డివిలియర్స్‌ విధ్వంసం; ఆర్‌సీబీ మరో విజయం

17 Oct, 2020 19:26 IST|Sakshi
ఏబీ డివిలియర్స్‌( కర్టసీ : బీసీసీఐ)

దుబాయ్‌ : ఐపీఎల్‌13వ సీజన్‌లో ఏబీ డివిలియర్స్ విధ్వంసంతో ఆర్‌సీబీ మరో విజయాన్ని నమోదు చేసింది. దుబాయ్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్‌ విధించిన 178 పరుగుల విజయలక్ష్యాన్ని ఆర్‌సీబీ కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేదించింది. ఆర్‌సీబీ బ్యాట్స్‌మన్లలో డివిలియర్స్‌ 22 బంతుల్లోనే 55* పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఏబీ ఇన్నింగ్స్‌లో 6 సిక్సర్లు, ఒక ఫోర్‌ ఉన్నాయి. మిగిలినవారిలో దేవదూత్‌ పడిక్కల్‌ 35 పరుగులు, ఆరోన్‌ ఫించ్‌ 14 పరుగులు, విరాట్‌ కోహ్లి 43 పరుగులు, గురుకీరత్‌ 19* పరుగులు సాధించారు. రాజస్తాన్‌ బౌలర్లలో శ్రేయాస్‌ గోపాల్‌, కార్తీక్‌ త్యాగి, రాహుల్‌ తెవాటియాలు తలో వికెట్‌ తీశారు.

కాగా ఇన్నింగ్స్‌ మధ్య ఓవర్ల వరకు బెంగళూరును కట్టడి చేస్తూ వచ్చిన రాజస్తాన్‌ బౌలర్లు డివిలియర్స్‌ విధ్వంసానికి చేతులెత్తేశారు. ముఖ్యంగా ఉనద్కత్‌ వేసిన 19వ ఓవర్లో వరుసగా మూడు సిక్సర్లు, మరో ఫోర్‌ బాది 25 పరుగులు రాబట్టిన తీరు ఏబీ విధ్వంసానికి మారుపేర.. ఇదే ఓవర్‌లోనూ మ్యాచ్‌ మలుపు తిరగడం విశేషం.ఈ మ్యాచ్‌లో విజయంతో ఆర్‌సీబీ 12 పాయింట్లతో మూడో స్థానంలో.. ఆర్‌ఆర్‌ 6 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. (చదవండి : స్మిత్‌,ఊతప్పల జోరు.. ఆర్‌సీబీ లక్ష్యం 178)

అంతకముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఏంచుకున్న రాజస్థాన్‌ రాయల్స్‌ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. ఓపెనర్‌గా వచ్చిన రాబిన్‌ ఊతప్ప (41: 22 బంతుల్లో 7ఫోర్లు, సిక్స్‌) జట్టుకు మంచి శుభారంభాన్ని ఇచ్చాడు. ఆ తర్వాత కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌(57: 36 బంతుల్లో 6ఫోర్లు, సిక్స్‌) అర్థసెంచరీతో మెరవగా, జోస్‌ బట్లర్‌(24 25 బంతుల్లో ఫోర్‌, సిక్సర్‌) ఫర్వాలేదనిపించాడు. కాగా రాజస్థాన్‌ ఇన్నింగ్స్‌ 13వ ఓవర్‌లో 100 పరుగులు దాటింది.  స్మిత్‌, బట్లర్‌లు కలసి 58  పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.  చాహల్‌ వేసిన 18వ ఓవర్లో 3 ఫోర్లు బాదిన స్మిత్‌ 17 రన్స్‌ రాబట్టాడు.  ఈ క్రమంలోనే 30 బంతుల్లో అర్థసెంచరీ పూర్తి చేసుకున్న కాసేపటికే స్మిత్‌ అవుటయ్యాడు. కాగా 19వ ఓవర్లో రాహుల్‌ తెవాటియా ఫోర్‌, సిక్సర్‌తో15 పరుగులు సాధించడంతో ఆర్‌ఆర్‌  గౌరవప్రదమైన స్కోరు సాధించింది. బెంగళూరు బౌలర్లలో చాహల్‌(2/34), క్రిస్‌ మోరీస్‌(4/26) రాజస్థాన్‌ను దెబ్బకొట్టారు. 

మరిన్ని వార్తలు