టుకున్నాయి’ అని మషాల్‌ స్పోర్ట్స్‌  పేర్కొంది.

కొనసాగింపు దక్కని ఆటగాళ్లు, ఇతర ప్లేయర్ల ఎంపిక కోసం వేలం ప్రక్రియ నిర్వహిస్తామని తెలిపింది. ముంబైలో ఈ నెల 29 నుంచి 31 వరకు మూడు రోజుల పాటు ఆటగాళ్ల వేలం జరుగుతుంది. డిఫెండింగ్‌ చాంపియన్‌ బెంగాల్‌ వారియర్స్‌ తమ కెప్టెన్‌ మణిందర్‌ సింగ్‌తో పాటు స్టార్‌ ఆటగాడు మొహమ్మద్‌ ఇస్మాయిల్‌ నబీబ„Š  (ఇరాన్‌)ను అట్టిపెట్టుకుంది. అలాగే బెంగళూరు బుల్స్‌ పవన్‌ కుమార్‌ షెరావత్‌ను, దబంగ్‌ ఢిల్లీ కేసీ నవీన్‌ కుమార్‌ను రిటెయిన్‌ చేసుకుంది. అనుభవజ్ఞుడైన ఫజల్‌ అత్రాచలిని యు ముంబా, పర్వేశ్, సునీల్‌లను గుజరాత్‌ జెయింట్స్, వికాస్‌ ఖండోలాను హరియాణా స్టీలర్స్, నితీశ్‌ను యూపీ యోధ జట్లు అట్టిపెట్టుకున్నాయి. కరోనా మహమ్మారి వల్ల గతేడాది ప్రొ కబడ్డీ లీగ్‌ జరగలేదు.

మరిన్ని వార్తలు